Sunday, December 22, 2024

పది లక్షలతో ఏమి చేయాలి?

  • దళితులలో ముసురుకుంటున్న ఆలోచనలు
  • అవగాహన పెంచేందుకు పౌరసమాజం కృషి
  • హుజూరాబాద్ లో క్షేత్రవాస్తవికత

దళితులు ఆర్థికంగా అట్టడుగున ఉండటం మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సామాజిక వివక్షకు గురైనవారు. సమాజం వారి అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అందుకే రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్ దళితులకూ, ఆదివాసులకూ ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్దేశించారు. ఏడు దశాబ్దాలుగా  రిజర్వేషన్లు అమలు జరుగుతున్నా దళితులలో ఇంకా పేదరికం గూడుకట్టుకొని ఉన్నది. వారి పట్ల వివక్ష ఏదో ఒక స్థాయిలో ఇంకా కొనసాగుతోంది. తక్కినపేదవర్గాలకూ,దళితులకూ ప్రధానమైన భేదం ఇదే- సామాజికవివక్ష. అన్ని వివక్షలకూ విరుగుడు విద్య, ఆర్థికాభివృద్ధి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దళితులను అన్ని వర్గాలవారూ ఎంతో కొంత ఆమోదిస్తున్నారు. తమలో కలుపుకుంటున్నారు.

దళితులూ, ఇతర పేదవర్గాలవారికోసం ఎన్నో రకాల పథకాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా పథక రచన చేసి అమలు జరుపుతున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు జరిగిన పీజు రీఎంబర్స్ మెంట్ పథకం వల్ల తామరతంపలాగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. ప్రతిగ్రామంలో ఇంజనీరింగ్ పట్టభద్రులైనవారు నిరుద్యోగులుగా ఉన్నారు. దళితులలో కూడా చాలామంది ఇంజనీరింగ్ చదివినప్పటికీ ఉద్యోగంసద్యోగం లేకుండా ఉన్నారు.

అసాధారణ నిర్ణయం

మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం చేయాలన్న అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకానికి ‘దళితబంధు’ అని నామకరణం చేశారు.  ఇప్పటికే ‘రైతుబంధు’ అమలు జరుగుతోంది. అది కౌలు రైతులకు వర్తించకపోవడం ప్రధాన లోపం. అయినా ఆ పథకం కొన్ని సంవత్సరాలుగా అమలు జరుగుతోంది. దాని కంటే ఎక్కువ ఖర్చుతో కూడిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా హూజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పథకం మంచిదే. కానీ  హుజూరాబాద్ లో ఉపఎన్నికలు జరుగనున్న సమయంలో ఇటువంటి జనాకర్షణీయమైన పథకాన్ని అక్కడ మాత్రమే అమలు చేస్తే అది ఓట్ల కోసమే చేస్తున్నారని అనడం తప్పు కాదు. ప్రతిపక్షాలు అదే ఆరోపణ చేశాయి. ఏ పక్షానికీ చెందని తటస్థులు కూడా అదే భావిస్తున్నారు.

ఈ విమర్శ తీవ్రతను తగ్గించేందుకు మరి నాలుగు మండలాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో దళితబంధు అమలు కోసం ఎంపిక చేశారు. ఎవరు ఏమని విమర్శించినా దళితబంధు పథకాన్ని అమలు చేసేది ఖాయమని ముఖ్యమంత్రి ప్రకటించారు. సెప్టెబర్ 14వ తేదీకి పూర్వమే దాదాపు 15వేల కుటుంబాలకు అధికారులు బ్యాంకు ఖాతాలు తెరిచి ఒక్కొక్క ఖాతాలో పది లక్షల రూపాయలు జమచేశారు. ఇక అయిదు వేల దళిత కుటుంబాలు మాత్రమే హుజూరాబాద్ నియోజకవర్గంలో మిగిలి ఉంటాయి. వాటికి కూడా వారం రోజులలోనే జమకట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. పథకం ఫలం అందని దళితులు ఎవరైనా మిగిలిపోతే వారిని గుర్తించడానికి అధికారులూ తిరిగి ఇంటింటీకీ వెళ్ళి గురు, శుక్రవారాలలో సర్వే జరుపుతారు. ఒంటరి మహిళలకూ, ఒంటరి పురుషులకూ, అరవై ఏళ్ళు దాటినవారికీ, అనాధలైన మైనర్లకీ, రేషన్ కార్టు లేనివారికీ ఏమి చేయాలనేది అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

ఎన్ని విమర్శలు ఎదురైనా పథకం అమలు

పథకంపైన ఎన్ని విమర్శలు వచ్చినా అది ఆగడం లేదు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల చొప్పున ఇవ్వగలరా? ఎన్నేళ్ళు పడుతుంది? దళితులకు అటువంటి సహాయం ఇచ్చినప్పుడు వెనుకబడిన కులాల సంగతి ఏమిటి? ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విషయం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలు అనేకం. అయినప్పటికీ పదిహేను వేలమంది ఖాతాలలో డబ్బు జమ అయిన మాట వాస్తవం.

తమ ఖాతాలో అంత డబ్బు జమ అయిన తర్వాత దళిత కుటుంబాలలో ఎటువంటి ఆలోచనలు సాగుతున్నాయి? వారి ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి? ఆ డబ్బుతో  ఏమి చేయాలనుకుంటున్నారు? ఎటువంటి వ్యాపారాలు చేయాలని సంకల్పిస్తున్నారు? డబ్బు ఆగం చేస్తారా? తెలివిగా సద్వినియోగం చేసుకుంటారా? కేసీఆర్ ఎందుకు ఇచ్చినప్పటికీ ఇచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకొని దారిద్ర్య రేఖ ఎగువకు ఎదిగితే, సమాజంలో  గౌరవం పొందితే, పిల్లలను మంచి చదువులు చదివించుకుంటే, వారికి మంచి భవిష్యత్తు ప్రసాదిస్తే వారి జీవితం ధన్యమైనట్టు. తరతరాల అసమానత తొలగిపోయినట్టు. సరైన అవగాహన, ప్రణాళిక లేకపోతే డబ్బు ఇచ్చినా, పథకం అమలు జరిగినా ఫలితం ఉండదు.

తన అవకాశాలూ, ఆలోచనలూ చర్చిస్తున్న దళిత యువకుడు

ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. దేశంలోని ఆలోచనాపరులందరూ తెలంగాణ దళితులు ఏమి చేయబోతున్నారోనని చూస్తున్నారు. దళితబందు పథకం విజయవంతంగా అమలు జరిగితే, తెలంగాణలో దళిత కుటుంబాలు దారిద్ర్యం నుంచి బయటపడగలిగితే అది దేశానికి గొప్ప సందేశం అవుతుంది. తరతరాలుగా అవమానాలకూ, అమానుషమైన వివక్షకూ గురైన దళితుల జీవితాలలో వెలుగు నింపుతుంది. అందుకే ఎవరి ఖాతాలో  పది లక్షల రూపాయలు జమ అయినాయో వారిని కలుసుకొని, వారితో చర్చించి, ఏమి చేయబోతున్నారో,వారి ఆలోచనలుఎట్లా ఉన్నాయో, ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక జర్నలిస్టుగా నాకు ఆసక్తి ఉంది.

హుజూరాబాద్ సందర్శన

మిత్రుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఒక బృందాన్ని తీసుకొని హుజూరాబాద్ లో దళితబంధు పథకం అమలు తీరును పరిశీలించడానికి వెడుతున్నట్టు చెప్పారు. నన్ను కూడా రమ్మన్నారు. ఆ బృందంలో ఉన్నవారు రాజకీయాలతో సంబంధం లేనివారు. ‘బేసిక్స్’ అనే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్తెయ్య, ఆయన సహచరులు నవీన్, హెన్రీ, వాతావరణ స్థితిగతులను అధ్యయం చేసే సంస్థకు చెందిన బీఎస్ గోపాల్. లోడగ సత్యం కంప్యూటర్స్ లో పని చేసి, 104, 108 సర్వీసుల రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన బాలాజీ, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థకు చెందిన ఉద్యోగి రాము. ఈ పర్యటన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అయితే దానికి సలహాదారులుగా విద్యావేత్త చుక్కారామయ్య, కె. ఆర్. వేణుగోపాల్, నేనూ మొదటి నుంచి పలు సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నాం. అందుకని ఆ బృందంతో వెళ్ళడానికి అభ్యంతరం ఉండనక్కరలేదని అనిపించింది.  రోజు మొత్తం జరిగిన పర్యటనలో దళితబంధు అమలు జరుగుతున్న తీరూ, లబ్ధిదారుల ఆలోచనా ధోరణి కనుక్కోవడానికే ప్రయత్నించాం కానీ ఎక్కడా రాజకీయాలు చర్చకు రాలేదు. ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి వేయకూడదో అన్న చర్చ కూడా వచ్చిన సందర్భం లేదు. నాకు అలవాటైన నిజనిర్ధారణ కార్యక్రమంలాగానే సాగింది ఆద్యంతం.

మంగళవారం (14 సెప్టెంబర్ 2021) ఉదయం అల్పాహారం తర్వాత మూడు కార్లలో హైదరాబాద్ నుంచి బయలుదేరాం. ఒంటిగంట దాటిన తర్వాత హుజూరాబాద్ చేరాం. అక్కడి నుంచి జమ్మికుంటకు వెళ్ళాం. అక్కడ ఒక మహిళా కాలేజీ ఆవరణంలో దళితులలో ఉద్యోగవిరమణ చేసినవారిని కొందరితో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచీ పెద్దవాళ్ళు వచ్చారు. లక్ష్మయ్య వారితో మాట్లాడారు. ఎక్కువ మంది రిటైరైన టీచర్లూ, హెడ్ మాస్టర్లూ, ఇతర ప్రభుత్వాధికారులూ, దళిత సంఘాల నేతలూ ఉన్నారు. వారంతా స్థానికులు. సమాజంలో గౌరవం పొందుతున్నవారు. సాటి దళితుల అభివృద్ధిని ఆకాంక్షించేవారు. వారికి ఈ పథకం పూర్వాపరాల గురించిన అవగాహన పెంచితే వారు దళిత సమాజంలోని ఇతరులకు అవగాహన కలిగిస్తారనే అభిప్రాయంతో వారిని పరిణామ చోదకులుగా (చేంజ్ ఏజెంట్స్)గా వ్యవహరించాలని కోరారు.  ప్రతి గ్రామ స్థాయిలో దళిత్ కమ్యూనిటీ ఎల్డర్స్ ఫోరం (డీసీఈఎఫ్)  ఏర్పాటు చేసుకోవాలనీ, దళిత బంధు పథకం కింద లబ్దిపొందిన వారికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఎట్లా అర్థవంతంగా, లాభసాటిగా వినియోగించుకోవాలో మార్గదర్శనం చేయాలనీ చెప్పారు. నియోజకవర్గం స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోమని కూడా చెప్పారు.  దళిత పెద్దలు కూడా పథకాన్ని జయప్రదం చేయడానికి తమకు తోచిన సలహాలు చెప్పారు. వారిని కార్యోన్ముఖుల్ని చేసినట్టే కనిపించింది. చదువుకున్న యువతీయువకులతో సమావేశాలు నిర్వహించాలనీ, వారికి అవగాహన కల్పించాలని కోరారు.

