Thursday, November 21, 2024

రాజ్యాంగం నుంచి ఉపా చట్టాన్ని తొలగించడం మేలు

దేశద్రోహం ఆరోపణలలో పసలేదని చెప్పడానికి లక్షద్వీపాలకు చెందిన  చలనచిత్ర నిర్మాత సుల్తానా కేసును పరిశీలిస్తే అర్థం అవుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించినవారిపై ఏ ఆధారాలూ లేకుండా దేశద్రోహ చట్టం కింద కేసులు బనాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఉపా చట్టంలోని 124 ఏ సెక్షన్ కింద కానీ, 153 బి కింద కానీ ఆమె నేరం చేశారని నిరూపించే అవకాశాలే లేవని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసు పెట్టినట్టు కనిపిస్తున్న కారణంగానే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కేరళ హైకోర్టు నిర్ణయించింది.

Also read: మేటి కథకుడైన కథానాయకుడు పీవీ

లక్ష్మదీప్ లో నివాసం ఉంటున్న సినీ నిర్మాత అయిషా సుల్తానాపైన దేశద్రోహం కేసు పెట్టడం ద్వారా ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేసిన తాజా ప్రభుత్వ సంస్థగా లక్ష్మద్వీప్ పేరు తెచ్చుకున్నది. ప్రజలతో నిమిత్తం లేకుండా, ప్రజలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న అడ్మినిస్ట్రేటర్ (కార్యనిర్వహణాధికారి)ని కేంద్ర ప్రభుత్వం లక్ష్మద్వీప్ పైన ప్రయోగించిన ‘జీవాయుధం’గా అయిషా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ లక్ష్మద్వీప్ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ దేశద్రోహం కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు అయిషాకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పరిపాలకుడి వివాదాస్పదమైన నిర్ణయాల అమలుపైన కూడా హైకోర్టు స్టే విధించింది. లక్ష్మద్వీప్ కేరళ హైకోర్టు పరిధిలోకి రాకుండా కర్ణాటక పరిధిలోకి తీసుకురావలనే ప్రయత్నం కూడా జరుగుతోంది.

Also read: తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్

తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తన ఫేస్ బుక్ లో అయిషా ఈ విధంగా రాసుకున్నారు: ‘‘పటేల్, ఆయన విధానాల కారనంగా లక్షద్వీప్ లో కరోనా ప్రబలింది. అందుకే ఆయనను జీవాయుధంగా ఒక టీవీ చర్చలో నేను అభివర్ణించాను. నేను జీవాయుధంగా అభివర్ణించింది పటేల్ అనే అధికారిని మాత్రమే.లక్షద్వీప్ ని కానీ దేశాన్ని కానీ ఆ విధంగా అభివర్ణించలేదు.’’

Also read: ఇది ‘రమణ ఎఫెక్ట్’, రిబీరో వ్యాఖ్య

లక్షద్వీప్ లోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా, అనుసరిస్తున్న విధానాలపైనా టీవీలో వేడివేడిగా జరిగిన చర్చలో పాల్గొన్న చిత్రనిర్మాత కోవిద్ నిబంధనలను సడలించిన ప్రభుత్వం జీవాస్త్రాన్ని ప్రజలపైన సంధించిందంటూ వ్యాఖ్యానించడం వల్ల ప్రభుత్వంలో ఉన్నవారికి కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చు.  ప్రభుత్వంపట్ల కానీ, అధికారులపట్ల కానీ ఆమెకు ద్వేషం ఈషణ్మాత్రమైనా లేదని అందరికీ తెలుసు- బీజేపీ నాయకులకీ, ఫిర్యాదు చేసిన ప్రభుత్వ అధికారులకీ తప్ప. ఆమెను అరెస్టు చేసే ప్రయత్నం పోలీసులు చేయలేదు. తన వ్యాఖ్యాలను వివరించాలని కోరుతూ నోటీసు ఇచ్చారు. అంతవరకూ నయమే.

Also read: ఉద్యమస్ఫూర్తికి ఊరట

ప్రభుత్వ నిర్ణయాలనూ, కార్యక్రమాలనూ, చర్యలనూ విమర్శించినంత మాత్రాన దేశద్రోహం చర్యలు పెట్టకూడదంటూ సుప్రీంకోర్డు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సహా అనేకమంది న్యాయమూర్తులు పదేపదే స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వాలూ, ప్రభుత్వాధికారులూ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి వెనకాడటం లేదు. అనవసరంగా ఈ చట్టాన్ని ప్రయోగించి కేసులు పెడుతున్నవారిపైన శిక్షాత్మకమైన చర్యలు న్యాయస్థానాలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తున్నది.

Also read: ఈటల రాజేందర్ అడుగుల ఆంతర్యం ఏమిటి?

లక్షద్వీప్ పరిపాలకుడు ప్రఫుల్ ఖోడా పటేల్ గత డిసెంబర్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ రకరకాల విధానాలను ప్రకటిస్తూ వచ్చారు. ఎవరిని సంప్రదించి విధానాలు రూపొందిస్తున్నారో తెలియదు. ఎవరికోసమో అర్థం కాదు. లక్షద్వీప్ కు ఒక వారసత్వం, చరిత్ర, భూమిక ఉన్నాయి. మాంసాహారం విద్యార్థులకు పెట్టరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. పశువుల పంపకాన్నీ, పాలఉత్పత్తినీ నీరుగార్చడానికి చర్యలు తీసుకున్నారు. వాటిని విస్మరించి దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చివేయాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనేది అందరి అభిప్రాయం. పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్వారెంటేన్ ను రద్దు చేసి కోవిద్ విస్తరణకు కారకుడైనారు. ఇటువంటి చర్యలను విమర్శిస్తూ చాలామంది వ్యాఖ్యలు చేశారు. వారిలో సుల్తానా ఒకరు.

Also read: జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

పటేల్ నిర్ణయాలపైన స్థానికుల ఆగ్రహం ప్రదర్శించారు. ప్రదర్శనలు చేశారు. ఈ పోరాటంలో అయిషా సుల్తానా అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె నటి, దర్శకురాలు. మలయాళం సినిమా ‘కెట్టియోలాను ఎంతే మలాఖా’ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ఒక మలయాళం సినిమా ‘ఫ్లష్’ కు 2020లో దర్శకత్వం నెరపారు. ఆమె మోడల్ గా కూడా పని చేశారు.

Also read: తెలంగాణలో అధ్యయనం అవసరం

ఇటువంటి నేపథ్యం కలిగిన వ్యక్తులు టీవీ చర్చలో భాగంగా చేసిన వ్యాఖ్యాలను పురస్కరించుకొని దేశద్రోహం నేరాన్ని మోపుతూ కేసులు పట్టడం, వాటిని న్యాయస్థానాలు పరిశీలించడం సమయం వృథా చేసే కార్యక్రమాలు. అసలు ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టాన్ని రాజ్యాంగం నుంచి పూర్తిగా తొలగించాలి లేదా ఆ చట్టాన్ని అడ్డగోలుగా వినియోగించరాదంటూ గట్టి హెచ్చరిక చేయాలి. రాజ్యాంగం నుంచి తొలగించడం అత్యుత్తమం.

Also read: పెరుగుట విరుగుటకొరకే

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles