అతను ఉన్నంత సేపు
అక్కడ వసంతం వెల్లి విరిసేది.
అందరి ముఖాల పై
సంతోషపు సంపెంగలు పూచేవి,
హాస్యం లాస్యం చేసేది.
మంద్రంగా మంద హాసాలు
ఘాటుగా పరిహాసాలు
గంగా తరంగ ఝరి లా
గల గల నవ్వుల తో
మా స్నేహ సమాగమాలు
సరిగమలు పల్లవించేవి.
ఏడవడం రానివాడు
నవ్వడమే తెలిసిన నా నేస్తం
ఇప్పుడు సమాధి లో
ఒక నిశ్శబ్ద నిర్లిప్తత తో
ఉన్నట్లు అనిపించింది.
అరచేతితో అక్కడ రాలిన ఎండుటాకులు
పక్కకు తోసి
నేను తెచ్చిన తెల్ల గులాబీ మొగ్గలు
మృదువు గా సమాధి పై ఉంచాను.
లోపల నుండి దుఃఖం పొంగుకు వచ్చింది.
ఏడవాలని ప్రయత్నం చేశాను…
ఊహ… విచిత్రం… ఏడుపు రాలేదు,
కళ్ళు చెమర్చ లేదు…
మరల ప్రయత్నించాను
మరల, మరల…
ఒక్క చిన్న శబ్దము కూడా
నా గొంతు చీల్చుకొని రాలేదు.
మిత్రమా నిన్ను కోల్పోయిన
దుఃఖం నేనెలా తెలపాలి?
నువ్వు లేవన్న నిజం
నా కంఠం లో విష కంటకం లా
గుచ్చుకొని ఉందని ఎలా చెప్పేది?
మౌనం గా ఆ సమాధి వైపే చూస్తూ
ఉండిపోయా… ఎంత సేపో?
ఒక్కసారి నిట్టూర్చి లేచి నుంచుని
వెనుకకు తిరిగా…
ఎందుకో ఫక్కుమని నవ్వా…
మళ్ళీ మళ్ళీ నవ్వా…
పగల బడి నవ్వా… నవ్వుతు నే ఉన్నా…
ఇంతలో ఎవరో నా వెనుక
నా కంటే గట్టిగ నవ్వినట్లనిపించి
ఉలిక్కి పడి వెనుకకు చూసా…
ఎవరు లేరు…
నా నవ్వుల ప్రతి ధ్వని
నా నేస్తం సమాధి నుండి…
అసంకల్పితంగా నా కంటి నుండి
జలజల రాలిన కన్నీళ్లు…
రివ్వు న విసిరిన చల్ల గాలికి
చెట్ల ఆకుల పైనుండి
మంచు బిందువులు రాలి,
సమాధి, ముత్యపు చిప్పలా మెరిసింది.
నా మిత్రుడికి అత్యంత ఇష్టమైన
ఆనంద భాష్పాలు…
Also read: చందమామ
Also read: పగటి కలలు
Also read: భాష
Also read: సన్మానం
Also read: కత్తులు, కరవాలాలు