ఓ అవ్వా
నువ్వు ఏడికి బోయినవో గని
తాప తాపకు యాదికస్తవె !
మొగులైనప్పుడు
పానం బుగులైనప్పుడు
ఒక్క తీర్గ యాదికస్తవే !
జోరుగ వానలు బడి
సర్ది దగ్గులు షురువైనప్పుడు
నోరు మంచిగ లేక సప్పిడి బడి
సలికాలం సెవులు గడలు బడి
జెరమచ్చినట్టు అయినప్పుడు
నీ సర్వరోగ నివారిణి
అది మందో మంత్రమో
బలే యాదికొస్తది
అప్పటి కాలంల నువ్వు
నువ్వేంది మేము గూడ ఇనని
ఎన్నడు తినని
తీరొక్క తిండ్లు తింటున్నమిప్పుడు
సుక్కల భోజనశాలల్ల
కంటికి నచ్చిన పసందైన
వంటకాలు సయి సూస్తున్నం
అయినా…
నాలుక మీది రుచిమొగ్గలు
పీకినప్పుడో
కారం కారంగ ఏదన్న తినబుద్దయినప్పుడో
నిన్ను యాజ్జేసుకొని
ఇన్ని ఎల్లిపాయలు
ఇంత కారప్పొడి నూనె
రోట్లేసి దంచిన ఆ
కమ్మటి వంటకం రుచి
ఏ స్టార్ హోటల్ల గూడ దొరుకదాయె
ఇంకొక్క ముచ్చట గూడ జెప్పాల్నే అవ్వా !
అమ్మ నన్ను కారం దిననియ్యకవోతే
చిన్నప్పుడు నేను నీ సుట్టు దిరిగి
మక్క కంకులకు రాసుకొని తిన్నట్టు
ఇప్పుడు నా పిల్లగాండ్లకు గూడ
మస్తు పానం
నీ ఎల్లిపాయ మిరం !!
*****