- వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఏడాది
- దిల్లీకి దారులు మూసివేసిన ప్రభుత్వం, 144వ సెక్షన్ విదింపు
దిల్లీలో రైతుల ఉద్యమం ఆరంభించిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా అకాలీదళ్ నిర్వహించిన నిరసన ప్రదర్శన ‘బ్లాక్ ఫ్రైడే’ మార్చ్ కి మంచి మద్దతు లభించింది. అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, మాజీ మంత్రి, లోక్ సభ సభ్యురాలు హర్సిమ్రాట్ కౌర్ బాదల్, మరి డజను మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు ప్రకటించారు. అరెస్టు చేసిన అకాలీ నాయకులను పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు.
‘‘మేమిక్కడికి నిరసన ప్రదర్శన చేయడానికి వచ్చాం. దిల్లీ పోలీసులు మమ్మల్ని ఆపుచేయడానికి బలప్రయోగం చేసింది. సరిహద్దును పోలీసులు మూసివేశారు. పార్టీ కార్యకర్తలపైన లాఠీచార్జి చేశారు. గురుద్వారా దగ్గర మమ్మల్ని చేరనీయవద్దని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా మమ్మల్ని ఆపుచేశాయి,’’ అని బాదల్ వార్తాసంస్థల ప్రతినిధులతో అన్నారు.
దిల్లీ సరిహద్దులో ఆగ్రహోదగ్రులైన యువరైతులూ, అకాలీ దళ్ కార్యకర్తలూ గుమికూడారు. అక్కడ పోలీసులు బారికేడ్లు ఉంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగుతున్న రైతు ఉద్యమాన్ని సమర్థించడంకోసమే అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రాట్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ) నుంచి అకాలీ దళ్ తప్పుకున్నది కూడా అందుకే.
‘‘గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ కు చేరుకుంటున్న అకాలీదళ్ కార్యకర్తలనూ ఆపుచేసినందుకూ, దిల్లీకి వచ్చే మార్గాలన్నిటినీ మూసివేసినందుకూ పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అప్రకటిత ఆత్యయిక పరిస్థితిని అమలు చేస్తున్నారు. పోలీసులు జులుం ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో చూపించే విడియోలు మాకు అందుతున్నాయి, ’’అని హర్ సిమ్రాట్ కౌర్ బాదల్ అన్నారు. వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలనే నినాదాలతో వందలాదిమంది ప్రదర్శనలు చేస్తుంటే వారిని అడ్డుకుంటున్న పోలీసులు బలప్రయోగం చేయడం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం పొగరుమోతుదనాన్ని ఆమె ఖండించారు. ఈ నల్ల చట్టాలపట్ల నిరసనను తెలియజేసేందుకు ప్రజలు వేలసంఖ్యలో సిద్ధంగా ఉన్నారనే విషయం వీడియోలు చూసినవారికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.