లాక్ డౌన్ సడలింపులు, పెరిగిన జనసమ్మర్ధన, డెల్టా వేరియంట్ల వ్యాప్తి, వ్యాక్సినేషన్ లో తగ్గిన వేగం నేపథ్యంలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ నియంత్రణలో కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో యుద్ధానికి దిగాయి. వైఫల్యాలపై పోస్ట్ మార్టమ్ ను తోసిపుచ్చుతూ, అధికార పార్టీ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా, కోవిడ్ కట్టడికి 40వేల కోట్లరూపాయలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేటాయించిన నిధులతో పాటు కోవిడ్ నివారణ, మౌలిక సదుపాయాల కల్పనలకు భారీఎత్తున నిధుల కేటాయింపుకు ఆమోదం తెల్పడం మంచి మలుపే.
Also read: తొలి రోజు సభ నినాదాలతో సరి
అతి కొద్దిమందికే వాక్సిన్లు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరగడంతో పాటు, మరికొన్ని సంస్థల నుంచి కొత్తగా వ్యాక్సిన్లు రాబోతున్నాయని కేంద్రం భరోసా ఇస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధించుకుంటోంది. దేశ జనాభాలో 67శాతం మందికి యాంటీబాడీస్ పెరిగాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ సీ ఎం ఆర్ ) అంటోంది. ప్రజలపై ఈ పరీక్షలు ఎప్పుడు జరిపారో తెలియరావడం లేదు. ఇంత వరకూ దేశ జనాభాలో అతికొద్దిమందికే వ్యాక్సిన్లు రెండు డోసులు అందాయి. కోవాగ్జిన్ -బూస్టర్ డోసు కూడా తీసుకుంటే కానీ ఫలితం ఉండదని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతగా యాంటీ బాడీస్ ఎలా పెరిగాయో ఆశ్చర్యంగానే ఉంది. ఐసీఎంఆర్ నివేదికలను విశ్వాసంలోకి తీసుకున్నా, దేశంలోని 40 కోట్లపైగా జనాభాలో ఇంకా యాంటీ బాడీస్ అభివృద్ధి చెందలేదన్నది నిజం. వీళ్ళందరికీ వైరస్ బారినపడే ముప్పుఉందనే స్పృహలోనే మనం ఉండాలి. సమూహాలకు దూరంగా ఉండడమే శిరోధార్యం. వేర్వేరు దశల్లో మరో 5 వ్యాక్సిన్లు ఉన్నాయని తెలుస్తోంది. విదేశీ టీకాలను దిగుమతి చేసుకోవడంలో ఇంకా వేగం పెరగాలి.
Also read: దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణ
టీకాలు ఎప్పటికి చేరేను?
స్పుట్నిక్- సింగిల్ డోస్ పరీక్షలకు ఇంకా అనుమతులు లభించలేదని సమాచారం. త్వరలో 75 లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవి దేశానికి ఎప్పుడు చేరుకుంటాయన్న విషయంపై స్పష్టత లేదు. విదేశీ సంస్థలకు ఇండెమ్నిటీ అంశంపై కేంద్రం ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వ్యాక్సిన్ తయారీ సంస్థలు – ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఫలవంతమైతే కానీ, విదేశీ టీకాలు మనకు అందుబాటులోకి రావు.కోవిడ్ కట్టడిపై చర్యలను వేగవంతం చేస్తూ,కరోనా కల్పిత కష్టాల నుంచి ప్రజలను బయటపడేసే మార్గాలను కేంద్రం అవలంబించాలి. ఉపాధి, ఉద్యోగాలు, ఆదాయంపై అన్ని వర్గాలవారికీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే అదనుగా నిత్యావసర సరుకుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆదాయం ఆగి లేదా తగ్గి,ఖర్చులు పెరిగితే సగటుమనిషి గతేంటి? పేదలు ఎంత మగ్గుతున్నారో, మధ్యతరగతి ప్రజలు కూడా అంతే మగ్గుతున్నారు. వాళ్ళు పడే కష్టాలు ఆన్నీఇన్నీ కావు. అనూహ్యంగా పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలు కూడా మధ్యతరగతి మనిషిపై గుదిబండలే. కరోనా వైరస్ ను కట్టడి చేయడం ఎంత ముఖ్యమో కరోనా కల్పిత కష్టాలను కట్టడి చేయడం అంతకంటే ముఖ్యం. నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టి ఆచరణలో, అనుభవంలో ఫలితాలను చూపిస్తే తప్ప పాలకులపై ప్రజలకు విశ్వాసం కుదరదు.
Also read: చైనా నైజం మారదా?