అంత పెద్ద ఆకాశాన్నీ
ఇంత గుడ్డ పేలిక ధిక్కరించింది.
భుజం మీద
విష్ణు చక్రంలా తిరుగుతుంటే
మేఘాలు గుబగుబలాడాయి
ధైర్యమంటే గొడుగుదే.
మూడు రోజులుగా
ఒకటే వర్షం!
కిటికీల్లోంచి తిలకించే వారికి
బర్‌ఖా బహారే
గరీబోళ్లకు మాత్రం
ఆమె పాల కోసం బయల్దేరింది
తన హృదయ స్పందనలు
గొడుగు పుల్లపుల్లకూ తెలుస్తున్నాయి.
భళ్లున తెరుచుకున్నప్పుడు
రెప్పల్లా ముడుచు కున్నప్పుడూ
దృశ్యాదృశ్యాల జలక్రీడ.
గొడుగు అంచున జారే
వాన నీళ్లనూ కన్నీళ్లనూ
వేరు చెయ్యడం కష్టం!
మామూలు రోజుల్లో గొడుగు
అందమైన పూల డిజైన్లతో
ఓ కావ్య ఖండికలా వుంటుంది.
లోపలి పుల్లల అల్లిక
సంవిధాన శిల్పంలా
ముచ్చట గొలిపే
అల్లి బిల్లి వాటిక.
ఈనాటి ఫ్యాన్సీ గొడుగులు సరే
నాకు వారసత్వంగా వచ్చిన
ఛత్రిని బయటికి తీశాను.
ఆనాటి మాసికలు
నల్లని ఆకాశంలో
స్మృతి తారకల్లా మెరుస్తున్నాయి.
పాత వస్తువులను పారేసే సంస్కృతి
నాకిప్పటికీ అబ్బ లేదు.
ఈ గొడుగు నీడలో జాగా
ఇద్దరికీ వుంటుంది
శ్రీ 420 సినిమాలో
నర్గీస్ రాజ్ కపూర్‌లు
మెరిన్‌డ్రైవ్‌పై పాడే దృశ్యం
యాభై యేళ్లు దాటినా
తడి తడి గానే వుంది.
‘ముసురులో తడవట మెందుకు
మార్నింగ్ వాక్ మానెయ్‘ అంది మా ఆవిడ
గొడుగు చేతిలో వుంటే
అడుగులకు అదో ధైర్యం.
గొడుగు నడిచే చెట్టులాంటిది
దాని నీడ రక్షణకు తొలిమెట్టు.
Also read: మా ఊరు
Also read: ఆకు
Also read: తాళం చెవి
Also read: సాక్షి
Also read: దస్తి