నేనెక్కడుంటే
అదే మా ఊరు.
ఉన్న ఊరు
అలవాటయ్యిందని కాదు
సొంతూరును
ఇక్కడిని తెచ్చుకున్నానని.
జీవితమంతా
పోలికల్తోనే గడుస్తుంది.
ఇక్కడ ఎన్ని ఎత్తుల కెదిగినా
మా గుట్ట కన్న పొట్టిగానే వున్నాయి.
మా వాకిట్లో
సిమెంటు తాపడం చేయించ లేదు
సానిపి చల్లక పోతే
జీవన పరిమళాలకు దూరమౌతామని.
మా బస్తాలో
బియ్యపు గింజలు
ఏదో గొణుక్కుంటున్నాయి.
అక్కడి పొలాల్లో మాయమై
ఇక్కడ తేలినట్టున్నాయి.
ఎన్ని చేతులు మారాయో
ఎక్కడెక్కడ తిరిగాయో
వాటి అనుభవాల నడగాలి.
నేనెప్పుడూ
కాటన్ షర్టులే వేసుకుంటాను.
మా ఊరి పత్తి పుష్పాలను
అతికించుకున్నట్టు
మెత్తగా వుంటుంది.
ఈ ఊరి పెద్ద రోడ్లు
నన్ను భయపెట్టవు.
మేము వలస వచ్చిన
హైవేలను కత్తిరించి
పరుచుకున్నవే ఇవి.
తులనాత్మక అధ్యయనంలో
అతులిత పాండిత్యం నాది
ఈ ఊరు
అన్నం పెట్టిన జీవిక
దాని అట్టడుగున ఉన్నది మాత్రం
మా ఊరి మృత్తికే.
ఇక్కడ
వర్షం కురిసినప్పుడల్లా
మా ఊరి దఃఖమంతా
తరలి వచ్చినట్టని పిస్తుంది.
ఇక్కడ అన్నీ దొరుకుతాయి గాని
మా అమ్మ
ఊరిలోనే వుండి పోయింది.
ఇప్పుడు బహుశా మా ఆవిడలోనే
అమ్మను వెతుక్కుంటున్నాను.
Also read: ఆకు
Also read: తాళం చెవి
Also read: సాక్షి
Also read: దస్తి
Also read: కవి సమయం