Saturday, November 23, 2024

తీర్పును ఉల్లంఘిస్తే జైలుకే: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్జీటీ హెచ్చరిక

  • ఈ విధానం తెలంగాణ ప్రభుత్వానికి సైతం వర్తిస్తుందని స్పష్టీకరణ
  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపైన ధర్మాసనం వ్యాఖ్యలు

దిల్లీ: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేసినట్టు రుజువు అవుతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్ళవలసి ఉంటుందని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) హెచ్చరించింది.  పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టుపైన ముందడుగు వేయవద్దంటూ గతంలో ట్రిబ్యూనల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర్పును బేఖాతరు చేస్తూ ఎత్తిపోతల పథకంపైన పనులు కొనసాగిస్తున్నారంటూ నారాయణపెట జిల్లాకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పైన ఎన్జీటీ న్యాయసభ్యుడు జస్టిస్ కె. రామకృష్ణ, నిపుణుడు సత్యగోపాలతో కూడిన ధర్మాసనం ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది మాధురిరెడ్డి వాదించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు జరగడం లేదని ఆమె చెప్పారు. రెండు వారాల సమయం ఇచ్చినట్లయితే వివరాలు ఇవ్వగలమంటూ న్యాయవాది చెప్పారు. ‘‘రెండు వారాల గడువు ఇస్తే ఏం చేస్తారు? పనులు జరగడం లేదని చెబుతారు, అంతేగా?’’ అంటూ ధర్మాసనం ఆగ్రహం ప్రదర్శించింది. పనులు జరగకపోతే ఇన్ని సార్లు కోర్టు ధిక్కరణ నేరం కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తారంటూ ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టబద్ధంగా నడుచుకోవడం లేదనీ, రూల్ ఆఫ్ లా అనుసరించడం లేదనీ తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు వాదించారు. జరుగుతున్న పనులకు సంబంధించి ఫొటోలను ధర్మాసనానికి రామచంద్రరావు చూపించారు. ఇందుకు ప్రతిగా తెలంగాణ ప్రభుత్వమే అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నదనీ, తాము కూడా కేసులు వేయగలమనీ మాధురీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర అంశాల జోలికి వెళ్ళవలదనీ, ఈ కేసుకు సంబంధించే వాదనలు వినిపించాలని ఎన్జీటీ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ న్యాయవాదికి సూచించింది. కె.శ్రవణ్ కుమార్ పిటిషనర్ తరఫున వాదిస్తూ ట్రిబ్యూనల్ తీర్పు అమలు కావడం లేదని చెప్పారు. కృష్ణానదీ యాజమాన్య మండలి అధికారులను ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదనీ, మండలికి ఏపీ ప్రభుత్వం సహకరించలేదనీ శ్రవణ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని ఎన్జీటీ తీర్పు ఇచ్చిన మీదట కూడా పర్యావరణ అనుమతుల అక్కరలేదని వాదిస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖలు రాస్తోందని ఆయన తెలిపారు. ఈ విధంగా కేంద్ర పర్యవరణ మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసిందో లేదో తెలుసుకుంటే వాస్తవం వెల్లడి అవుతుందని, తర్వాత చర్య తీసుకోవచ్చునని న్యాయవాది అన్నారు. తమ తీర్పులను ఉల్లంఘించినట్లయితే తీవ్రంగా పరిగణిస్తామనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఎన్జీటీ తీర్పును ఉల్లంఘించినట్టు రుజువైతే ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి జైలుకు వెళ్ళవలసి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ హెచ్చరిక తెలంగాణ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని చెప్పింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు తాజా పరిస్థితిపైన నివేదిక సమర్పించాలని కృష్ణానది యాజమాన్య మండలినీ, కేంద్ర పర్యావరణశాఖ ప్రాంతీయ కార్యాలయాన్నీ ఎన్టీటీ ధర్మాసనం ఆదేశించింది. విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles