Sunday, November 24, 2024

ఓం గజాననాయ నమః

సమస్త విఘ్నాలను పోగొట్టి, సర్వ విజయాలను, సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం. మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే. తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే. భిన్న మతాలు, జాతులు కులాలు, సంస్కృతుల సంగమమైన భారతదేశాన్ని ఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సత్ సంప్రదాయమే. సహనం దానికి ఆధారం. సర్వేజనా సుఖినో భవంతు.. అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం. సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.

Also read: హరికథకు పర్యాయపదం ఆదిభట్ల

సనాతనధర్మం ఔన్నత్యం

ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి, మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది. ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి. చాలా సంపదను కోల్పోయాం. విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో పారింది. వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం. మన ఉనికిని కాపాడుకున్నాం. మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం. ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింపజేసింది, వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన విధానం. ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి, మన పెంపకం. కలిసిమెలిసి వుండే కుటుంబబంధాలు, గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి. అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం.. అంటే ఆచరించేది. హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు. ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి. పండుగలు మన జీవితంలో భాగం. హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం. అనంత కాలప్రవాహంలో, లక్షలాది సంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం అత్యల్పమైంది. ఈ రోజులు ఎప్పటికీ ఇలాగే ఉండవు. మంచిరోజులు వస్తాయి. మంచి వాతావరణంలో కోలాహలంగా తిరునాళ్ళు జరుపుకొనే కాలం త్వరలోనే వచ్చితీరుతుంది. భక్తి ప్రదర్శన కాదు. ఆత్మగతమైన అనుభూతి, బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి అని మన పూర్వులు చెప్పారు. అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తే.. వారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు. శరవేగంగా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు. మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.

Also read: నిలిచి వెలిగేది తెలుగే!

భారతీయతత్త్వం

ఒకప్పుడు అనంతమైన సంపదకు, సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ, ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది. ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి, భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ,  ప్రసంగం సాగిస్తే మేధోసమాజమంతా ఆయనకు, ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం. కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు. వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు. ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు. ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప, సంప్రదాయంపై, ఆచార వ్యవహారాలపై ఉన్న ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది. వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది. పండుగలను వివాదాలకు, ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల ఆశయం. సర్వజనులకు జయావహం, ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి, సకల జనులకు సకల జయాలను కలిగించి, కరోనా కాలానికి ముగింపు పలికి, ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.

Also read: జనహృదయాధినేతకు జోహార్లు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles