అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు బుధవారంనాడు సస్పెండ్ చేసింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలైనాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పిటిషన్ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనివల్ల సామాన్య భక్తులపైన భారం పడుతుందని పిటిషనర్లు అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు జరిపినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. ఇంతపెద్ద సంఖ్యలో ఆహ్వానితులను నియమించడం అనుచితమనీ, ప్రభుత్వం అడ్డగోలుగా, ఎవరిని పడితే వారిని ఆహ్వానితులుగా నియమించిందని పిటిషనర్లు ఆరోపించారు.
తితిదే బోర్డు సభ్యుల నియామకంపైన కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులనూ, విచారణలో ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం ఆ పవిత్ర సంస్థ పరువు తీయడమేనని విమర్శకులు అన్నారు.