ఓవల్ ఇంగ్లండ్, భారత్ ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను భారత్ గెలుచుకున్నది. ఈ విజయంతో అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్ డ్రా కాగా, మరో మ్యాచ్ జరగవలసి ఉంది. భారత్ ఓడిపోయే అవకాశం లేదు. అయిదో మ్యాచ్ లో ఓడిపోయినా సిరీస్ లో సమఉజ్జీలుగా తేలుతారు. డ్రా అయినా, భారత్ గెలిచినా సిరీస్ ను గెలుచుకున్నట్టు అవుతుంది.
రవీంద్ర జడేజా హసీబ్ హమీద్ నీ, మొయీన్ అలీ వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లండ్ జట్టు పతనం ఆరంభమైంది. ఓల్లీ పోప్, జానీ బెయిర్ స్తోల వికెట్లను జస్ప్రీత్ బుమ్రా పడగొట్టాడు. 88.5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు తొమ్మిది వికెట్ల పతనానికి 202 పరుగులు చేసింది. మరో ఎనిమిది పరుగులు జోడించిన తర్వాత 210 స్కోరు దగ్గర పదో వికెట్టు కూడా కోల్పోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 191, రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులు చేయగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 290 పరుగులూ, రెండో ఇన్నింగ్స్ లో 210 పరుగులు సాధించింది.
ఇంగ్లండ్ చరిత్రలో గెలుపొందడానికి ఇంగ్లండ్ సాధించిన అత్యధిక స్కోరు తొమ్మిది వికెట్ల నష్టానికి 362 పరుగులు. ఈ ఘనకార్యం ఆస్ట్రేలియాపైన హీడింగ్లీలో 2019లో చేసింది. బుమ్రా, ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ వికెట్టు తీసుకోకపోయినా పరుగులు ఇవ్వకుండా పకడ్బందీగా బౌల్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా పిచ్ స్వభావానికి అనుగుణంగా బౌల్ చేసి కీలకమైన వికెట్లు సాధించాడు. మొత్తం మీద బ్యాట్స్ మన్, బౌలర్లు రాణించడంతో భారత్ విజయం కైవసం చేసుకున్నది.
అయిదవ, చివరి టెస్ట మ్యాచ్ ఈ నెల పదో తేదీన మాంచెస్టర్ లో ప్రారంభం అవుతుంది.