ఇంధ్రధనువులు జలకాలాడినట్టు
అప్సరసలు హొయలు వొలికించినట్టు
పులికాట్టు అలలనిండా రంగేళీ
పిల్ల పిచ్చుకల పారువేట కేళి
పిల్లలు నిండిన జలమైదానం
ఆనందాల ఉల్లాస కచ్చేరి అనిపిస్తుంది
దర్శక చక్షువుల కనుపాపల్లో
వర్ణార్ణవ మేళాగా ప్రతిబింబిస్తుంది
నేలపట్టు నుంచి పులికాట్టు వరకు
రంగులగంగ ధారగా ప్రవహిస్తుంది
పక్షుల పండుగ
సంబరం అంబరాన్ని తాకుతుంది
ఎర లేదు వలలేదు గాలం అదీ లేదు
ముక్కే వేటాడే ఆయుధం
అలలైనా కెరటాల వలలైనా తుఫానులైనా
ఆకలి యుద్ధం యేనాడాగాదు
వేటడడంలోనే వొడుపంతా
రక్తం పంచిపెట్టిన భిక్ష
ఎంతటి జలపుష్పమైనా
ముక్కున కరిస్తేనే పరీక్ష
గాలిమార్పిడికి పులికాటే విడిది
సంతాన సమృద్ధికి నేలపట్టు మానులే మహడీ
ప్రళయకావేరి ప్రణయ భావాల చర్చరి
ఇక్కడ పుట్టిన ప్రతిగువ్వా రేపటి వియచ్చరి..!!
Also read: ఫ్లెమింగో-12
Also read: ఫ్లెమింగో-11
Also read: ఫ్లెమింగో-10
Also read: ఫ్లెమింగో-9
Also read: ఫ్లెమింగో-8