Sunday, December 22, 2024

మూడో ముప్పు తిప్పలు తప్పవు

కోవిడ్ వెళ్లిపోయినట్లు, కరోనా కాలం పూర్తిగా ముగిసిపోయినట్లే ఎక్కడ చూసినా దృశ్యాలు కనిపిస్తున్నాయి. మాస్కులు వాడేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. జనం గుమిగూడడం, ట్రాఫిక్ ప్రభంజనం మునుపటి వలె అనిపిస్తున్నాయి. మూడో వేవ్ ముప్పు సెప్టెంబర్ నుంచి పెరిగి అక్టోబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుందని నిపుణులు ఇచ్చే నివేదికలు కలవరపెడుతున్నాయి. రెండో వేవ్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించాం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రణాళికా రాహిత్యం,నిర్లక్ష్యం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఘోరంగా విఫలమయ్యాం. ఆరోగ్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు సరిపడా దొరకక బాధితులు నానా ఆగచాట్లు పడ్డారు. ప్రాణవాయువు దొరకక ఎందరో ప్రాణాలే కోల్పోయారు.

Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

మునుపేన్నడూ కనీవినీ ఎరుగని విషాదం

దేశంలోని ప్రతిఒక్కరూ తమ ఆత్మీయులెవరినో ఒకరిని కోల్పోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి జాతిరత్నాలను పోగొట్టుకున్నాం.సందుచూసి, ప్రైవేట్ ఆస్పత్రులు రక్తం పీల్చిన వైనం అత్యంత ఘోరం. ఇక ఆకలికేకలు, ఆర్ధిక సమస్యలు, మానసిక ఆందోళనలు వర్ణనాతీతం. ఇంతటి విషాదాన్ని మనం ఎప్పుడు చూడలేదు. ఇందులో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం ఎంతఉందో? అంతకు మించిన స్వయంకృత అపరాధాలు ఎన్నో ఉన్నాయి. దేశం కనీసం ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఇంతటి ఘోరకలిని మరచి  నేడు మనం నడుచుకుంటున్నాం. డెల్టా వేరియంట్ల విస్తృతి కొనసాగుతూనే ఉంది. మూడో వేవ్ పిల్లలను కూడా ముంచెత్తు తుందని అంటున్నారు. సెప్టెంబర్ ఇంకా ఎంతోదూరం లేదు. ఈలోపు ఉధృతిని ఎదుర్కోడానికి ప్రభుత్వాలు సిద్ధమవ్వాలని, ప్రజలు అప్రమత్తం అవ్వాలని నిపుణుల కమిటీ నివేదిస్తోంది. వైరస్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యాక్సిన్లు సిద్ధమై ఉండాలి. ఇది పెద్ద సవాల్.

Also read: జనహృదయాధినేతకు జోహార్లు

ఒక్క డోసు టీకా అందనివారెందరో!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సామర్ధ్యం ఇంకా పూర్తిగా మనకు అనుభవంలోకి రాలేదు. మరికొన్ని కొత్త వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఐది మంచి పరిణామామే. బూస్టర్ డోసుతో కలుపుకొని మూడు డోసులు అందితే తప్ప, వైరస్ వేరియంట్లను ఎదుర్కోలేమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. రెండో డోసు తీసుకున్న తర్వాత  కూడా కొందరిలో యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది. మూడో డోసు వేసుకుంటే అవి మళ్ళీ గరిష్ఠ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు డోసులు తీసుకొనే సమయంలో వేరే వేరే సంస్థలు రూపొందించిన వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైన, మూడో డోసు తీసుకోవాల్సిన అంశంపైనా ఇంకా తీవ్రంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Also read: ప్రక్షాళన జరిగితేనే అధికారప్రాప్తి

దేశంలో చాలామందికి ఇంతవరకూ మొదటి డోసు కూడా అందలేదు.సింగల్ డోసు వ్యాక్సిన్లు కూడా సిద్ధమవుతున్నాయి.వీటి సామర్ధ్యం కూడా తెలియాల్సివుంది. ఇప్పుడు మనం తీసుకొనే వ్యాక్సిన్లు కూడా జీవితకాలానికి (లైఫ్ టైమ్) సరిపడా కాదు. కేవలం కొన్ని నెలలు మాత్రమే  పనిచేస్తాయి. లైఫ్ టైమ్ వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఈ ప్రక్రియ మన జీవితంలో భాగంగానే ఉండనుంది. పొంచివున్న మూడో వేవ్ ముప్పును, వాస్తవపరిస్థితులను, గతకాలపు చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు,ప్రజలు ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం.

Also read: సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

  1. మూడో వే వ్ రాదని కొందరు వాదిస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, బతుకమ్మ పండుగలు జాగ్రత్తగా జరుపుకొవాలి. ముఖ్యంగా గణేష్ పూజ ఇంటికే పరిమితం కావాలి. ప్రభుత్వం కెజీ టు పీజీ తరగతులు మొదలెడతానంతొంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles