గాంధీయే మార్గం-12
(తొలి భారతీయ పర్యావరణ వేత్త జె.సి.కుమారప్ప- రెండవ, చివరి భాగం)
అది 1929!
జె.సి. కుమారప్ప భారతదేశానికి తిరిగి వచ్చారు. ‘ఇండియన్ పబ్లిక్ ఫైనాన్స్’ గురించి తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాలని భావించాడు. గాంధీజీతో ముందుమాట రాయిస్తే బావుంటుందని మిత్రుడు సి.హెచ్. సొపారివాలా సూచిస్తే, కుమారప్ప ఉత్తరం రాశారు. సబర్మతి ఆశ్రమంలో ఫలానా రోజు గాంధీజీన కలువవచ్చని ప్యారేలాల్ జవాబు ఇచ్చారు. వెళ్ళాక , అతిథులకు ఇచ్చే గదిని చూసి కుమారప్ప గుండె చెరువయ్యింది. ఒక చార్ పాయ్ (మంచం) తప్పా మరేమీ లేదు. టాయ్ లెట్ వ్యవహారం చూస్తే – ఎంత త్వరగా బయటపడితే అంత మేలనుకున్నాడు. అప్పాయింట్ మెంట్ మధ్యాహ్నం రెండు గంటలకు కనుక , సబర్మతీ నదీతీరంలో అలా తిరిగి, గాంధీజీన కలవడానికి బయలుదేరారు.
Also read: అవును… నేడు గాంధీయే మార్గం!
దారిలో ఒక చెట్టు కింద ఓ ముసలాయన రాట్నం వడకటం గమనించి, అలాగే చూస్తూ ఆగిపోయారు. ఓ ఐదు నిమిషాల తర్వాత, ఆ వృద్ధుడు కళ్ళు తెరచి ‘కుమారప్ప గదా?’ అని ప్రశ్నించారు. దానికి అదిరిపడిన కుమారప్పకు తనను అడిగింది గాంధీజీ అని గుర్తించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అంతే, అక్కడే, అలాగే మట్టిలో కూర్చుండిపోయాడు. అలా కూర్చోవడం ఆయనకు అలవాటు లేదు. సిల్కు దుస్తులు పాడయినా అక్కడే కూర్చున్నారు. అదీ కుమారప్పకు తొలి గాంధీజీ సమావేశం!
Also read: రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి
యంగ్ ఇండియాలో వ్యాసపరంపర
అంతేకాదు, కుమారప్ప రాసిన సిద్ధాంత వ్యాసాన్ని ‘యంగ్ ఇండియా’ పత్రికలో ధారావాహికంగా ప్రచురించే ఆలోచన ఉందని గాంధీజీ తెలిపారు. గుజరాత్ లో ఓ రూరల్ సర్వేను చేపట్టమని కుమారప్పను కోరితే, భాష తెలియదనే సమాధానానికి గాంధీజీ అది అవరోధం కాదన్నారు. కుమారప్ప వ్యాసాల ప్రచురణ మొదలయ్యింది. అది దండియాత్ర సమయం! మరోవైపు కుమారప్ప తన సర్వేలో దిగిపోయారు. గాంధీజీతో చర్చించాలని కుమారప్ప ‘కరడి’ కి వెళ్ళారు, అక్కడ గాంధీజీ దండియాత్రలో భాగంగా క్యాంపులో ఉన్నారు. అప్పటికే ప్రచురింపబడిన కుమారప్ప వ్యాసాలను గాంధీ చిన్న పుస్తకంగా వెలువరించాలని భావించారు. దానికి గాంధీజీ ముందుమాట రాస్తే బావుంటుందని, కుమారప్ప ఒక ముందు మాటను కూడా సిద్ధం చేసుకుని వెళ్ళారు.
Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?
తను రాయాల్సిన ముందుమాట తనే రాస్తానని గాంధీజీ సున్నితంగా తిరస్కరించారు. దండియాత్రలో తను, మహదేవదేశాయి అరెస్టు అయిన పక్షంలో కుమారప్ప రెగ్యులర్ గా ‘యంగ్ ఇండియా’లో రాయగలరా అని గాంధీజీ ప్రశ్నించారు. తనకు ఆడిటింగ్ వ్యవహారాలు తప్పా పత్రికలకు రాయడం తెలియదని కుమారప్ప జవాబు. ఆ వ్యవహారాన్ని ఎడిటర్ గా తను నిర్ణయిస్తానని చెప్పగానే, కుమారప్ప రాయడం ప్రారంభించారు. అంతేకాదు ఈ రచనలతో కుమారప్ప జైలుపాలయ్యారు. ఫలితంగా, కుమారప్ప ఆడిటర్ గా అదృశ్యమై, పూర్తి స్థానిక దృష్టిగల ఆలోచనాత్మక జాతీయవాదిగా మారిపోయాడు!
Also read: గాంధీజీ అవసరం నేడు ఎక్కడెక్కడ?
ఖేడా జిల్లాలో ఆర్థిక సర్వే
1930లో గుజరాత్ లోని ఖేడా జిల్లా మాటర్ తాలూకాలో ఎకనమిక్ సర్వేను ప్రారంభించారు. 1931లో తొలిసారి అహ్మదాబాద్ లో జైలు శిక్షను అనుభవించారు. గాంధీ-ఇర్విన్ ఒడంబడికలో భాగంగా , 1931 మార్చిలో విడుదలయ్యారు. తర్వాత కరాచి కాంగ్రెస్ సమావేశంలో ఇండియా-గ్రేట్ బ్రిటన్ మధ్య ఆర్థిక వ్యవహారాల అధ్యయనానికి ఏర్పడిన సెలెక్ట్ కమిటీకి కన్వీనర్ గా ఎన్నికయ్యారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు గాంధీజీ, మహదేవదేశాయ్ ద్వయం ఇంగ్లండు వెళ్ళినప్పుడు కుమారప్ప ‘యంగ్ ఇండియా’ సంపాదక బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో రాసిన వ్యాసాలకు రెండున్నరేళ్ళ కఠిన కారాగార శిక్ష ఎదురయ్యింది!
Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం
జైలు నుంచి తిరిగి రాగానే మరోరకం పని ఎదురుచూస్తోంది. 1934 బీహారు భూకంపం పునరావాస కార్యక్రమం బాబు రాజేంద్రప్రసాద్ కు తలకు మించిన భారమైంది. జమ్నాలాల్ తో బజాజ్ ను తోడు పడమని గాంధీజీ కోరితే, ఆయన కుమారప్ప సాయమర్థించారు – ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి! ఈ పనిని గొప్పగా నిర్వహించారని పిమ్మట రాజేంద్రప్రసాద్ ఎంతగానో శ్లాఘించారు. ఈ అనుభవంతో కూమారప్ప ‘ఆర్గనైజేషన్ అండ్ అకౌంట్స్ ఆఫ్ రిలీఫ్ వర్క్’ అనే విలువైన పత్రం రాశారు.
Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం
ఒంటరి యోధుడు
1934 అక్టోబరు 27న, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానంలో ‘ఆల్ ఇండియా విలేజి ఇండస్ట్రీ అసోసియేషన్ ‘ ఏర్పరచాలని నిర్ణయించి, ఆ సంస్థకు కుమారప్పను కార్యదర్శిగా నియమించింది. దీనికి కుమారప్ప అనుమతి లేకుండా నిర్ణయం జరిగిపోయింది. తొలుత ఈ విషయమై కుమారప్ప అభ్యంతరం చెప్పినా, గాంధీజీ తన తప్పు పట్ల విచారం ప్రకటించడంలో బాధ్యతను స్వీకరించి, గాంధీజీ నేతృత్వంలో ఒంటరి యోధుడిగా పని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ భారతాన్ని పరిశీలించాడు. వార్దాలోని మగన్ వాడి ‘ఆల్ ఇండియా విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ‘ ప్రధాన కార్యాలయంగా మారింది. రీసర్చి, ప్రొడక్షన్, ట్రైనింగ్, ఎక్స్ టెన్షన్ & ఆర్గనైజేషన్, ప్రోపగాండా & పబ్లికేషన్ అనే ఐదు విభాగాలుగా ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా గాంధీజీ భావించిన నిర్మాణ కార్యక్రమాన్ని కూమారప్ప రూపొందించారు. దీని లక్ష్యాలు సిద్ధిస్తే, కమ్యూనిజం ప్రబోధించిన ఫలితాలన్ని సగటు మనిషికి లభించేలా ప్రణాళిక చేశారు. సమన్యాయం, అహింస అనేవి తప్పనిసరి అంతర్గత నియమాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమం వికేంద్రీకరణ, స్వయంసమృద్ధి, సుస్థిరమైన శాంతి అనే వాటికి చిరునామా!
Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు డా. రాజేంద్రప్రసాద్ సారధ్యంలో పెద్ద పరిశ్రమల పట్ల తీసుకున్న నిర్ణయం కుమారప్పకు రుచించలేదు. తర్వాత విద్యావ్యవస్థను సంస్కరించాలని తలపెట్టిన ‘నయీతాలీం’ ప్రణాళిక, అధ్యయనం మొదలైంది. ఈ కమిటీకి డా. జకీర్ హుస్సేన్ అధ్యక్షులు కాగా కుమారప్ప సభ్యులు. ఇందులో భాగంగా కుమారప్ప రెండు భాగాల ప్రణాళికగా సిద్ధాంత కృషి చేశారు. ఒకటి – తరచు చేసే శారీరక శ్రమతో కూడిన పని. రెండవది- ఫలితాల తృప్తిని అనుభవించడం. రెండవది ఫలితాల తృప్తిని అనుభవించడం. తర్వాత 1937లో ‘నేషనల్ ప్లానింగ్ కమీషన్ ‘ ఏర్పడింది. కుమారప్ప అందులో చేరితే మంచిదనే నెహ్రూ సలహాను గాంధీజీ చెప్పగా, కుమారప్ప సభ్యులయ్యారు. కొంతకాలానికి అక్కడ సమయం వ్యర్థ మవుతోందని కుమారప్ప రాజీనామా చేశారు. కుమారప్ప అధ్యక్షతన ‘ఇండిస్ట్రియల్ సర్వే కమిటీ’ ఏర్పడి పని ప్రారంభించింది.
Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా
డాక్టర్ ఆఫ్ డివినిటీ
‘స్టోన్ ఫర్ బ్రెడ్’ అనే వ్యాసానికి 1942లో జైలు శిక్షపడింది. సమయంలోనే ‘ప్రాక్టీస్ అండ్ ప్రిసెస్ట్స్ ఆఫ్ జీసస్’ , ‘ది ఎకానామి ఆఫ్ ఫర్ ఫార్మెన్స్’ అనే కుమారప్ప పుస్తకాలను రాశారు. 1945లో విడుదల కాగానే, ఈ పుస్తకాల రాత ప్రతులను గాంధీజీకి పంపారు. అడగకపోయినా గాంధీజీ ఈ పుస్తకాలకు విలువైన ముందుమాటలు రాశారు. ‘డాక్టర్ ఆఫ్ డివినిటీ’ , ‘డాక్టర్ ఆఫ్ విలేజ్ ఇండస్ట్రీస్’ అని కుమారప్పను గా గాంధీజీ సంబోధించడం విశేషం! గ్రామీణ వికాసానికి గాంధీజీ భావనలు ఏమిటో కుమారప్పకు బాగా తెలుసు. 1946లో వారిద్దరూ కలసి గ్రామీణ పురోభివృద్ధికి వివరమైన ప్రణాళికను రచించారు. ఈ కృషిలో ఉన్నప్పుడు మంత్రిగా అవకాశం వచ్చినా కుమారప్ప తిరస్కరించారు.
