(ఇది కొత్త శీర్షిక. మహాత్మాగాంధీ ఈ దేశానికి చేసిన సేవల గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. కొత్త తరాలకు తెలియపరచవలసిన అవసరం ఉంది. గాంధీని తలచుకోవడం కంటే గాంధీ ఏయే సిద్ధాంతాలు చేశారో, ఏయే విలువలకు కట్టుబడి జీవితం సాగించారో, ఏ సూత్రాలకు లోబడి స్వాతంత్ర్య సంగ్రామానికి సారథ్యం వహించారో తెలుసుకోవాలి. గాంధీ కనుక ఈ రోజు మన మధ్య సజీవంగా ఉంటే మనలను చుట్టుముడుతున్న సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు సూచించేవారో, ఏమి ఆచరించేవారో ఆలోచించడం కూడా ఉపయోగకరమన అంశం. ఇది వారంవారం ప్రచురించే ధారావాహిక. పేరు ‘గాంధీయే మార్గం.’ ఈ శీర్షిక నిర్వాహకులు ఆకాశవాణి ఉన్నతాధికారిగా ఇటీవలి వరకూ పనిచేసిన సాహిత్యకారుడూ, శాస్త్రవిజ్ఞాన ప్రచారకుడూ అయిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు.)
గాంధీయే మార్గం-1
రెండు దృశ్యాలు… ఒకటి భారతదేశంలో… రెండోది అమెరికాలో! రెండూ లాక్ డౌన్ సమయంలోనే జరిగాయి. అయితే అమెరికాలో మే 25 తర్వాత జరిగితే, భారతదేశంలో ఏప్రిల్ నెలలో మనం కళ్ళు తెరచి తెలుసుకున్నాం. కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించగానే అన్ని రాష్ట్రాలలో ఉన్న అసంఘటిత రంగాల కార్మికుల పరిస్థితి ఘోరం. వీరినే గెస్ట్ వర్కర్స్ అనే మాట వాడాలని సంస్కారవంతులు సూచిస్తున్నారు. ఉన్నచోట పనిలేదు, ఈ స్థితి ఎంతకాలమో తెలియదు, సొంత ఊళ్ళలో భార్యా, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎలా వున్నారో తెలియదు. రైళ్ళు, బస్సులు ఆగిపోయాయి. విమానాలు ఆగిపోయినా వారికి అవసరం లేదు. అంతే, ఉన్నపళంగా ఎలా ఉన్నవారు అలా సంచీనో, గిన్నెనో తీసుకుని బయల్దేరారు. దేశంలోని ప్రతి మూల నుంచి అన్ని వయసుల వాళ్ళూ – పురుషులు, స్త్రీలు, పిల్లలు తమ ఇంటిబాట పట్టారు.
వందలాది కాదు వేలాది మంది వలస వచ్చిన కార్మికులు కాలి నడకన బయలుదేరిన తర్వాతనే ప్రభుత్వానికీ, ప్రజలకీ బోధపడింది. ఈ సమాచారం సోషల్ మీడియా, మీడియా ద్వారా రాగానే స్పందించిన మానవతా వాదులు వీరిని సొంతవూళ్ళకు చేర్పించి, లాక్ డౌన్ ప్రకటించి వుండాల్సింది అని ఘాటుగా వాదించారు. నిజానికి చెప్పాలంటే ఈ సమస్య ఇంత విస్తారంగా, ఇంత లోతుగా, ఇంత విదారకంగా ఉందని అసలు తెలియదు. ఆ స్థాయి సున్నితత్వం మన చదువుకున్న వర్గాలతో సహా అధికారవ్యవస్థలో ఇంకా వంటబట్టలేదని ఈ సందర్భంలో బోధపడింది. పట్టణాలలో, నగరాలలో ఎన్నో రకాల సేవలు – ఇంటిలో, ఇంటి గడపలో, వీధిలో, మార్కెట్టులో, రోడ్డుమీద, బస్టాండులో, రైల్వేస్టేషన్ లో ఇలా వందలాది రకాల పనులు చేసే వ్యక్తులుగా వీరిని అందరం చూశాం. అయితే వారు ఇన్ని లక్షల్లో ఉన్నారని ఎవరూ అప్పటికి అంచనా వేయలేదు. ఇప్పుడు లోతయిన సోషియాలజి పరిశోధనలు జరగవచ్చు. తిండిలేదు, నీళ్ళులేవు, చెప్పులు కొందరికున్నాయి. ఎంతో కొంత లగేజితో నడక… నడక! దాంతో లాక్ డౌన్ నిషేధాలు సడలించి న్యాయస్థానం వారికి అడ్డు చెప్పవద్దంది. ఈ సమాచారం తెలిసిన మిత్రులు ఎన్నోచోట్ల భోజన వసతులు ఏర్పాటు చేశారు. సర్వత్రా విమర్శలు మిన్నుముట్టాయి.
ఈ మహా ప్రయాణం గురించి తెలుసుకుంటే మన వ్యవస్థలోని డొల్లతనంతోపాటు మన మానవత్వంలోని పెద్ద మచ్చలు కూడా కనబడతాయి. ఇది నిజానికి శతాబ్దపు విషాదం, మహా విషాదం!
—
2020, మే 25వ తేదీన జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని డిరెక్ చావిన్ అనే తెల్లజాతి పోలీసు అధికారి భయంకరంగా చంపాడు. దాదాపు 9 నిమిషాలు పెనుగులాడిన తర్వాత జార్జి ఫ్లాయిడ్ భయంకరమైన వ్యథతో కనుమూశాడు. ఈ అధమాతి అధమమైన వధ అతి నాగరికతగా పరిఢవిల్లే అమెరికాలో సంభవించింది. అక్కడి నల్లజాతీయులంతా ప్రళయకాల రుద్రులుగా మారారు. భయంకరమైన హింసతాండవమాడింది. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు అండర్ గ్రౌండుకు వెళ్ళాల్సి వచ్చింది. దీనిని మనం మీడియా, సోషల్ మీడియా ద్వారా వివరంగా చూసి సిగ్గుపడ్డాం, ఖేద పడ్డాం. ఇప్పటికీ అమెరికా జైళ్ళలో మగ్గేవారిలో ఎక్కుమంది నల్లజాతివారేనని లెక్కలు చెబుతున్నాయి. అక్కడి జనాభాలో ఆఫ్రికన్లు 12 శాతం దాకా ఉంటే, జైలు ఖైదీలలో 38 శాతం వారే. ఈ హింస, ప్రతిహింస అనేది అమెరికా సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న వివక్ష తీవ్రత ఏమిటో, ఎంతో చెబుతున్నాయి!
—
ఒక్క క్షణం ఆలోచించండి! మన దేశంలో వందలమైళ్ళు నీళ్ళు, అన్నం లేకుండా నడచిన వారు అలాగే సాగిపోయారు. కానీ ఎటువంటి హింసకు దిగిన దాఖలాలు లేవు. హింస ఏమైనా ఉంటే లాక్ డౌన్ నియమాలు ఇవి అని వారే కట్టడికి గురవడం. అంతేకానీ ఎక్కడా తిరగబడిన సంఘటనలు తెలియరాలేదు. ఒకవేళ వీరు తిరగబడి ఉంటే మన వ్యవస్థలు నియంత్రించి ఉండేవా? ఎంత నష్టానికి దారి తీసి ఉండేది? ఇంతవరకు వీరి సేవలు పొందుతూ వారినే ఎలా విస్మరించామో, ఇపుడు వారి సత్ప్రవర్తనను మనం గమనించలేకపోయాం!
వారికి తెలుసు వారి సేవలు పొందిన వారంతా తగిన మూల్యం చెల్లించలేరని! అంతే కాదు, అలా సేవలు పొందేవారు ఏమి తింటున్నారో, ఎలా వుంటున్నారో వీరికి బాగా తెలుసు. కోపం, ఈర్ష్య, అసూయ లేవు కనుకనే వారు హింసకు దిగలేదు. మన అల్పత్వాన్ని క్షమించే ఔదార్యం వారిసొత్తు. అది ఈ దేశపు సౌశీల్యంలోనే వుందేమో! వీరి కాలి పగుళ్ళలోనే కాదు గుండెలోతుల్లో కూడా క్షమాగుణం ఉంది!!
—
ఇటీవల ‘అమెరికా అమ్మాయి’ సిన్మా చూశాను. (హైస్కూలు కాలం నుంచి చూడని సినిమాలు, నచ్చిన సినిమాలు యూట్యూబ్ లో చూస్తున్నాను. అలా చూశా ‘అమెరికా అమ్మాయి’.) హీరో శ్రీధర్ అమెరికన్ భార్యతో భారతదేశం వస్తారు. ఇంటిని భార్య భారతీయ పద్ధతిలో అలంకరిస్తుంది. ఇంటి మెయిన్ డోర్ లోంచి ప్రవేశించగానే కుడివైపు గోడకు గాంధీ ఫోటో పెద్దది కనబడుతుంది. ప్రేక్షకులందరూ గమనించకపోవచ్చు కానీ, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చిన్న ప్రయత్నం ద్వారా భారతీయతకు విపులమైన అర్థాన్ని ఒక చిత్రం ద్వారా తెలియచెప్పారు. గాంధీ మన సమాజానికి చిహ్నం. ఈ సమాజానికి క్షమాగుణం, ఔదార్యం, కష్టపడే తత్వం గాంధీయే చెప్పినట్టు హిమాలయాలంతటి పురాతనమైనవి!
కాలిబాట పట్టిన కార్మికుల సౌశీల్యాన్ని గాంధీకి లంకెపెట్టడం ఏమిటని ఎవరికైనా సందేహాలు రావచ్చు. వీరికి గాంధీ చెప్పారని కానీ, వీరు గాంధీని చదివారని కానీ భావం కాదు. శ్రమశక్తిని నమ్ముకుని శాంతియుతంగా జీవనం సాగించడం ఈ దేశపు సౌశీల్యంగా పేదవారిలో ఉంది. హింస వారి మార్గం కాదు. ఈ లక్షణాలను గుర్తించి పూర్తిగా ఆ దారిలో సాగిన మహనీయుడు గాంధీ.
అందుకే ఆ విధానాన్ని గాంధీమార్గం అంటున్నాం!
ఇప్పుడు గాంధీయే మార్గం!
(చర్చించిన మిత్రుడు జి. మాల్యాద్రికి కృతజ్ఞతలతో…)
డా. నాగసూరి వేణుగోపాల్ , హైదరాబాద్
9440732392
excellent Venugopal garu
It is national tragedy due to ignorence and negligence of Governament and ruling party leaders the people bared the troubles