Sunday, November 24, 2024

పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు

వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచనలు మొదలైనట్లుంది. ఒకవేళ, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే, యుద్ధం కాస్త ముందుకు జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నేతలు కొందరు కత్తులకు పదును పెడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ – ఎన్ సి పి అధినేత శరద్ పవార్ మధ్య జరిగిన తాజా భేటీ రాజకీయ క్షేత్రాల్లో కొత్త అగ్గిని రగిలిస్తోంది. చాలా ఊహాగానాలకు తెరతీస్తోంది. నిన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం సహకరించినవారికి, మద్దతు ఇచ్చిన నేతలకు ధన్యవాదాలు తెలిపే క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని  అధికారికంగా ప్రకటించారు.

Also read: యూపీలో ఏమి జరుగుతోంది?

వచ్చే ఎన్నికలపైనే పీకే-పవార్ చర్చ

ఐనప్పటికీ ఈ ఇద్దరి మధ్య జరిగిన మూడు గంటల సుదీర్ఘ సమావేశంలో జాతీయ రాజకీయాలు, వచ్చే లోక్ సభ ఎన్నికల పోరు చుట్టూనే మాటలు సాగాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకరు కాకలుతీరిన రాజకీయ యోధుడు – మరొకరు ఆధునిక ఎన్నికల వ్యూహకర్త. ఇద్దరూ జమాజెట్టీల్లాంటివారే. కాకపోతే  శరద్ పవార్ వృద్ధుడు, అనారోగ్యవంతుడు. కొన్నాళ్లపాటు ఈ ఎన్నికల ఆటలకు దూరంగా ఉంటానని ప్రశాంత్ కిషోర్ ఇటీవలే ప్రకటించాడు కూడా. ఇటువంటి నేపథ్యంలోనూ  ‘మిషన్ -2024’ అనే వార్తలు బయటకు పొక్కాయి. మొత్తంగా నిజమే కాకపోయినా, ఎంతోకొంత నిజం ఉంటుందనే పరిశీలకులు భావిస్తున్నారు. మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే కలిశారు. ‘మేమిద్దరం కలిస్తే తప్పేంటి?మేము రాజకీయంగా కలిసిఉండనంత మాత్రాన,మా బంధం తెగిపోయినట్లు కాదు…’ అంటూ ఉద్దవ్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ దేశంలోనే గొప్ప నాయకుడు అంటూ శివసేన ఎంపి సంజయ్ రౌత్ ప్రధానిపై ప్రశంసల జల్లులు కురిపించాడు. శివసేన నేతల నుంచి  తాజాగా ఈ వ్యాఖ్యలు వెలువడిన సమయంలోనే, ప్రశాంత్ కిషోర్, శరద్ పవార్ సమావేశం కావడం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ కు వ్యూహకర్తగా ఎంత గొప్ప పేరుందో, ప్రతిపక్ష నేతల్లో శరద్ పవార్ కు కూడా అంత పరపతి ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, తాను వ్యూహకర్తగా ఉంటానని ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా నేడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా అవతారాన్ని చాలించినా, కొనసాగించినా, సమాంతరంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష కూడా ప్రశాంత్ కిషోర్ కు బలంగానే ఉంది.

Also read: మోదీతో దీదీ ఢీ!

ఎన్డీఏకి దీటైన ప్రత్యామ్నాయంకోసం కసరత్తు

లోక్ సభ ఎన్నికలు రావడానికి రెండు మూడేళ్లు సమయం ఉంది. ఈలోపు నరేంద్రమోదీకి దీటుగా, పోటీగా బలమైన ప్రతిపక్షాన్ని తయారుచేయాలనే ఆలోచన దేశంలోని పెద్ద నాయకులందరికీ ఉంది. వారిలో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ ప్రధానంగా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వారితో జతకట్టవచ్చు. కేసుల భయంతో బి ఎస్ పి అధినేత్రి మాయావతి ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా, సందర్భాన్ని బట్టి ఆమె కూడా వారితో ఏకం కావచ్చు. మొన్నటి వరకూ ఎన్ డి ఎలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాళీదళ్ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బయటకు వచ్చింది. త్వరలో జరుగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో  శిరోమణి ఆకాళీదళ్ తో కలిసి సాగడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధమయ్యింది. 25 ఏళ్ళ(1996) తర్వాత ఈ రెండు పార్టీలు తాజాగా మళ్ళీ ఏకమవ్వడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తర్వాత, జమ్మూ కశ్మిర్ లో 370 ఆర్టికల్ ను పునరుద్ధరణ చేస్తామని, ప్రత్యేక రాష్ట్ర హోదాను తిరిగి కల్పిస్తామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. దానిని కాంగ్రెస్ పార్టీ విధానంగానే చెప్పవచ్చు. కరోనా కల్పిత కష్టాలు, నిరుద్యోగం, ఉపాధిలేమి, గణనీయంగా ధరల పెరుగుదల, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మొదలైన సమస్యలు దేశాన్ని చుట్టుముడుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో  ప్రస్తుతానికి నరేంద్రమోదీ గ్రాఫ్ బాగా తగ్గిందని రాజనీతిశాస్త్ర పండితులు భావిస్తున్నారు.

Also read: సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

మోదీ పట్ల వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటారా?

అదే సమయంలో, మోదీకి దీటైన ప్రతిపక్ష నేత కూడా లేరని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బలహీనత ఎట్లా ఉన్నా ప్రజల్లో మోదీపై పెరుగుతున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో శరద్ పవార్, ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లు భావించాలి. ఈ క్రమంలో ప్రతిపక్షాలన్నింటినీ బలోపేతం చేస్తూ, యూపీఏ స్థానంలో “సరికొత్త ప్రతిపక్ష ఫ్రంట్” ను నిర్మాణం చేయాలనే వ్యూహం కూడా శరద్ పవార్ & కోకి ఉండిఉండవచ్చు. ఈ ఫ్రంట్ కు ఏ పేరు పెట్టినప్పటికీ, కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు, మోదీ వ్యతిరేకులు అందరూ ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కాస్త మాట మార్చిన శివసేన రేపు ఎన్నికల సమయానికి ఎటువంటి వైఖరినైనా తీసుకోవచ్చు. ఎన్నికల్లో గెలుపుఓటములన్నీ ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉండవు. ఆ యా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిస్థితులు, సమస్యలు, ప్రజల మనోభావాలు ప్రధానమైనవి. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు నరేంద్రమోదీకి వ్యూహకర్తగా ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పదేళ్లపాలనపై ఉండే తీవ్రమైన ప్రజావ్యతిరేకత బిజెపికి అదనంగా కలిసి వచ్చింది. రేపు 2024 ఎన్నికల సమయానికి బిజెపి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైతే అది ప్రతిపక్ష ఫ్రంట్ కు కలిసి వస్తుంది.2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి,2021లో తమిళనాడులో స్టాలిన్,పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ గెలుపునకు కేవలం ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనలే ప్రధాన కారణాలు కావు. క్షేత్ర వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసే అద్భుతమైన బృందం ప్రశాంత్ కిషోర్ వెనకాల ఉంది. ప్రజలనాడి బట్టి ఎటువంటి పధకాలను రూపకల్పన చెయ్యాలి, ప్రచార వ్యూహం ఎలా ఉండాలి, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో అధికార పార్టీ చేసిన తప్పులు మొదలైన విషయాలన్నింటిపై ఈ బృందం నివేదికలను ఇస్తుంది. తాను వ్యూహకర్తగా ఉన్న పార్టీలు గతంలో చేసిన తప్పులను కూడా పీకే బృందం వివరిస్తుంది.పార్టీ అధినేతలతో నేరుగా పీకేనే మాట్లాడుతారు. వీటన్నిటిని మేళవించుకుంటూ ఆ యా పార్టీల అధినేతలు ఎన్నికల బరిలో దిగుతారు.

Also read: ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

ప్రజలే ఆలోచనే ప్రధానం

ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనే ప్రజల ఆలోచనలే ప్రధానమైన అస్త్రాలు. ప్రశాంత్ కిషోర్ వ్యూహం విజయానికి కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. పూర్తిగా ప్రశాంత్ కిషోర్ వల్లనే ఎవ్వరూ గెలవరు, ఎవ్వరూ ఓడరు. 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి బరిలో ఉన్న నరేంద్రమోదీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఇదే పీకే వేసిన తొలి అడుగు. అది విజయవంతమైంది. 2014లో లోక్ సభ ఎన్నికల క్షేత్రంలో నిలిచిన నరేంద్రమోదీకి ప్రచార బృందంలో పీకే ఉన్నారు. బిజెపి గొప్ప విజయం సాధించి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యారు. దీనితో ప్రశాంత్ కిషోర్ పేరు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మారుమోగింది. ఆ తర్వాత ఆయన ప్రయాణం విస్తరించింది. అయితే, పీకే పట్టిందల్లా బంగారం కాదు. ఉత్తరప్రదేశ్ లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున పీకే వ్యూహకర్తగా వ్యవహరించాడు. కానీ అక్కడ ఓటమే ఎదురైంది. అదే సమయంలో, పంజాబ్ కాంగ్రెస్ కు కూడా ఆయన పనిచేశాడు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తంగా, ఎక్కువ చోట్ల, పీకే వ్యూహకర్తగా ఉన్న సమయంలో ఆయా పార్టీలు గెలవడంతో ఆయన పేరు, ప్రతిష్ఠ అంబరాన్ని తాకాయి. దేశ ప్రధాని కావాలని శరద్ పవార్ ఎన్నోసార్లు కలలు కన్నా ఆయనకు నిరాశే మిగిలింది. ఈసారి ప్రధానమంత్రి అవుతారా? ప్రశాంత్ కిషోర్ తో కలిసి కింగ్ మేకర్ అవుతారా? కాలమే సమాధానం చెబుతుంది. నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ, ‘మిషన్ 2024’ రూపకల్పన జరుగుతొందనే ప్రచారం హోరెత్తుతోంది. మళ్ళీ ప్రధానిగా నరేంద్రమోదీని కూర్చోపెట్టాలా,ఇంకెవరినైనా కూర్చోపెట్టాలా.. అన్నది తెల్చేది ఓటర్లు మాత్రమే. అదే సత్యం. మిగిలినవన్నీ ఊహాగానాలే.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles