వృత్తి జీవితాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అందనంత ఎత్తుకు ఎగిసిన ‘అనంత’ప్రతిభుడు సత్య నాదెళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు చెందిన ఆ కుటుంబం కేవలం ప్రతిభను, ప్రవర్తనను నమ్ముకొని ఆదర్శంగా నిలిచింది. ఆ కుటుంబ సభ్యుడైన సత్య నాదెళ్ల జీవితాన్ని గమనిస్తే, సమర్ధుని జీవయాత్ర ఇంత ఉత్తమంగా, అంత ఉన్నంతంగా ఉంటుందని అర్ధమవుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాదు, యావత్ భారతదేశానికే అఖండమైన ఖ్యాతిని అందించిన సత్య పేరు నేడు ప్రపంచమంతా మార్మోగుతోంది. మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వస్తే చాలని ఎందరో యువతీయువకులు కలలు కంటారు.
Also read: దేశమంతటా రాజకీయాలాట!
ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అంతటి ఆకర్షణ కలిగిన కంపెనీకి సీ ఈ ఓ కావడమే అత్యాశ్చర్యకరమైన అంశమైతే ఆ సంస్థకు చైర్మన్ అవ్వడం అమితాశ్చర్యమైన విషయం. అంతటి ప్రగతిని, ఖ్యాతిని సాధించిన తొలి భారతీయుడు మన తెలుగువాడు కూడా కావడం మనందరికీ మహదానందకరం. దిగ్గజ మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా, చైర్మన్ గా సత్య నాదెళ్లకు అవకాశాలు రావడానికి కేవలం విజయాలే కారణం కాదు. వివేకవంతంగా సాగే వినూత్మమైన, విప్లవాత్మాకమైన సత్య నాదెళ్ల వ్యవహార విధానం. అందరు సొంతమనుషులు, స్వదేశీయులు ఉండగా ఈ విదేశీ ఉద్యోగిని ఆ సంస్థ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎంచుకోవడమే విశేషం. ఆ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సత్య పూర్తిపేరు నాదెళ్ల సత్యనారాయణ. తండ్రి యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయనకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో, అటు కేంద్ర ప్రభుత్వంలో చాలామంచి అధికారిగా పేరుంది. వారిది వ్యవసాయ కుటుంబం. అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలం బుక్కాపురం వీరి స్వగ్రామం. సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన తర్వాత కుటుంబం హైదరాబాద్ కు మారింది. సత్య నాదెళ్ల 1967 ఆగష్టు 19వ తేదీనాడు హైదరాబాద్ లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్య, మణిపాల్ ఇన్స్టిట్యూట్ లో బీఈ పూర్తి చేశారు. ఇంతవరకూ అతని విద్య ఇండియాలోనే సాగింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచే అతని ప్రస్థానం మరోమలుపు తీసుకుంది. అప్పటి వరకూ సగటు విద్యార్థిగా ఉన్న అతని విద్యా జీవిత గమనం మరింత శోభాయాత్రగా మారింది.
