పరమ శాంతంగా కనిపిస్తోంది సాగరం.
లోలోన సాగిపోయే రహస్య రక్తారుణ అంతర్వాహినులు కనబడకుండా
బేల కెరటాలు ఉపరితలాన్ని
నిశ్శబ్ద నీలి వర్ణ లేపనంతో పులిముతున్నాయి.
పగలంతా వేల వేల కిరణ నయనాలతో
కాపలా కాసే మార్తాండుడికి,
రాత్రంతా మేలుకొని
వెన్నెల వలలతో ఆటు పోటులు సృష్టించే నెలరేడికి
ఎక్కడ ఏ తప్పు తెలియటం లేదు.
అవును
పరమ శాంతంగా కనిపిస్తోంది సాగరం.
తెరచాప లేపి గాలి వాటంగా నావలు నడిపే నావికులకూ
నావక్రింద ప్రళయనాట్యం చేసే సుడిగుండాల స్ఫూరణే లేదు.
నిజమే
పరమ శాంతంగా కనిపిస్తోంది సాగరం.
నిస్సిగ్గుగా, నిశ్శబ్దంగా జరిగే
అంతర్గత సంఘర్షణల ధోరణి వేరు…
చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది,
పెద్ద చేపను తిమింగలం వెంటపడి వేటాడి వేటాడి
ఎముకల పోగులుగా చేసి వదులుతుంది.
సాగరగర్భంలో ఇంకెక్కడో బడబాగ్నులు చెలరేగి
నిప్పులు చిమ్ముతూ,
వారినిధి ఒడిని జలచరాల భస్మ రేణువులతో కప్పివేస్తున్నాయి.
అయిన పైన
పరమ శాంతంగా కనిపిస్తోంది సాగరం.
Also read: నిశ్శబ్ద గీతిక
Also read: కర్మ ఫలం
Also read: జ్ఞాపకాలు
Also read: నీకు దగ్గరగా
Also read: ప్రళయం
Also read: కూలి
Also read: కాలెండర్