ఆయన జీవితం త్యాగమయం. కుటుంబం కోసం వ్యక్తిగత జీవితం తనది కాదనుకున్నారు. తన ప్రజలకోసం, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం తపించి కల నిజం కావడానికి మూడేళ్ళ ముందుగానే కేన్సర్ ఆయనను కబళించింది. తెలంగాణ కోసం కలం పట్టారు. గళం విప్పారు. పోరాటం చేశారు. ఉద్యమాన్ని నిర్మించారు. ఆయనే కొత్తపల్లి జయశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ సర్ వర్థంతి జూన్ 21. తెలంగాణ ప్రజలు ముకుళిత హస్తాలతో సార్ కు నివాళి అర్పించాలి. ఆయనంటూ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఆయన సమాలోచన, సలహా, దిశానిర్దేశం లేకపోతే తెలంగాణ మలి ఉద్యమానికి ఊపు వచ్చేది కాదు. తెలంగాణ తెచ్చేది కాదు.
తెలంగాణ జాతి పితగా అభివర్ణించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తన డెబ్బయ్ ఏడేళ్ళ జీవితంలో అరవై సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్న సాకారం కోసం అంకితం చేశారు. బాల్యం నుంచే ఆయనలో తెలంగాణవాదం బలంగా ఉండేది. 1952లో ముల్కీ నిబంధనలను వ్యతరేకించారు. 1954లో విద్యార్థి నేతగా ఫజల్ అలీ కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. 1969లో తోటి మేధావులతో కలసి ఉద్యమ నిర్మాణంలో చురుకైనపాత్ర పోషించారు. నాటి ఉపకులపతి రావాడ సత్యనారాయణరావు చెప్పనట్టు విన్నారు. వరంగల్లులో 6 ఆగస్టు 1934న కొత్తపల్లి మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో పుట్టిన జయశంకర్ వరంగల్లులో చదివి, ఆ పైన బెనారస్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డి చేశారు. వరంగల్లులోనే సీకేఎం కాలేజీకి 1975 నుంచి 1979 వరకూ ప్రిన్సిపాల్ గా పని చేశారు.1979 నుంచి 81 వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గానూ పని చేశారు.1982 నుంచి 91 వరకూ వైస్ చాన్సలర్ గానూ పని చేశారు.
తెలంగాణలో వెనుకబాటుదనం, పేదరికం, విద్యావ్యవస్థ పని చేస్తున్న తీరు, ఉద్యోగాలు ప్రాంతీయేతరులకు ఇవ్వడం వంటి అంశాలపైన ఆయన నిరంతరం అధ్యయనం చేశారు. నీటి వసతి లేని కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తీర్మానించారు. జయశంకర్ సహచరుడు ప్రొఫెసర్ బి. జనార్దనరావు నీళ్ళు, నిధులు, నియామకాలు మనవి మనకు ఉండాలనే నినాదానికి రూపకల్పన చేశారు. దాన్ని సిద్ధాంతీకరించారు జయశంకర్.
గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలలో లోపాలను అధ్యయనం చేసి అటువంటి లోపాలు మలి ఉద్యమంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఎంతమంది వారిస్తున్నా వినకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ పార్టీ అధినాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)నీ పూర్తిగా బలపరిచారు. రాజకీయ పార్టీ సహకారం లేకపోతే తెలంగాణ స్వప్న సాకారం కాదని ఆయన బలంగా విశ్వసించారు. అందుకే కేసీఆర్ అంటే అభ్యంతరాలు ఉన్నవారు ఎంతమంది చెప్పినా వినకుండా ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ కి అండగానే నిలిచారు.
తెలంగాణకోసం పోరాడే సంస్థలు చాలా ఉన్నాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక వాటిలో ఒకటి. ఈ వేదికను నిర్మించి కొనసాగించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సారే. ఆ తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ఆ వేదికకు అధ్యక్షులైనారు. 2009 నవంబర్ చివరలో కేసీఆర్ నిరాహారదీక్ష చేసినప్పుడు ఆయన వెనకుండి కథ నడిపింది జయశంకర్ గారే. నిరాహారదీక్ష ఆరంభించిన తర్వాత పన్నెండు రోజులకు డిసెంబర్ 9 అర్దరాత్రి నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేయడానికి కొద్దిసేపటి కిందట నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రొఫెసర్ జయశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ ఏ మాటలు ఉండాలని చెప్పారో ఆ మాటలతోనే చిదంబరం ప్రకటన వెలువడింది. 2009 డిసెంబర్ 10న ఆంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ రాజీనామా చేయడం, కేంద్రం వెనకంజ వేయడం ప్రొఫెసర్ జయశంకర్ కు ఆశాభంగం కలిగించింది. అయినా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కలసి సంయుక్తంగా పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. డిసెంబర్ లోనే తెలంగాణ జాయంట్ యాక్షన్ కమిటీని ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు.మల్లేపల్లి లక్ష్మయ్యను సహాధ్యక్షుడుగా నియమించారు. ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలంలోనే కేన్సర్ వ్యాధి ముదిరి ప్రొఫెసర్ జయశంకర్ 21 జూన్ 2011నాడు ఈ లోకం వీడి వెళ్ళిపోయారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలుగులో రాసిన మొదటి వ్యాసాన్ని నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు ‘వార్త’ పత్రికలో ప్రచురించాను. ప్రొఫెసర్ కోదండరామ్, విద్యాసాగర్ రావు వంటి మేధావుల చేత వ్యాసాలు రాయించి ప్రచురించాం. మల్లేపల్లి లక్ష్మయ్య సంపాదకత్వంలో తెలంగాణ సమస్యపైన నలభై వ్యాసాలు రాయించి వరుసగా ప్రచురించాం. వాటిని సంకలనం చేసి తర్వాత పుస్తకంగా ప్రచురించాం. ఫ్రొఫెసర్ జయశంకర్ నాబోటి జర్నలిస్టులను చాలా ప్రేమించేవారు. మనసు విప్పి మాట్లాడేవారు. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ దశ-దిశ’ కార్యక్రమంలో ప్రారంభ సభ చిదంబరం ప్రకటన చేసిన తర్వాత పది రోజులకు 20 డిసెంబర్ 2009న జూబిలీ హాల్లో జరిగింది. ఆ సభను కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి ప్రారంభిస్తే ఎనిమిది గంటల తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గంభీరోపన్యాసంతో ముగిసింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు టీవీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ కూడా హెచ్ఎంటీవీకే ఇచ్చారు. నేనూ, లక్ష్మయ్య ఇంటర్వ్యూ చేశాం.
తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజాసంఘాలు కలసి కట్టుగా సమష్టిగా పోరాడాలని ఆయన కోరుకునేవారు. అది సాధ్యం కాకపోతే, సమష్టిగా పోరాడడం కుదరకపోతే పోరాడుతున్న అన్ని సంస్థల మధ్య సహకారం ఉండాలని కోరుకునేవారు. అది కూడా సాధ్యం కాకపోతే అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండాలనేవారు. అది కూడా వీలు పడకపోతే సంఘర్షణ లేకుండా సమాంతరంగా ఉద్యమం సాగించాలని కోరేవారు. అందుకే ఎన్ని విభేదాలు వచ్చినా, అవమానం జరిగినట్టు అనిపించినా, తనను సంప్రదించలేదని కొన్ని సందర్భాలలో అనుకున్నా జయశంకర్ కేసీఆర్ ను వదిలి వెళ్ళలేదు. అదే ఆయన దృఢసంకల్పానికీ, కార్యదీక్షకూ, ఆచరణశీలానికీ నిదర్శనం. ఆయన బోధించిన సమష్టితత్వమే, సమన్వయ భావనే, సహకార స్వభావమే తుది వరకూ పోరాడి తెలంగాణ సాధించడానికి దోహదం చేశాయి.
(జూన్ 21 ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి)