Sunday, December 22, 2024

ప్రక్షాళన జరిగితేనే అధికారప్రాప్తి

రెండువేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీని గద్దె దింపాలి, ఎన్ డి ఏ స్థానంలో తిరిగి యుపీఏ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. తాడోపేడో తెల్చుకుందామంటూ విపక్ష పార్టీలతో జూమ్ సమావేశం నిర్వహించి హడావిడి మొదలు పెట్టారు. దీనికి కొన్నాళ్ల ముందుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఇటువంటి ప్రకటనే చేశారు. మరో విపక్ష సీనియర్ నేత శరద్ పవర్ కూడా ఆ మధ్య కాక రేపారు. నిన్న సోనియా నిర్వహించిన వర్చ్యువల్ సమావేశంలో 19పార్టీల నేతలు పాల్గొన్నారు. పాల్గొన్న నేతలలో శరద్ పవార్,మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే,స్టాలిన్ వంటి హేమహేమీలు ఉండడం విశేషం.

Also read: విశాఖ ఉక్కు దక్కాలంటే పోరాటమే శరణ్యం

మోదీని దించడమే ప్రధాన అజెండా

సమావేశంలో బిజీపి పాలనకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినా, వారందరి ప్రధాన ఎజెండా 2024లో మోదీని దించాలి, తాము ఎక్కాలి. ఇది సాధ్యమా? అన్నదే ప్రశ్న. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, అతని వ్యూహప్రతి వ్యూహ రచనతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కించాల్లన్నది ఆమె ఆకాంక్ష. పుత్రుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది ఆమె ఏకైక ఆశయం. తమ పార్టీని ప్రక్షాళనం చేసుకోకుండా, రాహుల్ నాయకత్వంపై పార్టీలో, విపక్షాల్లో, ప్రజల్లో విశ్వాసం పెంచకుండా, కేవలం ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకుంటే సరిపోతుందా? దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నూటికి నూరు శాతం పనికొస్తాడని నమ్మకం కలిగించడానికి ముందుగా వివిధ రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తమ సత్తా చూపించాలి. మీదు మిక్కిలిగా పార్టీలో తిరుగుబాటు జెండా ఎత్తిన నాయకులను తమకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అంతర్గత పోరు రగులుతూనే ఉంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న తెలుగురాష్ట్రాలలో పార్టీ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అస్సాం, పుదుచ్చేరిలో చేతులారా ఆధిపత్యాన్ని చేజార్చుకున్నారు. ఇంతవరకూ పార్టీకి అధ్యక్షుడే లేరు. సంస్థాగత ఎన్నికలు జరుపకుండానే కాలయాపన చేస్తున్నారు. దేశంలోని చాలా వరకూ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలు బలంగా వేళ్లూనుకొని ఉన్నాయి. ఇదివరకటి వలె కాంగ్రెస్ వెనక తోకాడించే పరిస్థితుల్లో పార్టీలు లేవు, నేతలు లేరు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరియైన సీట్లు రాకపోతే  రాహుల్ గాంధీ మళ్ళీ కాడిపడేయ్యడ కుండా ఉండాలి. యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు వివిధ ఏజెన్సీలను రంగంలో దింపి ప్రత్యర్ధులను మట్టుపెట్టడానికి చెయ్యని పని అంటూ లేదు. కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ‘సిబీఐ’ వంటి ఏజెన్సీలపై ప్రతిపక్షాలు వ్యంగాస్త్రాలను సంధించాయి.

Also read: సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ

ఆంధ్రుల హృదయాలు రగులుతూనే ఉన్నాయి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీసిన సమయంలో ఉభయ సభల్లో ప్రవర్తించిన తీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను రగిలిస్తూనే ఉంది. జీవితమంతా ఇందిరాగాంధీ కుటుంబానికి పరమ విధేయుడుగా అంకితభావంతో పనిచేసిన పీవీ నరసింహారావుకు జరిగిన అవమానాలు దేశప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మన్ మోహన్ సింగ్ వంటి మేధావిని, నిజాయితీపరుడిని ‘ఆటబొమ్మ’లా కూర్చోపెట్టి, సమాంతర పాలన చేసిన సోనియాగాంధీ పట్ల ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పోగుచేయడం అంత సులభం కాదు. అవినీతి,అసమర్ధత రాజ్యమేలిందనే పదేళ్ల యుపిఏ పాలన పట్ల ప్రజలు విసుగెత్తి గద్దె దించారు. బిజెపి/మోదీని అందలమెక్కించారు. ప్రస్తుత విపక్ష యుపీఏ పార్టీల మధ్య ఈ ఏడేళ్ళల్లో కనిపించిన సఖ్యత అంతంతమాత్రమే.జాతీయ స్థాయి ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్ చేసిన పోరాటం తేటతెల్లమే.  దేశంలో మెజారిటీ ప్రజలైన హిందూవుల మనసు దోచుకోవాలని రాహుల్ గాంధీ దంజం చూపిస్తూ, నేను బ్రాహ్మణుడను, హిందూవును అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా  ఆ ప్రదర్శనకు ఓటర్లు లొంగలేదు. సెక్యూలర్ అని ప్రచారం చేసుకుంటే సరిపోదు. అన్నిమతాల వారికి ఆ భావన పట్ల విశ్వాసం కుదరాలి. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై ఉండే సెంటిమెంట్ తో, నెహ్రు కుటుంబంపై ఉండే అదే సెంటిమెంట్ తో దేశ ప్రజలు కాంగ్రెస్ ను అన్నేళ్లు గెలిపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల నడుమ అగ్రవర్ణాల పేదలకు జరిగిన అన్యాయం అంతాఇంత కాదు. కార్పొరేట్ సెక్టార్, సాఫ్ట్ వేర్ రంగం పెరగడం వల్ల, అగ్రవర్ణాల పేద యువతకు ఎంతోకొంత ఉపాధి దొరికింది. ఇవ్వన్నీ సమాజంలోని కొన్ని వర్గాలను గాయం చేసిన అంశాలే. ప్రస్తుత ఎన్ డి ఏ ఏడేళ్ల పాలన అద్భుతంగా లేకపోవచ్చు. కరోనా కష్టాలు పెరిగి, అధికధరలు చుట్టుముట్టి, నిరుద్యోగం ప్రబలి, ఉపాధిలేమి ఉవ్వెత్తున ఎగిసి దేశ ప్రజలు తీరని దుఃఖంలో ఉన్నమాట నూటికి నూరు శాతం నిజం.సమస్యలు తీర్చి,సమభావంతో పాలన అందించి ఊరట కల్పిస్తారని విశ్వాసం కలిగించే నాయకులు ప్రస్తుతం యుపీఏలో కనిపించడం లేదు. రాజీవ్ గాంధీ కనీసం మిస్టర్ క్లీన్ ఇమేజ్ కొంతైనా తెచ్చుకున్నారు. ప్రియాంకాగాంధీ తనకు బాధ్యతలు అప్పగించిన ఉత్తరప్రదేశ్ లో సాధించిన ఘనత ఏమీ లేదు. మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ పట్ల విధేయత కలిగిన బలమైన నాయకులు వేరే పార్టీలోకి వెళ్లిపోతూ ఉంటే చూస్తూ ఉండడం పార్టీ ప్రక్షాళన కిందకు రాదు.

Also read: అఫ్ఘానిస్తాన్ పాఠాలు అనేకం

ధృతరాష్ట్ర కౌగిలి

అమరేంద్ర సింగ్ -నవ్ జోత్ సింగ్ సిద్ధూ కత్తులు దూసుకుంటుంటే తమాషా చూడడం రాజకీయ వ్యూహం కిందకు రాదు.ప్రస్తుత వారి  సయోధ్య ‘ధృతరాష్ట్ర కౌగిలి’ వంటిది తప్ప ఏదీ కాదు.బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకం మొదలు నిన్నటి ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కు ఎడమొహం పెడమొహంగా రాహుల్ వ్యవహరించిన తీరు కాంగ్రెస్ కొంపముంచింది.   పాలనలోని తప్పులు, వైఫల్యాలు, ప్రతిపక్షంగా ఇప్పటి వరకూ సాగించిన అసమర్ధ పాత్ర, జరిగిన పార్టీ నిర్వీర్యం మొదలైన అంశాలపై పెద్దస్థాయిలో పునఃసమీక్ష, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ కాస్త దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు. ఉద్దేశ్యం ఏదైనా, విపక్షాల మధ్య కూసింత ఐక్యత పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ పథక రచన తప్పకుండా ఎంతోకొంత పనిచేస్తుంది. మోదీ గ్రాఫ్ గతంలో కంటే కొంత తగ్గి ఉండవచ్చు. అదే సమయంలో రాహుల్ గాంధీ / యుపీఏ గ్రాఫ్ పెద్దగా పెరిగింది ఏమీ లేదు. ఇప్పటికైనా విపక్షాలు మేలుకోవాలి. ముందుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలచి చూపించాలి. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించవచ్చు. బిజెపి / నరేంద్రమోదీని ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ప్రజావ్యతిరేకత పెరిగితే తప్ప ఎన్ డి ఏ ను గద్దె దించే శక్తి ప్రస్తుతానికి విపక్షాలకు లేదు.

Also read: అయ్యో అఫ్ఘానిస్తాన్!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles