- మంగళవారం ఉదయం కన్నుమూసిన సినీ దిగ్గజం
- ఫాల్కే, పద్మవిభూషణ్, నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డులతో సత్కారం
- సైరాబానుతో 50 ఏళ్ళ జీవితం
- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ముంబయ్: ఒక శకం ముగిసింది. బాలీవుడ్ లో మహాప్రకాశవంతంగా దశాబ్దాలపాటు నిలిచి వెలిగిన మహోజ్వల తార దిలీప్ కుమార్ కన్నుమూశారు. ఒకే నెలలో రెండో సారి ఆస్పత్రిలో చేరిన తర్వాత శ్వాసపీల్చుకోవడం కష్టమై శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. సుదీర్ఘ అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం గం. 7.30లకు దివంగతులైనారని ఆయన కుటుంబ వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ పీటీఐ వార్తాసంస్థకు తెలియజేశారు. ‘‘ప్రియమైన దిలీప్ సాహెబ్ కొద్ది నిమిషాల కిందట కాలం చేశారని బరువైన హృదయంతో, అత్యంత వేదనతో తెలియజేస్తున్నాను.మనం దేవుడి నుంచి వచ్చాం. ఆయన దగ్గరికే తిరిగి వెడతాం,’’ అని దిలీప్ కుటుంబానికి సన్నిహిత మిత్రుడు ఫైజల్ ఫారూఖీ తన మిత్రులకు ఇచ్చిన సందేశంలో వ్యాఖ్యానించారు.
‘‘ప్రవృద్ధమానం అవుతున్న భారత దేశ చరిత్రకు ప్రతీకగా దిలీప్ కుమార్ నిలిచారు. ఆ నటశిఖరం ఆకర్షణ అన్ని వర్గాలకూ వ్యాపించింది. సమస్త సరిహద్దులనూ అధిగమించింది. భారత ఉపఖండం అంతటా ప్రజలు ఆయనను ప్రేమించారు. భారతీయుల హృదయాలలో దిలీప్ కుమార్ శాశ్వతంగా కొలువై ఉంటారు. ఆయన కుటుంబానికీ, అసంఖ్యాకులైన అభిమానులకూ నా సంతాపం,’’ అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ సందేశం పంపించారు.
‘‘సినిమా దిగ్గజంగా దిలీప్ కుమార్ ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. సాటిలేని అద్భుతమైన ప్రావీణ్యం ఆయన సొంతం. కొన్ని తరాలకు చెందిన ప్రేక్షకులను మైమరపించారు. ఈ దేశ సాంస్కృతిక ప్రపంచానికి ఆయన లేని లోటు పూడ్చలేనిది,’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ సంతాప సందేశంలో అన్నారు.
దిలీప్ కుమార్ ట్విట్టర్ లో ఆయన సతీమణి సైరాబానూ రెండు రోజుల కిందట ఈ విధంగా ఆశాజనకమైన సందేశం పోస్ట్ చేశారు: ‘‘దిలీప్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఆయనపైన అసాధారణమైన, నిరంతరమైన ప్రేమను చూపుతున్నందుకు దేవుడి పట్ల కృతజ్ఞతాభావం వెలిబుచ్చుతున్నాం. మేము ఇంకా అస్పత్రిలోనే ఉన్నాం. మీరూ ప్రార్థించండి. మీ దీవనలతో, అల్లా దయతో దిలీప్ గారు ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్నాను,’’ రెండో తరంగం కోవిద్ మహమ్మారి దాడి చేయకముందు మార్చిలో దిలీప్ చేసిన ట్వీట్ లో తానూ, సైరా ముందు జాగ్రత్త చర్యగా ఒంటరిగానే జీవిస్తున్నామని అభిమానులకు తెలియజేశారు.
దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. ఆయన అసమానుడైన నటుడు. మంచి వ్యక్తి. నయా దౌర్, మొగలియాజం, దేవదాస్, రామ్ అవుర్ శ్యామ్, మధుమతి, గంగా జమునా వంటి అజరామరమైన చిత్రాలలో కథానాయకుడిగా నటించి హిందీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియా అనే ఇంగ్లీషు సినిమాలో నటించమని డేవిడ్ లీన్ కోరితే అందుకు దిలీప్ నిరాకరించారనీ, ఆ పాత్రను ఒమర్ షరీఫ్ పోషించి విశ్వవిఖ్యాతి గడించారనీ దిలీప్ సన్నిహితులు చెబుతారు. 1940లలో నటించడం ప్రారంభించి 1980ల చివరి వరకూ హీరోగా అనేక పాత్రలలో జీవించారు. శక్తి, క్రాంతి, కర్మ, సౌదాగర్ వంటి సినిమాలకు ప్రాణం పోశారు. 1998లో ‘ఖిలా’ పేరుతో వచ్చిన సినిమా ఆయన నటించిన చివరి చిత్రం. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయనను సత్కరించారు. పాకిస్తాన్ లో అత్యున్నత పురస్కారమైన నిషాన్-ఇ-ఇంతియాజ్ ను ఆయనకు ప్రదానం చేశారు. సినిమా అవార్గులకూ, ఉత్తమ నటుడి అవార్డులకూ లెక్కలేదు.
దిలీప్ కుమార్ ని మొదట ఈ నెల ఆరవ తేదీన ఆస్పత్రికి తీసుకొని వెళ్ళి ఆయన శ్శాసను క్రమబద్ధం చేసేందుకు ఆక్సిజెన్ పెట్టారు. అప్పుడు దిలీప్ ని ఆస్పత్రికి వెళ్ళి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పలకరించారు. ‘‘వాట్సప్ మెసేజ్ లను నమ్మకండి. సాబ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. మీ ప్రార్థనలకూ, శుభాకాంక్షలకూ ధన్యవాదాలు. రెండు, మూడు రోజుల్లో దిలీప్ సాబ్ ఇంటికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు,’’ అంటూ మహానటుడి అధికార ట్విట్టర్ నుంచి రెండు రోజుల కిందట ట్వీట్ వచ్చింది. మూత్రపిండాల సమస్య, నిమోనియా కారణంగా కొన్నేళ్ళుగా దిలీప్ కుమార్ బాధపడుతున్నారు. ఆస్పత్రికి వస్తూ పోతూ ఉన్నారు. డిసెంబర్ లో ఆయన 99లో అడుగుపెట్టేవారు. యాభై ఏళ్ళుగా ఆయన భార్య సైరాబానుతో సహజీవనం చేస్తున్నారు. తాను హిందీ దేవదాసులో నటించిన తర్వాత తన కంటే తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు బాగా నటించారని ప్రశంసించిన సహృదయుడు దిలీప్ కుమార్. మంగళవారం సాయంత్రం అయిదు గంటలకే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.