అతను ఆమెను చేతులలోకి తీసుకొని
గుండెకు హత్తుకున్నాడు.
వేళ్ళతో సుతారంగా
ఆమె తలపై నిమిరాడు.
అతనివైపు ఆమె ఆరాధన గా చూసి
అతని చేతులలో కి మరింత గా ఒదిగి పోయి
తన ముక్కుతో ప్రేమగా రుద్దింది.
బహుశా ఆమె పద్దతిలో ముద్దు కాబోలు.
“నేను ఎంత అదృష్టవంతురాలను!”
ఆమె అనుకొంది.
“ఇతని మనసు నిజంగానే వెన్న…
అతని స్పర్శ లో ఎంత అనురాగం,
ఎంత దయ. నన్ను ఎంత భద్రం గా పట్టుకొన్నాడు?
ఎందుకో అంత అక్కర?”
“తలచుకుంటే నే మనసు పులకరిస్తుంది.
ఒక ఉన్నత జాతి మనిషికి
నాలాంటి ఒక అల్ప జీవి, ఒక కోడి కి
మధ్యన స్నేహమా? ప్రేమా?”
ఇంకా ఒదిగిపోతూ ఈ సారి తన
కుచ్చుల తలతో అతని చేతిని మెత్తగా రుద్దింది.
అతను ఆమెను అలాగే
గట్టిగా పట్టుకొని
మెల్లగా
వంటింట్లోకి అడుగు పెట్టాడు.
Also read: బొమ్మలు
Also read: పుష్ప వేదన
Also read: తపస్సు
Also read: యుగసంధి
Also read: విజేతలు