Friday, January 3, 2025

హత్య చేయవలసినవారి జాబితా రాసుకుంటాడు, పని కాగానే పేరు కిొట్టేస్తాడు: గోగీ నేరనేపథ్యం

గోగీ, తిల్లూ

  • దిల్లీ కోర్టులో గ్యాంగ్ లీడర్ గోగీ హత్య, హంతకులు ఇద్దరినీ కాల్చివేసిన పోలీసులు
  • గ్యాంగ్ వార్ తో దిల్లీ, హరియాణా లు సతమతం
  • గోగీ, తిల్లూ వర్గాల హింసాకాండ
  • గోగీ నేపథ్యం ఏమిటి?

దిల్లీ కోర్టులో వైరివర్గంవారు జరిపిన కాల్పులలో మరణించిన భయంకరమైన గూండా జితేందర్ మాన్ ఉరఫ్ గోగీకి ఐదారు తూటాలూ తగిలాయి. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెడితే అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలోని కోర్టులో హాజరు పరిచిన గోగీని ప్రత్యర్థిగ్యాంగు నాయకుడు తిల్లూ మనుషులు లాయర్ల వేషంలో కోర్టులో ప్రవేశించి కాల్పులు జరిపారు. అయిదారు తూటాలూ గుండెలో దిగడంతో అక్కడికక్కడే గోగీ మరణించాడు. అతనిపై కాల్పులు జరిపిన ఇద్దరినీ దిల్లీ ప్రత్యేక సెల్ కు చెందిన భద్రతాసిబ్బంది కాల్చి చంపారు. ఈ కాల్పులలో కొంతమంది గాయపడినారు. మొత్తం ఈ ఘటనలో ముగ్గురు మరణించారని దిల్లీ పోలీసు కమిషనర్ ఆస్థానా ప్రకటించారు. దిల్లీ కోర్టులో ఈ ఘటనను ఖండించిన సుప్రీంకోర్టు కోర్టులలో భద్రత గురించి ఆందోళన వెలిబుచ్చింది.

అలీపూర్, సోనీపత్ లో గోగీ, సునీల్ ఉరఫ్ తిల్లూ జనాలను బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో కొన్నేళ్ళుగా ఉన్నారు. రెండు గ్యాంగుల మధ్య పోరాటాలు జరిగేవి. ఇరువర్గాలకు చెందిన చాలామంది మరణించారు. గత ఆరేడు సంవత్సరాలలో రెండు ముఠాలకూ చెందిన పదిమంది వరకూ హతులైనారు. గోగీ ఆచూకీకోసం తల్లి పద్మేశ్వరిని అధికారులు రెండేళ్ళ కిందట ప్రశ్నించారు. తాను అయిదేళ్ళుగా గోగీతో మాట్లాడలేదనీ, తమ బాగోగులు సైతం అతడు పట్టించుకోవడం లేదనీ, ఈ ముఠా పోరాటాలు నిలిచిపోవాలని తాము కోరుకుంటున్నామని ఆమె అధికారులకు చెప్పింది. అతడికోసం మంచి అమ్మాయిని చూశామనీ, ఆమె ను చూడటానికి కూడా అతడు రావడం లేదనీ, అతడు పెళ్ళి చేసుకొని స్థిరపడాలన్నది తమ సంకల్పమనీ చెప్పింది.

దిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికలలో వైరివర్గంవారిని కాల్చిచంపడంతో ప్రారంభమైన గోగీ నేరస్థ జీవితం క్రమంగా మరింత నేరగ్రస్తంగా మారింది. దిల్లీ ప్రత్యేక పోలీసు బృందాలలో 70 శాతం మంది 26 ఏళ్ళ గోగీకోసం వెతుకుతున్నారని నిరుడు మార్చిలో అతడిని అరెస్టు చేయడానికి ముందు పోలీసులు చెప్పారు. గోగీని గతంలో అరెస్టు చేసి హరియాణాలోని బహదూర్ గంజ్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెడుతుంటే 30 జూన్ 2016 న తప్పించుకున్నాడు. మళ్లీ నాలుగేళ్ళ వరకూ మళ్ళీ చిక్కలేదు. తప్పించుకొని పోయి మళ్ళీ అరెస్టయ్యే లోపు గోగీ కనీసం నాలుగు హత్యలు చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఇందుకు ప్రతీకారంగా తిల్లూ వర్గం గోగీకి అత్యంత ఆప్తుడైన మోనూ మాన్ ను ఈ సంవత్సరం మార్చి 16న హత్య చేసింది. తాజ్ పూర్ కలాన్ గ్రామానికి చెందిన తిల్లూ ప్రస్తుతం సోనీపట్ జైలులో ఉన్నాడు.

ఇటువంటి హత్యలూ, ప్రతీకార హత్యలు దిల్లీలో 1980లో విచ్చలవిడిగా జరిగేవి. నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులకు పదేళ్ళు పట్టింది. సోనీ దరియాపూర్ అరెస్టు తర్వాత గోగీ దిల్లీలో ‘మోస్ట్ వాంటెడ్ క్రిమినల్’ జాబితాలో మొదటి స్థానం ఆక్రమించాడు. ఇతర నేరస్థుల మాదిరి గోగీ నిరక్షరకుక్షి కాడు. పన్నెండో తరగతి పాసైనాడు. తెలివైనవాళ్ళతో సమయం గడపడానికి ఇష్టపడతారు. తిల్లూ గ్యాంగ్ ను తుదముట్టించాలన్నది అతడి లక్ష్యం. గోగీ జన్మస్థానం అలీపూర్. తిల్లూది తాజాపూర్ కలాన్. ఈ రెండు గ్రామాల నుంచీ రెండు ముఠాలలో యువకులు ప్రవేశిస్తున్నారు. తిల్లూను చంపేవరకూ గోగీ విశ్రమించడు. తిల్లూ జైల్లో ఉన్నప్పటికీ అతడిని ఎట్లా అంతం చేయాలన్నదే గోగీ ఆలోచన అని పోలీసులు అంటారు.

గోగీ వాలీబాల్ ఆటగాడు. తన స్కూల్ జట్టులో ఆడేవాడు. చాలా మెడల్స్ గెలుచుకున్నాడు. తన 17వ ఏట ప్రమాదంలో భుజం ఎముక విరిగింది. అప్పటి నుంచి వాలీబాల్ ఆడలేదు. సునీల్, గోగీ బాల్యమిత్రులు. చివరికి బద్ధశత్రువులుగా మారారు. ఒకరిని ఒకరు చంపుకోవడమే లక్ష్యంగా జీవించారు. గోగీ అన్న దవీందర్ టెంపోలు నడిపేవాడు. తండ్రి మెహర్ సింగ్ వ్యవసాయం చేసేవాడు. జాట్ కులానికి చెందిన మెహర్ సింగ్ కు కాన్సర్ వ్యాధి సోకింది. తిల్లూ గ్యాంగ్ తో దిల్లీ యూనివర్శిటీ ఎన్నికలలో గోగీ గ్యాంగ్ తలబడింది. అప్పటి నుంచి వైరం పెరిగి పెద్దదయింది. తిల్లూ సన్నిహితుడు దీపక్ గోగీ వేలువిడిచిన సోదరిని ప్రేమించేవాడు. గోగీ ఇంటికి అల్లుడినై వస్తానంటూ ఏడిపించేవాడు. దీపక్ ను 20 జనవరి 2015నాడు గోగీ హత్య చేశాడు.

స్వామీ శ్రద్ధానంద్ కళాశాలలో విద్యార్థి ఎన్నికలు ఎప్పుడైనా తీవ్రంగా పోటాపోటీగా  జరుగుతాయి. అలీపూర్, తాజ్ పూర్ కలాన్ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు గ్యాంగుల మద్దతుతో కొట్లాటలకు దిగేవారు. అరుణ్ ఉరఫ్ కమాండో విద్యార్థిసంఘం ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేశాడు. కమాండోను గోగీ బలపరిచాడు. అతడి ప్రత్యర్థిని తుల్లూ సమర్థించాడు. తుల్లూ గ్యాంగ్ చెందిన వ్యక్తులపైన దాడి చేశాడనే ఆరోపణపైన కమాండోను పోలీసులు అరెస్టు చేశారు. చేతులకు బేడీలతోనే కాలేజీకి వచ్చి పరీక్ష రాశాడు కమాండో. కానీ అతడు పరీక్ష తప్పాడు. దీపక్ హత్యకు ప్రతీకారంగా తిల్లూ గ్యాంగ్ కమాండోను చంపివేసింది. పెళ్ళి చేసుకొని జీవితంలో స్థిరపడాలని తిల్లూకు (సునీల్ కు) తండ్రి సులాత్ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. సునీల్ కోపంగా దూరంగా వెళ్ళిపోయేవాడు. అలీపూర్ లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని గోగీ గ్యాంగ్ లో చేరకుండా చూసేందుకు విశ్వప్రయత్నం చేశారు. పంటల మీద రాబడి తగ్గిపోవడం, పట్టణీకరణ కారణంగా సుఖాలకు అవకాశాలు పెరగడంతో గ్రామీణ యువకులు గ్యాంగ్ లవైపు మొగ్గుచూపుతున్నారు. పైగా దాన్ని వారు భాయిచారాగా (సోదర సంఘీభావం) అభివర్ణించేవారు.   

కమాండర్ హత్య తర్వాత పోలీసులు పెట్టిన కేసులో ఒక సాక్షిని తనకు అనుకూలంగా చెప్పమని తుల్లీ ఒత్తిడి చేశాడు. సాక్షి తన మాట వినలేదనే కోపంతో అతడిని హత్య చేశాడు. జైలులో స్నేహితుడైన కరాలా కోసం అతని మరదలు, ప్రముఖ గాయని హర్షితపైన గుళ్ళవర్షం కురిపించి చంపివేశాడు గోగీ. తిల్లూ సన్నిహితులు ఇద్దరిని కూడా చంపాడు. ఎవరెవరని చంపాలనుకుంటున్నాడో వారి పేర్లను డెయిరీలో రాసుకోవడం గోగీకి అలవాటు. ఒక వ్యక్తిని చంపిన తర్వాత ఆ వ్యక్తిపేరును జాబితాలో కొట్టివేస్తాడు. అదొక పద్ధతిగా పెట్టుకున్నాడు. తుల్లీ శుక్రవారంనాడు గోగీని చంపించి అతడి పేరే కొట్టివేయించాడు.

Also read: దిల్లీకోర్టులో కాల్పులు, ముగ్గురు గూండాల మృతి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles