– హిమజ
ముక్కలైన ఆకాశం కింద
నగరాన్ని చీల్చిన ఫ్లై ఓవర్ల కింద
తొక్కిసలాడే రహదార్ల మీదుగా
వర్షం నగరాన్ని వస్త్రఖాళితం పట్టింది
కురిసి కురిసి వెలిసింది వాన
వర్షం వాషింగ్ మెషీన్లోంచి బయటపడి
నగరం కొద్ది కొద్దిగా తెప్పరిల్లుతుంది
ఊరంతా కరిగి పారిన హిమనీ నదాలు తమ తావులకు తరలిపోయాయి
నీటి యుద్ధంతో పెనుగులాడి తడిసి ముద్దైన చెట్లు బంగళాలు గుడిసెల మీద
లేత నీరెండ వెచ్చని గొడుగు పట్టింది
ఆకాశమంతా తెల్లని మబ్బులతో
మల్లెల దుప్పటిలా ఉంది
కాగితప్పడవల్లా తేలిన ముంపు ఇళ్ళల్లో
నీళ్ళింకిపోయి పొయ్యి రాజుకుంది
ఇరానీ చాయ్ పొగల ఆవిరి
అంబరాన్ని తాకి సంబరాలు చేసింది
మక్కజొన్న కంకులు కాల్చే
నిప్పుల తట్ట కణకణలాడింది
వేడి చిరుతిళ్ళు అందించే
అమ్మకి కాస్త తెరిపి దొరికింది
నీళ్ళెక్కువై తల వాల్చిన
నాజూకు మొక్కలు
నిలబడి నిటారుగా నవ్వుతున్నాయి
ఇన్ని రోజుల మురికి బట్టలు దండేలపై
జయకేతనాలై ఎగురుతున్నాయి
వర్ష సప్తాహం ముగిసి పురవీధులన్నీ
జనజీవన వర్ణ సంభ్రమాన్ని
తిరిగి అద్దుకున్నాయి
మింటినీ మంటినీ ఏకం చేసిన
ఆషాఢ మేఘం మాత్రం
ఏమీ తెలియని ప్రవాసిలా తిరిగెళ్ళిపోయింది !!
•••••••••••••••••••
సుతిమెత్తగా కవిత్వం రాసే
హిమజ మొదటి పుస్తకానికి (‘ఆకాశమల్లె‘ )
సుశీల నారయణ రెడ్డి అవార్డ్ , రెండవ కవిత్వ పుస్తకం ‘సంచీలో దీపం’ కి రొట్టెమాకు రేవు అవార్డ్ వచ్చాయి.
Also read: వెళ్ళిపోయాక …..