ట్రాక్టర్లు, కార్లు కొంటాం

అక్కడి నుంచి చిన్న కోమటిపల్లి అనే గ్రామానికి సాయంత్రం గం. 4.30 లకు చేరుకున్నాం. ఆ గ్రామంలో మొత్తం 52 మంది లబ్దిదారులు ఉన్నారు. చాలామంది ట్రాక్టర్లూ, కార్లూ కొంటామని అన్నారు. హుజూరాబాద్ కృషి విజ్ఞానకేంద్రంలో పని చేస్తున్నశాస్త్రవేత్త ప్రభాకర్ కొన్ని సలహాలు చెప్పారు. చదువుకున్నవారు ఎవరైనా తన దగ్గరికి వస్తే వారికి ఎన్ని రకాల వ్యాపారాలు చేయవచ్చునో వివరంగా చెబుతానని అన్నారు. ట్రాక్టర్ కొంటే నష్టపోతారనీ, ఇప్పటికే చిన్నకోమటిపల్లిలో 24 ట్రాక్టర్లు ఉన్నాయనీ, సేద్యం చేసే భూమి 300 ఎకరాలేననీ, ఇంకా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం వల్ల ఏటా దాని విలువ తగ్గిపొతుందనీ (డిప్రిసియేషన్), పని లేక తుప్పుపట్టిపోతుందనీ చెప్పారు. ‘బేసిక్స్ ’ సంస్థ ఎండి సత్తెయ్య కూడా వివిధ రకాల లాభసాటి వ్యాపారాలను చేయవచ్చుననీ, కారు, ట్రాక్టర్ గురించి మాత్రమే ఆలోచించి తొందరబడి ఒక నిర్ణయానికి రావద్దనీ చెప్పారు. ప్రభాకర్, సత్తయ్య ఒక జట్టుగా ఏర్పడి లబ్ధిదారులతో మాట్లాడితే ప్రయోజనం ఉంటందని లక్ష్మయ్య సూచించారు. టీఆర్ ఎస్ దళిత నేత కనుమల్ల గణపతి, స్వచ్ఛంద సంస్థకు చెందిన సంపత్ రావు కూడా దళితులతో మాట్లాడారు.

గడ్డివానిపల్లిలో తన ఆలోచనలను పంచుకుంటున్న దళిత యువకుడు

ఇల్లు కట్టించుకుంటాం, పొలం కొనుక్కుంటాం

తర్వాత ఇల్లందకుంట్ల మండలం గడ్డివానిపల్లిలో దళితులతో మాట్లాడాం. ఒక యువకుడు మొబైల్ టిఫిన్ సెంటర్ ఇప్పటికే నడుపుతున్నాననీ, దాన్నే పెద్దది చేసి హనుమకొండలోనో, హుజూరాబాద్ లోనో నడుపుకుంటాననీ, రోజుకు వెయ్యి రూపాయలకు పైగా ఇప్పుడే సంపాదిస్తున్నాననీ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఇక్కడ కూడా ట్రాక్టర్లూ, కార్లూ కొనాలనుకునేవారే ఎక్కువ. మందుల దుకాణం పెట్టాలనీ, టైలరింగ్ షాప్ పెట్టాలనీ, బట్టల దుకాణం పెట్టాలనీ కోరుకుంటున్నవారు కూడా ఉన్నారు. కొందరు ఇళ్ళు కట్టుకోవాలని కోరుతున్నారు. ఒక మహిళ భూమి కొంటానని ప్రతిపాదించింది. ఎకరం ఇరవై నుంచి పాతక లక్షల దాకా ఉంది. ప్రభుత్వం ఇస్తున్న పది లక్షలకు మరో అయిదు లక్షలు జత చేసి నలభై కుంటలో, మరికాస్త ఎక్కువో భూమి కొంటానని ఆమె చెప్పింది. ఏదైనా వ్యాపారం అనుకుంటే కచ్చితంగా పదిలక్షల లోపు కాకపోవచ్చుననీ, ఒకటి, రెండు లక్షలు అదనంగా అవసరం కావచ్చుననీ, అప్పుడు ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు ఉండాలనీ కొందరు సూచించారు.  