1948లో గాంధీజీ కనుమరుగయినపుడు కుమారప్ప దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫలితంగా, ఆయన రెండు కళ్ళ చూపును కోల్పోయారు. అదృష్టవశాత్తు కొన్ని రోజులకు చూపు మళ్ళీ రావడం విశేషం! గాంధీజీతో ఉన్న అనుబంధం అంత గాఢమైంది!!
Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?
గాంధీజీ కనుమూసిన తర్వాత ‘గాంధీ మెమోరియల్ ఫండ్’ బాధ్యతలు నిర్వించాలని కుమారప్పను డా. రాంజేంద్రప్రసాద్ ఢిల్లీకి అహ్వానించారు. అలా ఫండ్ ఏర్పరచనక్కరలేదని, ఏ స్కీము క్రిందనైనా గాంధీజీ మెమోరియల్ కు వర్తింప చేయవచ్చని కుమారప్ప వివరించారు. శ్రద్ధ, త్యాగదృష్టిగల వ్యక్తులను సమీకరించి వారి ద్వారా గాంధీజీ కృషిని సాధించడం అవసరమని కూడా చెప్పారు. ఇటువంటి మానవ వనరుల నిధి కోసం ముగ్గురు నాయకుల అవసరముందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజకుమారి అమృత్ కౌర్ పదవీత్యాగం చేసి ఈ పనిలోకి రావాలని కోరారు. వారు ముగ్గురూ వివిధ వర్గాలలోకి వెళ్ళి కృషి చేయాలని కూడా వివరించారు. ఈ సూచన ఎవరికీ నచ్చ లేదు. ఫలితంగా కుమారప్ప తిరిగి వచ్చారు. కృపలానీ మీద ఆ బాధ్యతలు పడ్డాయి.
వ్యవసాయరంగంలో మార్పులు
1947 డిసెంబరులో వ్యవసాయరంగంలో మార్పుల అధ్యయనానికి ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడిగా 1949 జూలైలో చాలా మార్పులను రైతుల కోసం సూచిస్తూ నివేదిక ఇచ్చారు. అయితే అప్పటికే పారిశ్రామికీకరణకు సిద్ధమైన నెహ్రూ ప్రభుత్వం ఈ సలహాలను స్వీకరించలేదు. ఇలా సమకాలీన ప్రముఖులతో నిరాదరణకు గురైన కుమారప్పకు ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. 1953లో పని భారాన్ని పూర్తిగా తగ్గించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే స్వచ్ఛంద సంస్థలు మాత్రమే దేశానికి కృషి చేయగలమనే నమ్మకం ఏర్పడింది. మధురై దగ్గరున్న గాంధీ నికేతన్ లో కుదుటపడి పరిశోధనలో, రచనలో మునిగిపోయారు.
Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు
భూదానోద్యమంలో భాగంగా వినోబాభావే పర్యటన చేస్తూ, కుమారప్పను చూడటానికి వచ్చారు. తన గుడిసెలోకి వినోబాను కుమారప్ప తీసుకువెళ్ళారు. అక్కడ రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి – ఒకటి తన గురువుది, మరోటి ఆ గురువుగారి గురువుది. గాంధీజీ ఫోటో ఒకటి కాగా, మరోటి భారతీయ రైతు ఫోటో!
అలాంటి అద్వితీయమైన త్యాగమూర్తి, ఆజన్మ బ్రహ్మచారి, దేశంకోసం తనను తాను అర్పించుకున్న కుమారప్ప శ్రమించి చివరకు 1960వ సంవత్సరం గాంధీజీ వర్ధంతి రోజున కనుమూశారు! 75 సంవత్సరాల మన స్వాతంత్ర్యం, విప్పారిన మన మేధస్సు ఇటువంటి మహనీయుల త్యాగాలను, విశేషమైన కృషిని పూర్తిగా విస్మరింపచేశాయి. తెలుగు వారు కుమారప్ప పేరును మరిచిపోయారు!
Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప
—డా. నాగసూరి వేణుగోపాల్
మొబైల్: 9440732392