టిష్యూ పేపర్‌తో తుడుచు కొని
బైట పారేసేవి కాదు.
కన్నీళ్లతో దోస్తీ చేసే దస్తీలు
ఉతకడానికి వేసేవి కాదు.
వాటి వారసత్వం
తరాలుగా తరలివస్తున్నదే.
కన్నీళ్లు
ఎక్కడి నుంచి కురుస్తాయో
చెప్పడం కష్టం!
ఆ ట్యాంకు ఎక్కడో కనిపెట్టడం
ఇప్పటికీ సాధ్యపడ లేదు.
ఆ ఊటకు మాతృక కోసమే
నా చిరకాల అన్వేషణ.
ఏ మేఘానికి
ఏ పవనం ఢీ కొంటుందో చెప్పలేం.
ఏ రాగానికి
ఏ భావం ఊ కొడుతుందో ఊహించలేం.
అనుకోని మూలాల్లోంచి
పాకుకుంటూ వచ్చే
జీవజల పరిమళాలకు
చర్మ నాసికలు చాలవు.
తుడిచి పారెయ్యడానికి
ఇవి గ్లిసరిన్ బిందువులు కాదు.
సింధువులకు
మినియేచర్ తుఫానులు.
ఆ కళ్లు
అందంగా వుండటనికి
అశ్రువులే కారణం.
భాష్పక్షాళిత నేత్రారణ్యాల్లో
విశదాకాశ వినిర్మల
ప్రతి ఫలనాలు వాటి పుణ్యమే.
తుడుచుకునే చేతుల నిండా
విషాద సుగంధం సరే.
అస్తిత్వం ప్రశ్నార్థక మైనప్పుడు
కురిసే జీవన వర్షానికి
గొడుగులు లభించవు.
ప్రవహించనీ
లోపలి కల్లోలమంతా శాంతించనీ,
బతుకు పాట కరిగి పోయి
ద్రవ తంత్రులుగా మారనీ.
మా పెట్టెల నిండా
స్వర్ణాభరణాలుండవు
గుడ్డల్లో మూటగట్టిన
కన్నీటి ముత్యాలు తప్ప.
దస్తీ
సుఖదుఃఖాలకు సజీవ సాక్ష్యం.
దాని వెచ్చని ఒడి
నిట్టూర్పుల ఓదార్పుల నిధి నిక్షిప్తం.
Also read: కవి సమయం
Also: ఆల్బం
Also read: అడుగులు
Also read: వంటిల్లు
Also read: శైలారోహణ– అమండా గోర్‌మన్