అతనితో ముఫై ఏళ్ళ పరిచయం…
ఇల్లిల్లు తిరుగుతూ పూలమ్మే పోలయ్య…
సన్నని, నల్లని, పొట్టి శరీరం…అమాయకమైన చూపులు!
భుజానికి తగిలించుకున్న ఒక చిన్న వెదురు బుట్ట…
ఏ వీధిలో నైనా కనపడే వాడు.
వడ గాడ్పులైనా, జడివానలైన,
అతనినడకలో వడి, అరుపులో వాడి తగ్గేవికావు
….ముఖoలో కించిత్తు చిరాకు కూడా తొంగి చూసేది కాదు.
“రోజుకెంత సంపాదిస్తావేం?” ఓ సారి అడిగా…
ఎప్పుడో ఎనభైలలో అనుకొంటా!
“సరిపోత్తాదిలే సారు, సగం కడుపు నింపుకోడానికి!”
నవ్వాడు…అది జీవంలేని నవ్వు…
స్వయం పరిహాస హాసం!
“అయినా బాగానే ఉండాంలే సామి!
అదేదో మీరంటారే సదువుకున్నోళ్ళు
సంతురి పితి!” గుంభనంగా నవ్వాడు.
ఈ మధ్యనే స్కూటర్ లో పోతూ
మా నెల్లూరు కొత్తవీధుల పద్మ వ్యూహంలో దూరి
తిరిగి తిరిగి దారి తప్పి ఓ మురికివాడ కు చేరా.
అక్కడ కనిపించాడు పోలయ్య…చాల్రోజుల తర్వాత
“ఇక్కడ పూలమ్ముతున్నావా?” అడిగా.
“ఈడ్నే మా ఇల్లు సార్…ఇదే మేముండే వాడ!”
మళ్ళీ అన్నాడు: “నా సంపాదనకు వేరేడ ఉండగలం సార్?
ఎదో చాలి చాలకుండా, ఉన్నంతలో ఉండగలిగేది ఈడే!”
“ఎం సారు, నన్ను సూస్తే జాలి ఏస్తోందా!”
నా నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ …
అదో బాధను బాధని చెప్పలేని వ్యగ్ర వ్యంగ్యం!
అలవాటైన ఆవేదన నేర్పిన నిర్వికార నిష్ఠురత.
“ఏళ్ళు గడిచిపోయాయి సామి …
ఇక్కడే, ఇదే, ఇట్టాగనే మా బతుకు…
ఏడవడానికి కూడా లేదు!” పకపకా నవ్వాడు.
“సెప్పలేనంత నీళ్ల ఎద్దడి ఈడ!”
మౌనంగా చూస్తూ ఉండి పోయా…
చెమ్మగిల్లిన కళ్ళ తోటే ఒక విచిత్రపు నవ్వు నవ్వా!
‘ఇతరుల జీవితాలలో పరిమళాలు నింపే
పూలవాడి ఇల్లు ఇక్కడా?!
ఈ ఇరుకు సందులో పొంగి పొర్లే మురికి కాలువ ప్రక్కన!
వాహ్ దేవుడా ! నీకు తెలిసినట్లు లేదు…భలే, భలే!
నీవు ముడుచుకొని మురిసిపోయేది ఇక్కడ అల్లిన పూల మాలే!
Also read: రాగాలు
Also read: జీవితం
Also read: సముద్రం
Also read: కాలెండర్
Also read: కూలి