Sunday, December 22, 2024

నానాటికీ బరువెక్కుతున్న గ్యాస్ బండ

పెరుగుతున్న నల్లబజారు… ఈ దేశం ఎటు దిగజారు.. అన్నాడు ఆ మధ్య   ఓ కవిరాయడు. దేశం ఆర్ధికంగా దిగజారుతోంది – ధరలు పైకి ఎగబాకుతున్నాయి అని చెప్పడానికి గుదిబండగా మారిన గ్యాస్ బండ ధరలే ఒక ఉదాహరణ. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. చమురు కంపెనీలు సగటు మనిషి శ్రమను పిండుతున్నాయి. కేవలం 15రోజుల వ్యవధిలోనే సిలెండర్ పై 50రూపాయలు పెరగడం విడ్డూరం. తాజా పెరుగుదలతో దిల్లీలో రాయితీ వంటగ్యాస్ ధర రూ.884.50కు తాకింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలెండర్ ధర రూ.1693కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు, డాలరు రూపాయి మారకం విలువ ఆధారంగా మారుతున్న ధరల పెరుగుదలకు అడ్డుఆపులేకుండా పోయింది. ధరల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.

Also read: గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు

ప్రభుత్వాలు పన్నులు పెంచడమే కారణం

స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నుల ప్రభావంతో ఈ వ్యత్యాసాలు ఉంటాయి. 2014 నుంచి ఇప్పటి వరకూ పెరిగిన ధరలను గమనిస్తే ఈ ఏడేళ్ళల్లో రెట్టింపయ్యింది. 2014 మార్చి 1వ తేదీనాడు సిలెండర్ ధర 416 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 884 రూపాయలకు చేరింది. లోలోపల మగ్గిపోవడం తప్ప, ఈ భారీ పెరుగుదలకు ప్రభుత్వాలను నిలదీసే శక్తి సగటుమనిషికి లేదు. ఎదిరించే తెగువ విపక్షాలకు లేదు. తగ్గించాలనే ఆలోచన, నియంత్రించాలనే నిబద్ధత ఏలికలకు లేదు. అంతర్జాతీయ పరిణామాలను చూపిస్తూ ధరలను పెంచుకుంటూ పోవడం చమురు కంపెనీలకు అలవాటైపోయింది. డీజిల్, పెట్రోలు ధరలు కూడా ఇదే తీరున దాదాపు రెట్టింపుకు ఎగబాకాయి.కరోనా కష్టాలు, ఉపాధి లేమికి తోడు నిత్యావసర ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వుంటే తట్టుకునే శక్తిని సగటు భారతీయుడు కోల్పోతున్నాడు. పన్నుల ప్రభావం వల్ల రాష్ట్రాల మధ్య ధరల్లో వ్యత్యాసం ఉన్నా ప్రభుత్వ విధానాలలో పెద్దగా తేడా ఏమీ లేదు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు,ఎన్ డిఏ, బిజెపియేతర ప్రభుత్వాలు రాజ్యమేలుతున్న చోట్ల కూడా అదే తీరున ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై మాటిమాటికీ ఒంటికాలుపై లేచే కేజ్రీవాల్ పాలనలోనూ దిల్లీ ప్రజల గుండెలు గుభేల్ మంటున్నాయి. దిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్,పంజాబ్,గుజరాత్, మధ్యప్రదేశ్..ఎక్కడా చూసినా ప్రజాకంటకమే రాజ్యమేలుతోంది.

Also read: హరికథకు పర్యాయపదం ఆదిభట్ల

పరస్పర నిందలు

పన్నుల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు -రాష్ట్రాలపై కేంద్రం దుమ్మెత్తి పోసుకోవడం తప్ప, ధరల నియంత్రణకు,సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. 365 రోజులు, ఐదు సంవత్సరాల పాలనా కాలమంతా రాజకీయాలకే అంకితం చేస్తున్నారు. అదేమంటే కరోనా కాలంలో, ఆహార ధాన్యాలు, ఉచిత సరుకులు అందజేస్తూ, కోవిడ్ కట్టడికై వ్యాక్సిన్లు, ఆరోగ్యపరమైన మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ప్రజలు కొరకై వెచ్చిస్తున్నామని కేంద్రం అంటోంది. సర్వత్రా కేంద్ర సహాయం హుళక్కి అని రాష్ట్రాలు దెప్పిపొడుస్తున్నాయి. ఫెడరల్ స్ఫూర్తి కనుమరుగై చాలాకాలమైంది. సంప్రదింపులు లేవు. ఎక్కడ చూసినా స్వతంత్ర నిర్ణయాలు తాండవిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నియంత్రణలో ఉన్నా, మన ప్రభుత్వాలు దానిని పరిగణలోకి తీసుకోవడం లేదని,పన్నుల రూపంలో ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయని, అందుకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలు పన్నులు తగ్గించడం లేదన్నది వాస్తవం. కేంద్రం తీరూ అంతే. దొందూ దొందే అని చెప్పాలి. గత సంవత్సరం, చమురు ధరలు అంతర్జాతీయంగా పదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. ఆ సందర్భంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని అపరిమితంగా పెంచేసింది.

Also read: పంజాబ్ కాంగ్రెస్ లో ఆగని కుమ్ములాట

కేంద్ర ప్రభుత్వం దబాయింపు

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధనం ధరలపై వ్యాట్ తగ్గించకుండా, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీపై మాట్లాడే హక్కు,అర్హత విపక్షాలకు లేవని బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో, ఇంధనం వినియోగం మళ్ళీ పెరిగిపోయింది. ఒకప్పటి సాధారణ స్థితి వచ్చేసింది. దీనిని అదునుగా చూసుకున్న వ్యవస్థలు ధరలు పెంచుకుంటూ ఆదాయంపైనే దృష్టి పెట్టాయి. ఈ విధానాలన్నీ సగటు భారతీయుడిని కుంగదీస్తున్నాయి. అభివృద్ధిని, రేపటి తరాల ఉనికిని మరచి, ఓట్ల కోసం అడ్డూఆపులేకుండా సంక్షేమ పధకాలను పెంచుకుంటూ పోవడం అన్ని రాజకీయ పార్టీలకు సాధారణమైన ఎజెండాగా మారిపోయింది. తాత్కాలిక తాయిలాలకు ఓటర్లు కూడా అలవాటై పోతున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా సాగాలంటే ఆదాయం కావాలి. నిర్మాణాత్మకమైన చర్యలను పక్కనబెట్టి, తాత్కాలిక ఆదాయం కోసం, ఇదుగో ఇలాంటి మార్గాలను ప్రభుత్వాలు ఎంచుకుంటున్నాయి. వెరసి,ధరలు గుదిబండలవుతున్నాయి. తత్త్వం బోధపడేసరికి బతుకు తెల్లారిపోక తప్పదు.

Also read: నిలిచి వెలిగేది తెలుగే!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles