బాంబేగా కులికినప్పుడూ
ముంబయిగా వెలుగుతున్నప్పుడూ
ఇక్కడి వర్షానికి
క్యా ఫరక్ పడ్‌తా హై!
మెరీన్‌డ్రైవ్‌లో
ఈడ్చి కొట్టే ఉప్పెన
జల ఫణ గణాగ్రంలా
అందంగా వుంటుంది గాని
అనుభవమే
విష ఫూత్కార సంచలితం.
ఆనాటి శ్రీ 420 సినిమాలోని
నర్గీస్, రాజ్ కపూర్‌లు
ఇప్పుడు ఏ చెట్టు నీడన దాక్కున్నారో!
ఎగిరి పోయిన గొడుగును
వారికి తెచ్చివ్వాలి.
పరేల్‌లోని
పల్లపు ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను
బ్లాక్ అండ్ ఎల్లో ఫియట్ ట్యాక్సీలు
చీల్చుకొని వెళ్తుంటే
టెన్ కమాండ్‌మెంట్స్
ఎర్ర సముద్రం
రెండుగా విడిపోతూ
మోజెస్‌కు దారి నిస్తున్న
అరుదైన విరాట్ దృశ్యం
ఆవిష్కృత మౌతుంది.
జూహూలో
ఓ అపార్ట్‌మెంట్ బాల్కనీ లోంచి వీక్షిస్తుంటే
బీచీలోని ప్రేమ జంటలను
వెంట బడి తరుము తున్న
సముద్ర రుద్ర తాండవ హేల!
ఒక రోజు
పెను వరదలో
మునిగి పోయిన కారులో
ఊపిరాడక మరణించిన
వ్యక్తిని చూసి నప్పుడు మాత్రం
ఇంతటి సంక్లిష్ఠ సౌందర్యం కూడా
బీభత్స రసంగా మారి పోయింది.
పక్కన అరేబియా సాగరం
అలల పంజా విప్పుతున్న
మహా పులిలా గర్జిస్తోంది.
ముంబయి అనగానే
గుర్తుకొచ్చే నా మిత్రుడు
ప్రస్తుతం
నవీ ముంబయిలో కాపురమున్నాడు.
ఇవాళ టైముకు
ఇల్లు చేరాడో లేదో!
ఫోన్ చేసి కనుక్కుంటే కాని
సుదరాయించదు.
[కొత్తపల్లి రమేష్ బాబుకు]
Also read: అంశిక
Also read: గాలి
Also read: గొడుగు
Also read: మా ఊరు
Also read: ఆకు
Good bobay varsham