అరుణ కమలం వికసించిన వేళ
మనసు రాగరంజితమైన వేళ
ఆర్ద్రం, మార్దవం నాలో ఇంకా మగిలిన వేళ
ఎంత అందం ఎంత ఆనందం.
మరుడుపడ్డ భావోద్వేగాలు భాసించే వేళ
రంగు వెలసి మనకబారిన స్వప్నాలు సాకారమయ్యేవేళ
కొడిగట్టిన దీపాలు అరుణవర్ణంలో జ్వలించే వేళ
ఎంత అందం ఎంత ఆనందం.
మధురోహల్లో మనసు మునకలేసే వేళ
నీరసాన్ని వదిలించుకొని రసాస్వాదన చేసే వేళ
చిరునవ్వులు చెదరకుండా చిందులేసే వేళ
ఎంత అందం ఎంత ఆనందం.
నయాగారాల్లా నవ్వులు ముంగిట కురిసే వేళ
మనసులు అనాచ్ఛాదితంగా పెనవేసుకునే వేళ
తాపాల్లేని తపనలు ఆర్తిగా ఒళ్ళంతా పారాడే వేళ
ఎంత అందం ఎంత ఆనందం.
నువ్వు నేనుగా మిగిలిన మనం
ఎప్పటికీ మనమేనంటే
ఎంత అందం ఎంత ఆనందం
నీ మనసులో సుళ్ళు తిరుగుతూ నేను
నా కవితా కాసారంలో మునకలేస్తూ నువ్వు
అబ్బ! ఊపిరి ఆగేంత ఆనందం.
Also read: అనిత్య సత్యం
Also read: విద్యాలయం
Also read: నాటి నెల్లూరు
Also read: ధుని
Also read: సంభవామి యుగే యుగే