Also read: ఆచరణలో చూపించాలి ఆదర్శాలు
ఉన్నత విద్యార్హతలు
అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ తీసుకోవడంతో పాటు, చికాగో యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లోనూ మాస్టర్స్ చేశారు. వ్యూహాత్మకంగా, ఇటు కంప్యూటర్ సైన్స్ – అటు బిజినెస్ మేనేజ్ మెంట్ ను రెండింటినీ అధ్యయనం చేయడం వల్ల, పసిడికి తావి అబ్బినట్లు,విశేషమైన విద్యార్హతలు చేతిలోకి వచ్చాయి. మెదడు ద్విముఖంగా వికసించింది. పాఠ్యాంశాలే కాక, క్రికెట్ నుంచి కవిత్వం వరకూ నిత్యం అనేక పుస్తకాలను మధించే పఠనశీలత అతని మెదడును బహుముఖంగా శక్తివంతం చేసింది. క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్వయంగా ఆడడమే కాక, బృందానికి నాయకత్వం కూడా వహించేవారు. దీని వల్ల బుద్ధిబలానికి కండబలం జోడయ్యింది. నాయకత్వ లక్షణాలు సహజ ఆభరణాలుగా తోడయ్యాయి. ఈ అర్హతలు, లక్షణాలు ఉద్యోగ జీవితంలో ఒదగడానికి ఎదగడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఉద్యోగపర్వంలో అడుగుపెట్టిన తర్వాత, తన శక్తియుక్తులను మరింతగా పెంచుకున్నారు. మరిన్ని సద్గుణాలను, ఆలోచనలను పెంచుకున్నారు. తోటివారికి సహాయం చేసే లక్షణం, నిజాయితీ, దార్శనికత, అచంచలమైన ఆత్మవిశ్వాసం, అమితమైన మానవ సంబంధాలు, ప్రజాసంబంధాలు, శ్రద్ధగా వినే లక్షణం, సాదాసీదాగా జీవించే లక్షణం మొదలైన సులక్షణాలు వ్యక్తిగతంగానూ, బృంద నాయకుడుగానూ అద్భుతమైన ఫలితాలు, విజయాలను రాబట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆసక్తికరంగా సాగే నవలలంటే ఎంత ఇష్టమో, జీవితమంటేనూ అంతే ఇష్టం. అందుకే, అతని జీవితం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అతనితో గొప్ప పనులను చేయించింది.
Also read: పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు
ప్రగతికి దోహదం చేసిన ప్రవృత్తి
ఒక్కమాటలో చెప్పాలంటే, అతని ప్రవృత్తి వృత్తిప్రగతికి, జీవనప్రభకు దివ్యమైన దివిటీగా పనిచేసింది.సంప్రదాయమైన వ్యాపార విధానాలంటూ ఒక మూసలో వెళ్లకుండా, సృజనపౌరుషంతో నవ్యమార్గాలను నిర్మించడమే సత్య నాదెళ్ల విజయరహస్యం. చదువులు అయిపోయిన తర్వాత స్వల్పకాలంపాటు కొన్ని ఉద్యోగాలు చేశారు.1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన తర్వాత నుంచి నాదెళ్ల జీవితం అప్రతిహతంగా అజేయంగా దూసుకెళ్లడం ప్రారంభించింది. అతనంటే చిరుఉద్యోగులకు ఎంత ఇష్టమో, సంస్థ వ్యవస్థాపకులకూ అంతే ఇష్టం! మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఏ కుర్చీలో కూర్చున్నాడో, నేడు సత్య నాదెళ్ల ఆ సింహాసనాన్నే అధిరోహించాడు. రాజకీయాలు, భజనలు, కుట్రలు కుతంత్రాలు చేస్తే ఇటువంటి పదోన్నతులు రావు. ప్రతిభ, ప్రవర్తనతో నాదెళ్ల ఈ ప్రభకు చేరారన్నది సత్యం.ఈ సంస్థకు మొట్టమొదటి సీఈఓ బిల్ గేట్స్, రెండవ సీఈఓ స్టీవ్ బామర్, మూడవ సీఈఓ సత్య నాదెళ్ల. 2014లో సీఈఓగా పదోన్నతి వచ్చింది. ఈ ఏడేళ్ళల్లో సత్య సారథ్యంలో సంస్థ అద్భుతమైన విజయాలను, కీర్తిని సొంతం చేసుకుంది. నేడు మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరువయ్యింది. ఈ విజయప్రస్థానంలో నాదెళ్ల పాత్ర శిక్షర సదృశం. ప్రస్తుత చైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో సత్య నాదెళ్ల త్వరలో బాధ్యతలు చేపడతారు. 2014లో సీఈఓగా ఆయన పదవిలోకి వచ్చిన సమయంలో సంస్థ పరిస్థితులు అంత బాగాలేవు. సంస్థకు అత్యంత ప్రధానమైన ఉత్పత్తిగా ఉండే ” విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ” పెను సవాళ్ళను ఎదుర్కుంటోంది. మొబైల్స్ మార్కెట్ కూడా బాగా లేదు. ఆ తరుణంలో, ‘క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్’ పై ప్రధానమైన దృష్టిని కేంద్రీకరించారు. ‘కృత్రిమ మేధ’ను కొత్త పుంతలు తొక్కించారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఐఫోన్, యాండ్రాయిడ్ యాప్స్ ను తీసుకువచ్చారు. మొబైల్ అప్లికేషన్స్ పై ప్రత్యేక శ్రద్ధను పెట్టారు. విండోస్ 9 ను వదిలేసి, విండోస్ 10 ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్ సర్పేస్ బుక్ అనే ల్యాప్ టాప్ ను విడుదల చేశారు. ఈ ప్రయోగాల వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఈ ప్రభావంతో సంస్థ మార్కెట్ విలువ ఏడు రెట్లు పెరిగి, రెండు లక్షల కోట్ల డాలర్లకు సమీపించింది.
Also read: మోదీతో దీదీ ఢీ!
క్లౌడ్ కంప్యూటింగ్ తో జైత్రయాత్ర
క్లౌడ్ కంప్యూటింగ్ లో సంస్థను అగ్రగామిగా నిలబెట్టారు. వినూత్నమైన ఆవిష్కరణలతో సంస్థ ప్రగతి విశేషంగా పెరిగింది. ప్రపంచానికి పనికొచ్చే పని చేద్దాం… ఇదే సత్య నాదెళ్ల ఆచరించి, బోధించే విజయ మంత్రం. పుస్తకాలు చదవడమే కాక రచనలు చేసే అలవాటు కూడా అలవరుచుకున్నారు. మరో ఇద్దరు రచయితలతో కలిసి ” హిట్ రిఫ్రెష్ ” అనే పుస్తకం రాశారు. ఇది సత్య నాదెళ్ల ఆత్మకథ. తండ్రి యుగంధర్ అడుగుజాడల్లో నడిచి, ఆదర్శవంతమైన లక్షణాలను పెంచుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యుగంధర్ ఆయన దగ్గర పనిచేశారు.నవోదయ విద్యా వ్యవస్థల రూపకల్పనలో యుగంధర్ పాత్ర ఎంతగానో ఉంది. మామ కేఆర్ వేణుగోపాల్ కూడా ఐ ఏ ఎస్ అధికారి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో బియ్యం రెండు రూపాయల పథకం రూపశిల్పి. తండ్రి, మామ ఇద్దరికీ అధికారులుగా చాలా మంచిపేరు ఉంది. తెలివిని, శ్రమను, సృజనను, నిజాయితీని నమ్ముకున్న సత్యనాదెళ్ల నేడు విశేష విజేతగా నిలిచారు. వచ్చే సంవత్సరానికి ఆయన మైక్రోసాఫ్ట్ లో చేరి 30ఏళ్ళు పూర్తవుతుంది. ఒకే సంస్థను ఇన్నేళ్లు నమ్ముకున్నందుకు, ఇతని పట్ల కూడా సంస్థ అంతే విశ్వాసాన్ని పెంచుకున్నందుకు ఉభయతారకంగా గొప్ప ప్రగతిని సాధించారు. మన తెలుగుబిడ్డ సత్య నాదెళ్ల జీవితం ఎందరికో స్ఫూర్తివంతం. ఇంతటి అగ్రస్థానానికి చేరినందుకు మనఃపూర్వకంగా అభినందనలు అందిద్దాం. మన ప్రభుత్వాలు ‘ఐటీ రంగం’ అభివృద్ధిలో అతని సహాయ, సహకారాలను అందిపుచ్చుకొని, స్వయంశక్తిని పెంచుకోవాలి. ఐటీ రంగానికి మనకొక గొప్ప వారధి దొరికాడు.
Also read: చైనా వక్రదృష్టి