Thursday, November 21, 2024

అఫ్ఘానిస్తాన్ జోలికి ఎవరు వచ్చినా ఇదే గతి, అమెరికా నిష్క్రమణపై తాలిబాన్ వ్యాఖ్య

అమెరికన్ సైనికుల నిష్క్రమణ తర్వాత గాలిలో తుపాకులు పేల్చి సంబరం చేసుకుంటున్న తాలిబాన్

  • అమెరికా నిష్క్రమణ సందర్భంగా తాలిబాన్ సంబరం
  • అగ్రరాజ్యం కాదు, చిన్న రాజ్యం: అమ్రుల్లా సాలే వ్యంగ్యం

‘‘అఫ్ఘానిస్తాన్ జోలికి ఎవరు వచ్చినా ఇదే గతి పడుతుంది. అఫ్ఘాన్ ను ఆక్రమించాలని చూసినవారు ఘోరపరాజయం చెంది, ఘోరమైన అవమానభారంతో నిష్క్రమించక తప్పదు,’’ అని తాలిబాన్ ప్రతినిధి అమెరికా, నాటో సేలన ఉపసంహరణ అనంతరం మంగళవారంనాడు వ్యాఖ్యానించాడు. అఫ్ఘానిస్తాన్ మొత్తం తమ హస్తగతం కావడాన్ని తాలిబాన్ పండుగ చేసుకున్నారు. ఈ సారి తుపాకులతో పాటు దౌత్యనీతిని కూడా తాలిబాన్ ఆయుధంగా వినియోగించుకున్నారు.

‘‘అఫ్ఘానిస్తాన్ కు అభినందనలు. ఈ విజయం మనందరిదీనూ,’’ అని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. ‘తాలిబాన్ విజయం ఇతర దురాక్రమణదారులకు గుణపాఠం’’ అని ముజాహిద్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాతో, ప్రపంచంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం. వారందరితో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నాం,’’అని అన్నారు.

Also read: అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్లను ఓడించేందుకు ముజాహిదీన్ ని తయారు చేశాం: జనరల్ ముషారఫ్

అమెరికా సేనల ఉపసంహరణకు ఆగస్టు 31వ తేదీని గడువుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయించారు. రెండు దశాబ్దాల సమరంలో 2,400 మంది అమెరికా సైనికులూ, వేలాదిమంది అఫ్ఘాన్ సైనికులూ, పౌరులూ ప్రాణాలు కోల్పోయారు. సేనలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఆగస్టు 15న ఐఎస్-ఖారసోనా సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులు కాబూల్ విమానాశ్రయం వెలుపల గేటు దగ్గరా, హోటల్ దగ్గరా పేల్చుకొని భీభత్సం సృష్టించారు. వందకు పైగా అఫ్ఘాన్ పౌరులూ, 13 మంది అమెరికా సైనికులూ మరణించారు. తాలిబాన్ అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ ను ఆగస్టు 14న ఆక్రమించుకున్న వెంటనే అమెరికా, నాటో సైనికుల ఉపసంహరణ ఆరంభించారు.

అమెరికాపై అమ్రుల్లా సాలే ధ్వజం

అగ్రరాజ్యం తనను తాను చిన్నగా ఊహించుకొని కుదించుకున్న కారణంగానే తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ను తిరిగి ఆక్రమించుకోగలిగిందని అఫ్ఘాన్ పూర్వ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే విమర్శించారు. అమెరికా సూపర్ పవర్ కాదనీ, మినీపవర్ అనీ అవహేళన చేస్తూ సాలే ఒక ట్వీట్ చేశారు. అమెరికా సూపర్ పవర్ లాగా వ్యవహరించాలంటే రెండు దశాబ్దాల కిందట చేసిన బాసలను నెరవేర్చాలి, హామీలను పూర్తిగా చేయాలి, శత్రువును ఓడించాలి. అవి ఏమీ చేయకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే అది వారి నిర్ణయమే అవుతుంది. వారు పోరాటానికి స్వస్తి చెప్పి వెళ్ళిపోయినంత మాత్రాన మేము కూడా పోరాటం విరమించుకుంటామని అర్థం కాదు. వాళ్ళు (అమెరికన్లు) ఉంటే బాగుండేది. వెళ్ళిపోయారు కనుక మా పోరాటం మేము కొనసాగిస్తాం. మేము ఇక్కడి వాళ్లం. ఇక్కడే పోరాటం చేయాలి. ఇక్కడి కొండలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడి నదులు పారుతూ ఉంటాయి,’’అంటూ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలే వ్యాఖ్యానించారు.

అఫ్ఘానిస్తాన్ ను వదిలి వెడుతున్న చివరి అమెరికా సైనికుడు

అమెరికా, నాటో సేనల ఉపసంహరణ ప్రహసనప్రాయంగా, ప్రమాదభరితంగా, ఉద్విగ్నభరితంగా సాగింది. వేలాది అఫ్ఘాన్లు స్వదేశం వదిలి విదేశాలకు పయనమై విమానాశ్రయానికి వెళ్ళారు. అందిన విమానం పట్టుకొని అది వెళ్ళిన దేశానికి వెళ్ళారు. ముఖ్యంగా అమెరికా సేనలకు సహకరించినవారూ, వారితో కలసి పని చేసినవారూ తమకు అపకారం జరుగుతుందనీ, తాలిబాన్ తమను వదిలిపెట్టరనీ భావించి దేశం వదిలిపోయారు.

Also read: మానవహక్కులను హరిస్తున్న తాలిబాన్: సాలే

సోమవారం రాత్రితో అమెరికా అత్యంత దీర్ఘకాలికమైన సైనిక సంఘర్షణ ముగిసింది. నిష్క్రమించే ముందు 1,23,000మందిని కాబూల్ విమానాశ్రయం నుంచి ఇతర దేశాలకు విమానంలో చేరవేసి చరిత్ర సృష్టించింది అగ్రరాజ్యం. అఫ్ఘానిస్తాన్ లో రెండు దశాబ్దాల యుద్ధానికి ఆ విధంగా స్వస్తి చెప్పింది. అమెరికా చివరి సైనికుడు విమానం ఎక్కిన తర్వాత విమానం గాలిలోకి ఎగిరిన వెంటనే తాలిబాన్ కాబూల్ విమానాశ్రయంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించి గాలిలో తుపాకులు పేర్చి విజయ సూచకంగా నినాదాలు చేశారు. సంబరాలు జరుపుకున్నారు. 2001లో అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ పైన దండయాత్ర చేసింది. అల్ ఖాయిదాకు మద్దతు ఇచ్చినందుకు అఫ్ఘానిస్తాన్ ని శిక్షించాలని ప్రయత్నించింది. రెండు దశాబ్దాల ప్రయత్నం తర్వాత తిరిగి అదే తాలిబాన్ కు అఫ్ఘానిస్తాన్ ను అప్పగించి వెనుతిరిగి అమెరికా వెళ్ళిపోయారు.

అమెరికాకు ఇది కొత్త కాదు

ఈ విధంగా తమది కాని ప్రాంతంలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించి, భంగపడి, వెనుదిరగడం అమెరికాకు కొత్త కాదు. తగుదునమ్మా అంటూ దూరంగా, ఖండాంతరంలో ఉన్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో జోక్యం చేసుకోవడం, మొహం పగిలే విధంగా దెబ్బతినడం, కాలికి బుద్ధి చెప్పడం పరిపాటయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా ప్రప్రచం పెద్దన్న పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తూ వేసిన తప్పటడుగులలో ఇది తాజాది. మిత్రదేశాలు కూడా ఒక మిత్రదేశంగా అమెరికా చిత్తశుద్ధిని శంకించే పరిస్థితులు దాపురించాయి. క్వాడ్ కూటమి (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా)కి అర్థం ఉన్నదా? తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు అమెరికాను నమ్ముకొని ఉండటం క్షేమదాయకమా? ఇటువంటి భయసందేహాలు అనేకం. అగ్రరాజ్యంగా అమెరికా విశ్శసనీయత పరీక్షకు గురైన సందర్భం ఇది. పరీక్షలో అమెరికా నిలువలేక జావకారిని సమయం.

Also read: కాబూల్ విమానాశ్రయంలో గెండెలు పిండే దృశ్యాలు అనివార్యం : జోబైడెన్

ప్రపంచ  పెత్తందారీ పాత్ర పోషించాలంటే శత్రువును చితకబాదాలి. తన మాటకు ఎదురు లేకుండా చూసుకోవాలి. తనవైపు తలెత్తి చూసే ధైర్యం ఎవరికీ లేకుండా బెదరగొట్టాలి. శత్రువు లేకపోతే శత్రువును సృష్టించుకొని వాడిమీద దాడి చేసి ప్రతాపం ప్రదర్శించాలి. అప్పుడే మిత్రులు సైతం గౌరవిస్తారు. భయపడతారు.  ఎప్పుడు ఎవరితో మైత్రి ఉంటుందో, శత్రుత్వం ఉంటుందో చెప్పడం కష్టం. ఎక్కడ గొడవ ఉంటే అక్కడ దలదూర్చడం, తలబొప్పి కట్టగానే వెనక్కి పీక్కోడం అలవాటుగా మారింది. గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పిదం చేయడం. తప్పు మీద తప్పు చేయడం. మూల్యం చెల్లించడం. అయినా బుద్ది తెచ్చుకోకపోవడం. బుద్ధితక్కువ పనలు కొనసాగించడం. ప్రపంచాన్ని తానే రక్షిస్తున్నట్టు భ్రమలో మునిగి తేలడం అగ్రరాజ్యమైన అమెరికాకు పరిపాటి.

కాబూల్ విమానాశ్రయంలో విమానం ఎక్కుతున్న అమెరికా సైనికులు, అఫ్ఘానిస్తాన్ లో అమెరికా పతాకాన్ని అవనతం చేస్తున్న అమెరికా సైనికులు

తాజా శత్రువు ఐఎస్-కె

ఇటీవల కాబూల్ విమానాశ్రయంలో ఐఎస్-కె ఉగ్రవాదులు చేసిన దాడిలో వందమందికిపైగా మరణించారు. వారిలో 13మంది అమెరికా సైనికులు. ఈ విషయం ప్రస్తావించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కళ్ళనీళ్ళపర్యంతం అయినాడు. గొంతు పూడుకుపోయి కొంతసేపు మాటరాలేదు. ఎందుకు? అమెరికా సైనికులు చనిపోయినందుకు. వారి కంటే పది రెట్ల మంది అఫ్ఘాన్ పౌరులు అదే దాడిలో అసువులు బాశారు. వారిని గురించి చింతలేదు. ఎవరి ప్రాణమైనా విలువైనదే అన్న స్పృహ అమెరికా అధ్యక్షులకు ఉండదు. ఉంటే దేశాలపైన బాంబులవర్షం కురిపించరు. పౌరులు వేలసంఖ్యతో చనిపోతున్నా దాడులు కొనసాగించరు. ప్రజాసామ్యం పేరుమీదా, కమ్యూనిజాన్ని రూపుమాపడం పేరు మీదా, మతోన్మాదాన్ని అరికట్టడం పేరుమీదా, ఉగ్రవాదం పీచమణచడం తన బాధ్యతగా పరిగణిస్తున్న అగ్రరాజ్యం ఉగ్రవాదంతో తలబడి ఓడిపోయిన రోజు ఇది.

Also read: 4 విమానాలలో అఫ్ఘాన్ నుంచి భారతీయులు క్షేమంగా దిల్లీకి రాక  

అమెరికాకి ఇప్పుడు తాజా శత్రువు ఐఎస్-కె (ఇస్లామిక్ స్టేట్ –కారసానా). తాజా మిత్రులు తాలిబాన్. నిన్నటి వరకూ ఏ తాలిబాన్ అమెరికా, నాటో సేనలపైన దాడి చేసి ప్రాణాలు తీసిందో అదే తాలిబాన్ తో కలసి ఇప్పుడు అమెరికా అధికారులూ, సైనికులూ పని చేస్తున్నారు. తాలిబాన్ అధినేతతో అమెరికా వేగుల శాఖ అధిపతి రహస్య సమాలోచనలు జరిపాడు. తాలిబాన్ కూ, ఐఎస్-కె కు పడదు. శత్రుత్వం ఉంది. అందుకని ఐఎస్-కె కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా నిఘావర్గాలు తాలిబాన్ తో పంచుకుంటున్నాయి.

అఫ్ఘానిస్తాన్ లో అమెరికా జోక్యం మూడు దశాబ్దాలుగా సాగుతోంది. కారణం ఏమిటి? అమెరికా ప్రయోజనాలకు నష్టం వాటిల్లినందుకా? అమెరికా పౌరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినందుకా? కాదు. పోలీసు పాత్ర పోషించేందుకు. 1979లో సోవియెట్ యూనియన్ సేనలు అఫ్ఘానిస్తాన్ లో ప్రవేశించిన కారణంగా అప్పుడు మరో అగ్రరాజ్యమైన సోవియెట్ యూనియన్ నూ, అది విశ్వసిస్తున్న కమ్యూనిజాన్ని ఓడించేందుకు సప్తసముద్రాల ఆవల ఉన్న అఫ్ఘానిస్తాన్ లో డాలర్లు కుమ్మరించింది. ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నిటి నుంచీ ముజాహిదీన్ అఫ్ఘానిస్తాన్ లో కమ్యూనిజాన్ని వ్యతిరేకించి పోరాడేందుకు వచ్చారనీ, వారి సంఖ్య ఇరవై నుంచి ముప్పయ్ వేలవరకూ ఉంటుందనీ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఒక వీడియోలో వెల్లడించారు. ఆ విధంగా అఫ్ఘానిస్తాన్ కు వచ్చిన ముజాహిదీన్ లో అల్ ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాదెన్ ఒకరు.

అప్ధాన్ బాలుడిని భుజాన వేసుకొని అమెరికా తీసుకొని వెడుతున్న అమెరికా సైనికుడు

నేటి శత్రువు రేపటి మిత్రుడు

సోవియెట్ యూనియన్ ను అఫ్ఘానిస్తాన్ నుంచి పారదోలేందుకు పోరాటం చేస్తున్న ముజాహిదీన్ కు ఆర్థికంగా,  సైనికంగా, నైతికంగా మద్దతు ఇచ్చిన దేశాలలో ప్రదానమైనవి పాకిస్తాన్, అమెరికా, సౌదీ అరేబియా,చైనా. ముజాహిదీన్ లో కొంతమంది అల్ ఖాయిదా సంస్థను ఏర్పాటు చేస్తే ముల్లా ఒమర్, మరికొందరు కలిసి తాలిబాన్ ను నెలకొల్పారు.  ముజాహిదీన్ ముఠాలలోని సభ్యులే ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అనీ, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరసాన అనీ వివిధ ఉగ్రసంస్థలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ అమెరికా డబ్బుతో, ఆయుధాలతో ఉద్భవించిన సంస్థలే.  అల్ ఖాయిదా న్యాయార్క్ లోని వాణిజ్య సముదాయంలోని రెండు శిఖరాలనూ కూల్చివేయడానికి రెండు రోజుల ముందే పాంజ్ షీర్ కు చెందిన నార్దర్న్ అలయెన్స్ అధినేత అహ్మద్ షా మసూద్ ని ఆత్యాహుతి దళ సభ్యుడు పేల్చుకొని తాను చనిపోయి, మసూద్ ని కూడా చంపివేశాడు. అల్ ఖాయిదాపైన కత్తి కట్టిన అమెరికా అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేసింది. అక్కడ రాజ్యం చేస్తున్న తాలిబాన్ ను పారదోలింది. ఇరవై ఏళ్ళ తర్వాత అదే తాలిబాన్ కు అధికారం అప్పగించి అమెరికా అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్పమించింది. వెళ్ళే ముందు అమెరికా సేనలపైన ఐఎస్ – ఖొరసాన కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతికి పాల్బడి జనం మధ్యలో పేలిపోయారు. ముజాహిదీన్ అవతారానికి కారణం అమెరికా, అల్ ఖాయిదా, తాలిబాన్, ఐఎస్ లు పుట్టింది అదే ముజాహిదీన్ నుంచి, ముందు అల్ ఖాయిదాతో పోరాటం, తర్వాత తాలిబాన్ తో ఘర్షణ, అనంతరం ఇస్లామకిస్టేట్ తో యుద్ధం. నిన్న ఎవరినైతే ఎదిరించి అమెరికా పోరాడిందో ఈ రోజు దానితోనే స్నేహం. ఈ రోజు ఎవరినై ఎదిరించిందో దాని సహకారంతో మరో సంస్థపైన దాడులు. ఈ విధంగా ఒక సూత్రబద్ధత లేకుండా, ఒక నియమం లేకుండా, ఒక ఆత్మగౌరవం లేకుండా మిత్రులను శత్రువులుగానూ, శత్రువులను మిత్రులుగానూ ఊహించి, భావించి, ఆడించి, ఆడి భ్రష్టుపట్టిన అగ్రరాజ్యంగా అమెరికా బదనాం అయిపోయింది. అనవసరమైన ప్రాంతాలలో, విషయాలలో జోక్యం చేసుకొని పెద్దస్థాయిలో నిధులు ఖర్చు చేసి, తమ సైనికుల ప్రాణాలు సైతం కోల్పోయి అర్ధం లేని త్యాగాలు చేసిన అమెరికాను అఫ్ఘానిస్తాన్ పౌరులూ, తాలిబాన్, పాకిస్తాన్,చైనా, సౌదీ అరేబియాలు కలసి చావుదెబ్బకొట్టాయి. అమెరికా కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.   

Also read: తాలిబన్లు కాదు, తాలిబాన్!

Related Articles

1 COMMENT

  1. USA have to face a serious agitations agonist Racism . USA government must curb NeoNazis the terror grupe of Whites in their home land it is signaling dangers to Asian imgrants

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles