మొత్తం పది మంది నటీనటులను ప్రశ్నించిన ఈడీ అధికారులు
డబ్బు లావాదేవీలను తనిఖీ చేస్తున్న అధికారులు
తెలుగు సినిమా హీరో రవితేజను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) అధికారులు గురువారంనాడు నిశితంగా ప్రశ్నించారు. అంతకు ముందు రోజు బాహుబలి ప్రతినాయకుడు రాణాను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విషయంలోనూ, డబ్బుల మాయ చేయడంలోనూ తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్, చార్మీ వంటి హీరోయిన్లను కూడా ఈడీ అధికారులు నిలదీశారు. బ్యాంకు స్టేట్ మెంట్లు చూపించవలసిందిగా అడుతున్నారు. ‘ఇడియట్’ సినిమా హీరో రవితేజ ఈడీ ప్రశ్నించిన పది మంది తెలుగు సినిమా నటులలో ఒకరు.
రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్ బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ ఆఫీసుకు గురువారం ఉదయం పది గంటలకు వెళ్ళి మధ్యాహ్నం మూడున్నర వరకూ అక్కడే ఉన్నారు. ఆగస్టు 31న ప్రముఖ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించారు. ఆయన వ్యాపారంలో భాగస్వామి, నటీమణి చార్మీ కౌర్ ను తర్వాత ప్రశ్నించారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ని పిలిపించారు. అనంతరం నందు, రాణాదగ్గుబాటిని పిలిపించి ప్రశ్నించారు.
డ్రగ్స్ కు సంబంధించి 2017లో నమోదైన కేసులో నిందితులైన మహమ్మద్ జీషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ ను పిలిపించారు. అతడు మెహిదీపట్నం వాసి. అతనికి ఒక నైజీరియన్ బెర్నార్డ్ విల్సన్ ఉరఫ్ విలియమ్స్ బాగస్వామిగా ఉన్నట్టు ఎక్పైజ్ అధికారులు ధృవీకరించారు. ఖాన్ కూ, రవితేజకూ మధ్య డబ్బు లావాదేవీలు జరిగినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. రివితేజ డ్రైవర్ శ్రీనివాస్ రవితేజ తరఫున ఖాన్ కు డబ్బులు పంపి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తల్ లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నందుకు సైబరాబాద్ పోలీసులు ఖాన్ నూ, మరి 67 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులనూ సైబరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అప్పుడే, 2017లోనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులూ, మద్యనిషేధం శాఖ అధికారులూ రవితేజను ప్రశ్నించారు. దాని తర్వాత అనేకమంది అనుమానితులను అరెస్టు చేశారు. వారిలో ఒక అమెరికన్, ఒక దక్షిణాఫ్రికా పౌరుడు, ఒక నెదర్లాండ్స్ పౌరుడు ఉన్నారు. అమెరికా పౌరుడు ఇదివరకు ‘నాసా’ (అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం)లో పని చేసిన ఇంజనీరు. ఎల్ఎస్ డి, ఎండీఎంఏ వంటి ఖరీదైన మాదకద్రవ్యాలను సరఫరా చేసే పెద్ద యంత్రాంగం మూడేళ్ళ కిందట పట్టుబడింది. కెల్విన్ మాస్కారెన్హాన్స్ ను కూడా 2017లో అధికారులు ప్రశ్నించారు. సంగీత దర్శకుడు కూడా అయిన కెల్విన్ ముగ్గురితో కూడిన మాదకద్రవ్యాల సరఫరా ముఠాకు నాయకుడని పోలీసుల అనుమానం.