ముక్కున కరచి తెచ్చిన బేడిసని
మూరపెంగా ముద్దరాలి కందిస్తుంది ఫ్లెమింగో
తిర్రె తిఱికిణి సాధించిన వేళ
ప్రియురాలి నెంతగా కలవరిస్తోందో
వంజరం ముక్కు పంజరాన
పరవశించి రెక్కలెగదన్ని పిల్లల్ని కలగంటుంది
ఎవరు నేర్పాలో ఇన్ని రాగాలీ పక్షలకి
ఎలా అమరిందో ఇంత ప్రేమ వలయాక్షులకి
ఏ మొదటి పక్షి జాడ జూపిందో ఈ ప్రాంతానికి
ప్రతి యేడాది తప్పని సంసార తిరనాల
నేల పట్టు ముంగిట్లో అనురాగాల ప్రాణహేల
బుడత పక్షులకు రెక్కలొస్తాయి
పిల్ల చేపలు తిండి గింజలౌతాయి
పులికాటే నీటి పంటకాసే పొలం
రొయ్యపిల్లే నోటికందించిన ఫలం
బుల్లి ఫ్లెమింగో రెక్కలాడిస్తూ పాము చేపను వేటాడుతుంది..
ముక్కు వంకర లకుముకి పిట్ట
మట్టగిడసను వెంటాడుతుంది
గిరస చేపల వరసని విచ్చిన్నం చేసి
పరజ పిల్లకాకి ఆనందిస్తుంది
రెక్కలొచ్చిన పిల్లపక్షులకి
ఆకాశం ఎంతో ఇరుకు
ఎగరటం నేర్చిన ఎర్రతీతువు పిట్టకి
నీలి సరస్సు చేపలగాదె
ఆహారాన్వేషణా సమరంలొ
భరత పిట్ట తాండవం
ఆకలికేకల రావడిలో
పిగిలిపిట్ట ఉపజీవిక
ఆకలి పురాతన శత్రువు ఏ ప్రాణికైనా
క్షుదారి సంహారమే శాంతి ఏ జీవికైనా
దేవతలే అమృతం సేవిస్తారు ఆకలైతే
చిన్నచేపనే పెద్దచేప మింగేస్తుంటే
పక్షికోటి
తప్పేంటి చేపల్ని తింటే..!!
Also read: ఫ్లెమింగో-12
Also read: ఫ్లెమింగో-11
Also read: ఫ్లెమింగో-10
Also read: ఫ్లెమింగో-9
Also read: ఫ్లెమింగో-8