ఏదైనా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసిన తర్వాత కలెక్టర్లకు సమర్పించి, వారు ఆమోదిస్తేనే నేరుగా వ్యాపారానికి అవసరమైన ఖర్చుకోసం డబ్బు విడుదల చేస్తారు. సొంత ఖర్చులకోసం, పెళ్ళిల్లూ పేరంటాలకోసం డబ్బు తీసుకొని ఖర్చు చేసే అవకాశం ఉండదు. అధికారులు దళితుల గృహాలు సందర్శించి, వారికి బ్యాంకు అకౌంట్లు సృష్టించి, పాస్ పుస్తకాలను కలెక్టర్ అధీనంలో ఉంచారు. అయదుగురో, ఆరుగురో కలసి ఒక చిన్న వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టుకోవచ్చునని కొందరు సూచించారు. కానీ సహకార వ్యవస్థ మనదేశంలో జయప్రదం కాలేదు. కేరళలో కొంత విజయవంతమైనప్పటికీ మిగిలిన రాష్ట్రాలలో కాలేదు. నలుగురు కలిసి ఒక హోటల్ పెడితే నలుగురూ యజమానులుగా భావించుకొని క్లీనర్లనూ, కుక్ లనూ నియమిస్తే వ్యాపారం విఫలం అవుతుందనీ, భాగస్వాములైనా ప్లేటు తీయడానికీ,  వంటి వండటానికీ సిద్ధపడినప్పుడు విజయవంతం అవుతుందనీ, అదికూడా ఐకమత్యం ఉంటేనే నడుస్తుందనీ అన్నారు.

అవగాహన పెంచేందుకు ప్రయత్నం

హైదరాబాద్ కు తిరిగి వచ్చే దారిలో హుజూరాబాద్ పమీపంలో ఆర్థికమంత్రి హరీష్ రావును కలిశాం. కార్లూ, ట్రాక్టర్ల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారని ఆయన కూడా అన్నారు. సెంట్రింగ్ పరికరాలకూ, డెయిరీ ఫాంలకూ ఆదాయం ఉంటుందనీ, ఈ రెండు అంశాలనూ ప్రోత్సహించాలని భావించాం. కరీంనగర్ డెయిరీ ఫాం లాభాలలో నడుస్తోంది. వారు లక్ష లీటర్ల పాలైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా ప్రతి దళితుడికీ రెండు లక్షల ఖర్చుతో ఒక షెడ్డు వేయించి, ఎనిమిది బర్రెలను కొని ఇస్తే పాడిపరిశ్రమ లాభదాయకంగా ఉంటుందనే వాదన బలంగా వినిపించింది. మొదట నాలుగు బర్రెలు, తర్వాత నాలుగు బర్రెలూ ఇస్తే ఎప్పటికీ పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుందనీ, నెలకు 15 నుంచి 20 వేల వరకూ ప్రతి కుటుంబానికీ ఆదాయం వస్తుందనీ అన్నారు. భార్యాభర్తలలో ఒకరు డెయిరీ పని మీద ఉంటూ రెండో వారు వేరే పనులు చేసుకొని ఆదాయం పెంచుకుంటే మరేదైనా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చునని మంత్రి అన్నారు.

దళిత మహిళలకూ, పురుషులకూ చాలా ఆలోచనలు ఉన్నాయి. సందేహాలు కూడా వేధిస్తున్నాయి. డబ్బు మొత్తం బ్యాంకులో తమ పేరు మీద జమ అయినప్పటికీ ఇప్పుడు నాలుగైదు లక్షలతో ఏదైనా వ్యాపారం పెడితే తక్కిన డబ్బు తీసుకోనివ్వరేమో అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. వాటిని నివృత్తి చేయవలసిన అవసరం ఉంది.  పేదలోగిళ్ళలో వెలుతురు లేని ప్రపంచంలో బతుకులీడుస్తున్న దళితులకు దళితబంధు పథకం అకస్మాత్తుగా వారి జీవితంలో ప్రవేశించిన ఒక వెలుగు ప్రవాహం. దానిని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారన్నది ప్రధానం.  ప్రభుత్వ ఇస్తున్నది కదా అని ఏదో ఒక కారో, ట్రాక్టరో, హార్వెస్టరో కొనుగోలు చేసి నష్టపోకుండా తీరికగా ఆలోచించి, అందరినీ సంప్రతించిన తర్వాతనే ఒక ప్రాజెక్టు అనుకొని దాని రిపోర్టు రాసుకొని సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలించి జయప్రదం అవుతుందని విశ్వాసం ఉంటేనే దిగాలనీ, బ్యాంకులో వేసిన డబ్బు మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కిపోదనీ, లబ్ధిదారుల ఖాతాలోనే ఉంటుందనీ స్పష్టం చేయవలసిన అవసరం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles