కాలం ఎప్పుడూ తెరిచిన పుస్తకం
అన్నీ తనలో యిమిడిన బహిరంగ రహస్యాలే
ఎవరికీ ఏమీ నేర్పని గురువు కాలం
అందరికీ అన్నీ తెలిపే రాయబారి కాలం
జీవన యాగ జ్ఞానులు విదేశీ పక్షులు
సీమాంతర ద్వేషాలెరుగని ఆత్మీయ మిత్రులు
ఇంద్రియ చాపల్యం లేని విదేశీయోగులు
కాలచక్ర రహస్యం దర్శించిన దివ్య జ్ఞానులు
విశ్వభాషలో పలకరింపులు, పులకరింపులు
సమైక్యతా శిబిరాలు నిర్వహించే సంస్కారులు
ఈ నేల గాలి సోకగానే వలస బిడారుకి
ఆత్మతీర్థాలు పొంగి పొరలు తుంటాయి
ఈ గుబురు కొమ్మల పచ్చని నీడలోనే
రేపటి తరం కలలన్నీ సాక్షాత్కారిస్తాయి
అందుకే పక్షి కాలానికి సాంకేతమంటాను
భూత భవిష్యధ్వర్తమానాల సంగమగీతమంటాను
త్రికాల తంత్రానికి సాధికారతే సంగమ హోమం..
పక్షి పక్షిని ప్రేమిస్తుంది
ఆత్మ ఆత్మ తో సంగమిస్తుంది
నేలపట్టు పౌండరీక దీక్షా వేదిక
నేలపట్టు సనాతన యాగ సూచిక
పరంపరాగత బీజాల ప్రాణప్రతిష్ట
ప్రకృతి సమతౌల్యానికి త్రాసు ఇక్కడ
ఇక్కడే ప్రకృతి మరో శ్వాస పీలుస్తుంది
ఇక్కడే జగతి ఒక సృష్టికి జన్మనిస్తుంది
సముద్రాలు దాటిన ఈ జానెడు నేల
ఒక జాతి జీవితానికే మనుగడ
ఒక బౌద్ధిక ధర్మం పరిఢవిల్లిన
ప్రాపంచిక సుఖదుఃఖాల తలగడ
మర్మరాగమో, రాగమార్మమో ఎరిగిన
రతీదేవి నృత్య ప్రాంగణమిది
అనిత్యమైన శరీరం తప్పనిసరై
ఆత్మ సార్థకతను కోరే తరుణమిది
దైహికానందమో, ఆనంద దైహికమో మరచి
మన్మధుడు ఉన్మత్తయోగి అవుతాడిక్కడ..
ప్రకృతే ఈ నేలపై ప్రకృతి ధర్మం నెరవేరుస్తుంది
పురుషుడై సృష్టి ధర్మం సాగిస్తుంది
ఆత్మ భేదం లేని పక్షి సమూహం
స్త్రీ పురుష వివక్షలేని సమానత్వం
కళ్ళు తెరిచిన వారికి వాంఛావాసన
కళ్ళు మూసిన ముముక్షులకి
ఆత్మ సాక్షాత్కారం
రుతువులై రంగులు మారే కాలం
పక్షులై పరవశిస్తుంది నిమేషం
ఇక్కడే ఒక అనాదికాలానికి
అంతం ఆరంభమౌతుంది
అంతం నుంచి అనంతానికి
ఇక్కడి నుంచే పునాది పడుతుంది..!!
Also read: ఫ్లెమింగో-10
Also read: ఫ్లెమింగో-9
Also read: ఫ్లెమింగో-8
Also read: ఫ్లెమింగో-7
Also read: ఫ్లెమింగో – 6