Sunday, November 24, 2024

ఉద్యమస్ఫూర్తికి ఊరట

  • ముగ్గురు విద్యార్థి నాయకులకూ బెయిల్ మంజూరు పట్ల ఆనందం
  • ‘ఉపా’ సెక్షన్ 43ను వినియోగాన్ని నిరోధించే మార్గం ఏమిటి?
  • జైలులో మగ్గుతున్న హక్కుల నాయకులకు మోక్షం ఎప్పుడు?
  • కోరేగాం నిందితులు బెయిల్కు యోగ్యులు కారా?

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిద్ధార్థ మృదుల్,  అనూప్ జైరామ్ భాంబానీలకు చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తున్నది. విచారణ లేకుండా సంవత్సరానికిపైగా జైలులో మగ్గుతున్న దేవాంగనాకలితా, నటాషానార్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా అనే  యువతులకూ, యువకుడికీ బెయిలు మంజూరు చేసినందుకు ప్రజాస్వామ్యప్రియులందరి తరఫునా ధన్యవాదాలు చెప్పాలనిపిస్తున్నది. 2020లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొనడమే నేరంగా భావించి వారు ముగ్గురినీ జైలులో బంధించారు. ఉద్యమానికీ, ఉగ్రవాదానికీ తేడా తెలుసుకోవాలని ప్రభుత్వానికీ, పోలీసులకీ హైకోర్టు న్యాయమూర్తులు స్పష్టంగా హితవు చెప్పారు.

Also read: జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్)యాక్ట్ (ఉపా) చట్టాన్ని యథేచ్ఛగా వినియోగిస్తూ రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యహక్కులకోసం ఉద్యమించేవారిని సైతం అణచివేయడానికి ఏ మాత్రం సంకోచించని ప్రభుత్వం తరఫున పోలీసులు హైకోర్టు ఉత్తర్వును అమలు చేయకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని వెంటనే విడుదల చేయడానికి దిగువ న్యాయస్థానం కఠినంగా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికీ వారి చిరునామాలను తనిఖీ చేయాలనే కుంటి సాకుతో విడుదలను వాయిదా వేయడానికి పోలీసు అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. చివరికి హైకోర్టు ఆదేశం అమలు జరిగింది. యువ నిందితులకు, ప్రజాస్వామ్య యోధులకూ తాత్కాలికంగా విముక్తి లభించింది.

న్యాయమూర్తులకో ప్రశ్న

న్యాయమూర్తులకు నమస్కారం చేస్తూనే ఒక ప్రశ్నకూడా అడగాలని ఉంది. ఉపా చట్టం కింద అరెస్టు చేసినవారి బెయిల్ పిటీషన్ పై నిర్ణయం ప్రకటించి, అది అమలు జరగడానికి సంవత్సరం పడితే అసలు కేసు విచారణ ఎన్నేళ్ళు పడుతుంది? ఉపా చట్టం కింద అరెస్టును ఆమోదించిన దిగువ న్యాయస్థానాల అధికారులకు మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా? ఉపా చట్టం ప్రయోగించడంలో అనుసరించవలసిన నియమనిబంధనలను రూపొందించవలసిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కొన్ని వారాల కిందట వ్యాఖ్యానించారు. ఆ పని చేపట్టడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉంటుందా? ఒక ప్రభుత్వ విధానాన్ని, ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయమంటూ రైతులు దాదాపు సంవత్సర కాలంగా దిల్లీలో ప్రదర్శనలు చేస్తున్నారు. వారితో ఫలప్రదమైన చర్చలు జరపడానికి బదులుగా వారిని కట్టడి చేయడానికీ, వారి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికీ, బదనాం చేయడానికీ కేంద్ర, హరియాణా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

Also read: తెలంగాణలో అధ్యయనం అవసరం

ఉపా చట్టాన్ని సవరించ వలసిన అవసరం ఉన్నది. ఆ పని పార్లమెంటు చేయాలి. అందుకు మెజారిటీ కావాలి. ఈ లోగా న్యాయస్థానాలు నిబంధనలను సరళతరం చేసి, ఎవరిని బడితే వారిని అన్యాయంగా అరెస్టు చేసి, విచారణ లేకుండా జైల్లో నిర్బంధించే దుర్మార్గపు విధానాన్ని అరికట్టాలి. దీనికి అత్యవసర ప్రాధాన్యం ఇవ్వాలి. ఇరవై మూడు సంవత్సరాలకు పైగా జైళ్ళలో మగ్గిన నిందితుడికి ఉగ్రవాదంతో సంబంధం లేదనీ, నిర్దోషి అనీ ప్రకటించిన కేసులు ఉన్నాయి. వారి జీవితంలో ఇరవై సంవత్సరాలు అన్యాయంగా జైలులో గడిపినందుకు వారికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? బెయిల్ రాకపోతే ఈ ముగ్గురు కూడా అదే విధంగా ఏళ్ళూపూళ్లూ కరాగారం ఊచలు లెక్కపెడుతూ ఉండేవారు.

నటాషా తండ్రి నార్వాల్ తో ఉన్నప్పటి చిత్రం. నటాషా జైలులో ఉన్నప్పుడే తండ్రి మరణించారు. ఆయన కమ్యూనిస్టు నాయకుడు.

ప్రభుత్వానికీ,అధికారానికీ భయపడి పోలీసులు చేసిన ఆరోపణలతో ఏకీభవించి నిర్దోషులను జైళ్ళలో మగ్గబెట్టే న్యాయాధికారులే అధికంగా ఉన్న కారణంగా ఉపా చట్టంకింద కేసులు ఎదుర్కొంటున్నవారికి బెయిల్ రావడం అసాధారణ సంఘటనగా పరిగణించవలసి వస్తున్నది. అసలు ఈ విద్యార్థి నాయకులను అరెస్టు చేయమే అక్రమం, జైలులో సంవత్సరంపాటు బంధించడం మరీ అన్యాయం, వారిని విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన తర్వాత సైతం వారిని ఎట్లాగైనా బందీలుగా ఉంచాలని పోలీసు అధికారులు వాదించడం, సాకులు చెప్పడం అరాజకం, అనాగరికం. పోలీసుల కథనాలకు తలలూపిన దిగువ న్యాయస్థానాల అధికారులపై చర్య తీసుకునే అవకాశం ఉన్నదా?

Also read: పెరుగుట విరుగుటకొరకే

జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్య

జస్టిస్ చంద్రచూడ్ సూచనపైన కార్యాచరణకోసం న్యాయవ్యవస్థ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. అసలు దుర్మార్గం అంతా ఉపా చట్టంలోని ‘సెక్షన్ 43 (డి)(5)’లో ఉంది. క్రిమినల్ జస్టిస్ లో అనుసరించవలసిన న్యాయసూత్రాలకూ, ప్రజాస్వామ్య మూల సూత్రాలకూ ఈ సెక్షన్ విరుద్ధమైనది. అతి భయంకరమైనది.  ఉగ్రవాద చర్యలకు పాల్బడినారంటూ  పోలీసుల ఆరోపణ ఉంటే సరిపోదు. చర్య ఉండాలి. ఉగ్రవాదాన్ని అమలు చేసే చర్యకు ఒడిగట్టినట్టు తిరుగులేని సాక్ష్యాధారాలు ఉంటేనే ఎవరిపైన అయినా ఉపా చట్టం ప్రయోగించవచ్చు. దిల్లీలో విద్యార్థులూ, యువజనులూ చేసిన నేరం ఏమిటి? ఉద్యమంలో పాల్గొనమని సహచరులకూ, మిత్రులకూ పిలుపునివ్వడం. చక్కాజామ్ (రోడ్డు దిగ్బంధనం) చేయడం. ఇవి ఉగ్రవాద చర్యలు ఎట్లా అవుతాయని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. పోలీసులు దాఖలు చేసిన సమాచారంలో ఎక్కడా నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్టు పరోక్షంగానైనా సూచించే ఆధారాలు సైతం లేవనీ, ఉపా చట్టం వీరికి వర్తించదనీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు

ఉపా చట్టంలోని ‘43(డి)(5)సెక్షన్’ ఎంత దుర్మార్గమైనదంటే నిందితులపైన పోలీసులు ఇష్టం వచ్చినట్టు నేరారోపణ చేయవచ్చు. నోటికొచ్చిన కట్టుకథ చెప్పవచ్చు. వారి కథనం  ప్రాతిపదికగానే న్యాయస్థానం నిర్ణయం ప్రకటించాలి. ఏకపక్ష కథనం మాత్రమే విని చెప్పే తీర్పు పాక్షికంగానే ఉంటుంది. ఎవరు కథనం చెబుతున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది. అంటే పోలీసులు ఎవరిని కేసులో ఇరికించి జైలులో తోయాలనుకుంటారో వారిపైన ఉపా చట్టం కింద కేసులు పెట్టవచ్చు. పోలీసులకు నిందితుల పట్ల వ్యతిరేకత లేకపోయినా అధికార పార్టీ ప్రముఖులకో. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కోపం ఉన్నవారిపైన కేసులు పెట్టించవచ్చు. నిజంగా ఉగ్రవాదానికో, దేశద్రోహానికో పాల్బడినవారిపైన కేసులు పెడితే ఎవరూ తప్పుపట్టరు. ఇంతవరకూ పెట్టిన కేసులలో అత్యధికం రాజకీయ దురుద్దేశంతో పెట్టినవే ఎక్కువ.

Also read: తెలుగువారి ఆత్మగౌరవ పతాక

నిర్దోషికి శిక్ష పడకూడదు  

న్యాయశాస్త్రం నీతి ప్రకారం న్యాయనిర్వహణలో ఒక దోషి తప్పించుకొని పోయినా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనేది ప్రదాన సూత్రం. ఇప్పుడు ఉపా కింద అరెస్టు చేస్తున్నవారిలో అత్యధికులు ప్రజాస్వామ్యవాదులే, నిరపరాధులే. విచారణ లేకుండా, దోషులని తేలకుండా సంవత్సరాల తరబడి జైలులో ఉండటం కంటే మించిన శిక్ష ఏముంటుంది? క్రిమినల్ లా ప్రకారం ఎవరైనా నేరం చేసినట్టు ప్రభుత్వం ఆరోపిస్తే  ఆ నేరాన్ని నిరూపించవలసిన బాద్యత కూడా ప్రాసిక్యూషన్ వారిదే. కోరేగాం కేసులో జైలులో హీనంగా బతుకులీడుస్తున్న పదహారు మందీ పౌరహక్కులకోసం జీవితాలను అంకితం చేసిన ప్రజాస్వామ్యవాదులు. ఉగ్రవాదులు కారు. కానీ వారికి బెయిలు లభించడం లేదు. విచారణ లేకుండానే నెలల తరబడి జైళ్ళలో ఉన్నారు. వారు ఎంత మొత్తుకున్నా బొంబాయి హైకోర్టు న్యాయమూర్తుల మనసు కరగడం లేదు. అంగవైకల్యంతో తొంభైశాతం చేతన కోల్పోయిన ప్రొఫెసర్ సాయిబాబా  సంవత్సరాల తరబడి బెయిలు రాకుండా జైల్లోనే ఉంటున్నారు.  విరసం సభ్యుడు, ఎనబై ఏళ్ళ పైబడిన వరవరరావుతో సహా పదహారు మంది హక్కుల నాయకులూ, న్యాయవాదులూ, సామాజిక కార్యకర్తలూ, క్రైస్తవ ప్రబోధకుడూ కోరేగాం కేసులో బందీలుగా ఉన్నారు. వీరు ప్రముఖులు కనుక వీరి గురించి కనీసం ప్రస్తావిస్తున్నాము. అంత ప్రాముఖ్యం సంపాదించనివారెందరో జైళ్ళలో జీవచ్ఛవాల వలె ఉంటున్నారు.

Also read: ఏమున్నది గర్వకారణం?

కొంతలో కొంత న్యాయం జరగాలంటే పోలీసులు నేరారోపణ చేసిన  వెంటనే న్యాయస్థానం విచారణ జరపాలి. దాంట్లో నిందితులు నేరం చేసినట్లు ప్రథమిక సాక్ష్యాలను ప్రవేశపెట్టాలి, సాక్షులను ప్రవేశపెట్టే అవకాశం నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలి. కనీసం ప్రాథమిక స్థాయి విచారణ జరిగి నిందితులు నేరం చేసే అవకాశం ఉన్నదని న్యాయమూర్తులు భావిస్తే వారిని జైలుకు పంపవచ్చు. కానీ నిర్దిష్టమైన గడువులోగా విచారణ పూర్తి కావాలి. అవసరమైతే ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి సత్వరన్యాయం కోసం ప్రయత్నించాలి. అంతేకానీ, అధికారపార్టీ ప్రముఖులూ, పోలీసు అధికారలూ ఎవరిపైన కావాలనుకుంటే వారిమీద కేసులు బనాయించి, జైళ్ళలో తోసి, విచారణ జరపకుండా ఏళ్ళకొద్దీ సమయం వెళ్లదీయడం అన్యాయం. మానవత్వం పట్ల క్షమార్హం కాని నేరం. ఇటువంటి చట్టం అమలు చేస్తున్న దేశం ప్రజాస్వామ్యదేశం అనిపించుకోజాలదు.

Also read: ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?

నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు?

బెయిలుపైన విడుదలైన యువతులకూ, యువకుడికీ జైలులో గడిపిన సంవత్సరకాలం ఎవరు తిరిగి ఇవ్వగలరు? వారికి నష్టపరిహారంగా ఏమి చేయగలరు? ‘మాకు జైలంటే భయం పోయింది. జైల్లో పెడతామంటూ మమ్మల్ని ఇంకా ఎవ్వరూ బెదిరించలేరు,’ అంటూ బెయిల్ పొందిన అమ్మాయి అన్నారంటే ఉక్కు చట్టాలు ప్రజాస్వామ్య యోధులను తయారు చేస్తాయని అనుకోవాలి. ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)లో నియంతృత్వ పోకడలకు అనుగుణంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం చట్టాలను సవరించింది. 1977లో ఎన్నికలలో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48వ రాజ్యాంగసవరణ బిల్లు ద్వారా చట్టాలకు ఎమర్జెన్సీ కాలంలో చేసిన సవరణలు రద్దుచేసి యధాస్థితికి తీసుకొని వచ్చారు. ఇప్పుడైనా, 2024 ఎన్నికల తర్వాతనైనా ఉపా చట్టాన్ని ఆ విధంగా  సవరించాలి. సెక్షన్ 43(డి)(5)ను తొలగించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనోద్యమానికీ, ఉగ్రవాదానికీ సరిహద్దు రేఖను స్పష్టంగా, కాస్త వెడల్పుగా, అనుల్లంఘనీయంగా మళ్ళీ గీయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, నిరసన ప్రకటించినా, శాంతియుతంగా ఉద్యమం చేసినా, పాదయాత్ర చేసినా ఉపా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెడతామని బెదిరించే అవకాశం ప్రభుత్వాలకు ఉండకూడదు. అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకోని ప్రభుత్వం ఉండదు. అవకాశం లేకుండా చట్టసభలు చేయగలవు. చట్టం దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థ చూడగలదు. అదే విధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని పాకిస్తాన్ ఏజెంట్లుగానో, దేశద్రోహులుగానో అభివర్ణించేవారిపైన చట్టప్రకారం చర్య తీసుకునే అవకాశం ఉండాలి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అన్నది ప్రజాస్వామ్య హక్కు. ప్రధానినీ, ముఖ్యమంత్రినీ విమర్శించడం అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. వాటిని కాపాడుకోవాలి. దేశవాసుల అదృష్టం కొద్దీ సుప్రీంకోర్టులో, దిల్లీ హైకోర్టులో, మద్రాసు, కలకత్తా  హైకోర్టుల వంటి ఉన్నత న్యాయస్థానాలలో ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను ధైర్యంగా ప్రశ్నించే, ప్రభుత్వాలను మందలించే న్యాయమూర్తులు ఉన్నారు. వారు కూడా మౌనప్రేక్షకులుగా మిగిలిపోతే దేశానికి అంతకంటే అరిష్టం మరొకటి ఉండదు.

Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles