నా చిన్నప్పుడు
డాబా మీద చాపలు పరిచి
వెల్లకిలా పడుకుని
కబుర్లు చెప్పుకుంటూ
నవ్వులు పంచుకుంటూ
వెన్నెల్లో మెరిసే వాళ్లం
సంతోషంతో మురిసే వాళ్లం
ఆనందపు జల్లుల్లో తడిసే వాళ్లం
అవన్నీ ఫోటోలు తీయడం తెలియదు.
చేతులు కాలే పులి బొంగరాలు
ఉఫ్ అంటూ ఊదుకుంటూ
తింటున్నపుడు
పుల్ల అయిస్, పాల అయిస్ చీకుతున్నపుడు
మామిడి రసాలు జుర్రుతున్నపుడు
ఫోటోలు తీసుకునే ఆలోచన లేదు.
రైలు ప్రయాణం అంటే ఎక్కడలేని సంతోషం
ఏసి లేని 3వ క్లాసు బోగీలో
కిటికీ పక్క సీటు కోసం వంతులు వేసుకుని
ఇంటినుండి తెచ్చుకున్న మరచెంబు నీళ్లు
చపాతి కుర్మాల డబ్బాలు
పక్కవాళ్లతో పంచుకునే అలవాట్లు
ఫొటోల్లో బంధించడం చెయ్యలేదు
అయినా అవన్నీ వివరంగా
మరచిపోలేని చిత్రాలుగా
మనసుల్లో మిగిలి పోయాయి
కెమరాలు, ఆల్బమ్ లలో కాకుండా.
అవి ఎంత మధుర క్షణాలో
కాలం నడక తెలిసేది కాదు
వాచీ నాన్న చేతికి మాత్రమే ఉండేది.
Also read: లీలాకృష్ణ
Also read: వందనం
Also read: సజీవ శిల్పం
Also read: సంస్కృతం
Also read: మరక మంచిదే