నిన్న పుట్టిన నారాయణ కొంగ
ఈ నేల ఉప్పు తిన్న జలరాచిల్క
ఈ చెట్టుగూట్లో పీల్చిన తొలి ఊపిరి
మరువగలుగుతుందా విదేశీ శబరి
ఫెలికాన్ కన్న రంగురంగుల కలలు
ఇక్కడి రాత్రిళ్ళు కొసరిన ఆశల కుసుమాలు
నేలపట్టు మట్టివాసన మరుపురాని మలయ సమీరం
ఎర్ర తీతువు విస్మరిస్తుందా ప్రణయ రాగలీలా విహారం భారతీయ పర్యావరణంలోనే నిండి పోయింది
కృతజ్ఞతా భావాల అమల తంతు వాయులీనం
నేల అఖండం నింగి అంఖండం
కాలప్రవాహం లాగే జలసంద్రం అఖండం
వీటిని పరదేశి పక్షులన్న వాడు ఎవడో
వలసత్వం వారసత్వం చేసినవాడెవడో
ఇక్కడి పల్లె నుండి వెళ్లి
అగ్రరాజ్యంలో పిల్లను కంటే
ఆకుపచ్చ పతకంతో పాటు
పౌరసత్వాన్ని దక్కించుకున్నట్లు
ఇక్కడ పెట్టిన గుడ్డు పరాయిదెట్లౌతుంది
ప్రళయకావేరీలో పెరిగిన పరిగె ప్రాసెలా మారుతుంది
ఈ నేల గుర్తుండి పోతుంది ప్రతి పక్షికి
అందుకేగా తరలి వస్తుంది యేటేటా జన్మభూమికి..!!
Also read: ఫ్లెమింగో-13
Also read: ఫ్లెమింగో-12
Also read: ఫ్లెమింగో-11
Also read: ఫ్లెమింగో-10
Also read: ఫ్లెమింగో-9