కాలం నివురు క్రింద భగభగ మండుతున్న జ్ఞాపకాలు.
ఒక్క శిథిల క్షణం నుంచి
ప్రాణం పోసుకున్న ఒక మృత స్మృతి
క్రూర ప్రభంజనమై వీస్తుంది.
రేగిపోయిన భస్మ రేణువుల
వెనుక నుండి రెండు అగ్ని భాష్పాలు…
అదేమో గతించిన వసంత కుసుమాల
సుగంధం గుర్తుకు రాదు,
వేధించిన వేసవి గాడ్పుల
పునః పునః ప్రహారాలు తప్ప!
ఏవి ప్రేమ లేఖలు మోసిన అప్పటి మేఘ దూతికలు
చుట్టూ వికృత నాట్యం చేస్తున్న
విగత శరదృతు పత్రాలు కాక!
దయలేనిది కాల సముద్రం…
ఇచ్చినదెప్పుడు దాచుకున్న రత్న రాసులు…
దారుణ బడబాగ్ని కీలలు,
దుర్భర క్షార నీర రుచులు తప్ప.