అప్పట్లో బొమ్మలతో ఆడుకొనే వాణ్ణి…
ఎన్ని బొమ్మలో, ఎన్ని రూపాలో.
ఒక్కసారి ఆట నియమాలు తెలిసాక…
నాకు ఆ రూపాల అవసరం రాలేదు…
ఆనందం మాత్రం అదే !
అయినా, నేను కృతఘ్నుడను కాను…
ఆ రూపాలు చేసిన సహాయం మరువలేదు.
భ్రమను రుచి చూపి, ఆ భ్రమను తొలగించింది అవే!
అజ్ఞాన కుహరం నుంచి జ్ఞాన శిఖరంపైకి చేర్చినవి అవే…
జడత్వం నుంచి చైతన్యానికి,
మానవత్వం నుండి మహనీయతవైపుకు నడిపింది
కేవల పరిచయం నుంచి పరిపూర్ణ సారూప్యత వరకు
చేర్చింది ఆ మాటలాడని బొమ్మలే,
ఆ మౌన పాఠాల గురువర్గమే.
విస్తరించిన దృష్టి ముందు వ్యక్తమైన
విరాట్ విశ్వంలోనూ ఆ చిన్న చిన్న బొమ్మలే, ముచ్చటగా అవేరూపాలు,
అవే అందమైన చిరునగవులు, ఎన్నో, ఎన్నెన్నో…
లోతు తెలియని ఆ కాంతి కుహరం నుండి…
జ్వాలా రూపాలై, జ్ఞాన దీపాలై,
ద్వైత, అద్వైత స్థితుల
సంగమ స్దాన స్థితులైన దివ్య పురుషులై, జగన్మాతలై..
నాముందు వికసిత నయనాలతో, అభయ హస్తాలతో,
మందస్మిత ఆహ్వానాలతో… వారే… వారే…
ఇది నిర్భర ధ్వనిలో నిక్షిప్తమైన నిశ్శబ్ద నాదం
వైపు నిర్ణయాత్మక పయనం…
తెగుతూ, తిరిగి ముడివడుతున్న లౌకిక
బంధాల చక్రభ్రమణం లో
అంత సుగమం కాని ప్రయత్నం…
క్షణిక మాత్ర నిశ్చల ముద్ర … నశ్వరమైన ఆనందానుభూతి .
ద్విదాభూత లౌకిక పారమార్థిక ప్రకంపనల
మధ్యన నలిగే చంచల స్థితి …
సాధన, అలసత్వాల నడుమ పోరాటం,
క్రియ, నిష్క్రియల మధ్యన సంఘర్షణ
…గమ్యం చేరే వరకు తప్పని అవస్థ…
అందుకే అప్పుడప్పుడు తిరిగి ఆ బొమ్మలవైపే చూస్తాను…
ఆశ నిరాశల ప్రశ్నలు సంధిస్తూ…
అవి నన్ను చూసి నవ్వుతాయి…
“ఇంకెంతో దూరం లేదులే” అన్నట్లు
ఒక నిగూఢ సంజ్ఞ తళుక్కుమని మెరుస్తుంది.
Also read: పుష్ప వేదన
Also read: తపస్సు
Also read: యుగసంధి
Also read: విజేతలు
Also read: పూలవాడు