Sunday, November 24, 2024

జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

  • యూపీ రాజకీయాలలో కుల సమీకరణల కుంపటి రాజకీయాలలో ఒక సమిధ
  • రాజకీయ వంశాల వారసులను బతిమిలాడవద్దని రాహుల్, ప్రియాంక నిర్ణయం
  • సచిన్ వైపే అందరి దృష్టీ

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితేన్ ప్రసాద బీజేపీలో చేరడం బీజేపీకి ఎంత లాభం, కాంగ్రెస్ కి ఎంత నష్టం అనే విషయంలో చర్చ జరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా తర్వాత మరో ముఖ్యమైన నాయకుడిగా, రాహుల్ గాంధీ ఆంతరంగికులలో ఒకడిగా చెలామణి అయిన జితేన్ ప్రసాద రెండేళ్ళుగా బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెండేళ్ళ కిందట ప్రియాంకగాంధీ ఒక సారి మాట్లాడి చూశారు. కానీ అతడు బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాలు నిలుపుచేయలేదు. పైగా అధికారం లేకుండా ప్రజాసేవ చేయడం సాధ్యం కాదనే అభిమతం ఆయనది.

ఉత్రరప్రదేశ్ (యూపీ) జనాభాలో బ్రాహ్మణులు  పది నుంచి పదమూడు శాతం వరకూ ఉంటారని అంచనా. అంటే, ఇది చాలా ముఖ్యమైన సమూహం. 2017 ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోని ముఠాలను సమైక్యంగా ఉంచడానికీ, ముఠాతత్వానికి అతీతంగా పని చేయడానికి గోరఖ్ పూర్ మఠాధిపతి, ఆరు సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన యోగీ ఆదిత్యనాథ్ యోగ్యుడని అటు నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ పెద్దలూ, ఇటు దిల్లీలోని బీజేపీ వరిష్ఠ నాయకులూ ఒక అంగీకారానికి వచ్చారు. యోగి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ యూపీలో ఠాకూర్ల (క్షత్రియుల) ఆధిక్యం ప్రబలింది. బ్రాహ్మణకులానికి చెందిన దుబే అనే రౌడీని హత్య చేసినందుకు ఆ కులంలో కొందరు మనసు కష్టపెట్టుకున్నారు. రౌడీనీ, హంతకుడినీ సమర్థించకపోయినా దుబేని హత్య చేసిన విధానాన్ని కొందరు ప్రశ్నించారు. అదీ కాకుండా క్షత్రియులు బ్రాహ్మణులపైనా, ఇతర కులాలపైనా పెత్తనం సాగించడం ఎక్కువైంది. యూపీలో బ్రాహ్మణులు ఇతర రాష్ట్రాలలోనివారిలాగా కాకుండా రాజకీయంగా బలమైన వర్గం.

Also read: పెరుగుట విరుగుటకొరకే 

యూపీ బ్రాహ్మణులలో అసంతృప్తి

యూపీలో బ్రాహ్మణులు 1989 వరకూ కాంగ్రెస్ తో ఉన్నారు. ఆ సంవత్సరం బీజేపీవైపు మొగ్గు చూపించారు. మొన్న 2019వరకూ బ్రాహ్మణులు బీజేపీకి అండగా నిలబడ్డారు. అంతకు ముందు ఒక సారి మాయావతి పార్టీవైపు మొగ్గు చూపించారు. ఒక ఎన్నికలో మాయావతి బ్రాహ్మణులకు బ్రహ్మరథం పట్టి ఎక్కువ సీట్లు పోటీ చేయడానికి కేటాయించారు. ఆ తర్వాత బీజేపీని సమర్థిస్తూ వచ్చిన బ్రాహ్మణులకు యోగి ఆదిత్యనాథ్ కొరకరాని కొయ్యగా తయారైనారు. ఎవ్వరి మాటా వినడు. ఎవ్వరినీ సంప్రదించరు. నిర్ణయాలు తీసుకునే ముందు మాట్లాడడం కానీ, నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవి అమలు జరుగుతున్న తీరుపైన సమాచారం అడిగి తెలుసుకోవడం కానీ ఉండదు. ఏకవ్యక్తి పాలన. దిల్లీ లో లాగానే, మరెన్నో రాష్ట్రాలలో లాగానే అధినాయకుడిదే ఆదిపత్యం. ఇతరులంతా డమ్మీలే. యోగి పాలన పట్ల సాధారణ ప్రజలలో వ్యతిరేకత ఉన్నదనీ, ముఖ్యంగా బ్రాహ్మణులు అసంతృప్తితో రగలిపోతున్నారని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు వారం, పది రోజులుగా యూపీ లో పర్యటిస్తూ, ప్రజలతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడి తెలుసుకున్న వైనం. ఇది బీజేపీ నాయకత్వాన్ని ఆలోచనలో పడవేసింది.

యూపీలో బీజేపీకి అటల్ బిహారీ వాజపేయి వంటి బ్రాహ్మణ నాయకుడు ఉండేవారు. మొన్నటి దాకా టాండన్ పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయనను గవర్నర్ గా నియమించిన తర్వాత ఆ రాష్ట్రంలో పేరు కలిగిన బ్రాహ్మణ నాయకుడు లేడు. అందుకని జితిన్ ప్రసాదకు స్వాగతం చెప్పింది. జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం పట్ల సచిన్ పైలెట్ ఖేదం వెలిబుచ్చారు.

జితిన్ ప్రసాద్ పార్టీ వీడి వెళ్ళి పోవడానికి కాంగ్రెస్ నాయకత్వం అసమర్థతగా భావించి వ్యాఖ్యానించే పని మన జాతీయ మీడియా సమర్థంగా చేసింది. కాంగ్రెస్ నాయకత్వంలో పొరబాట్లు ఉన్నాయనడంలో సందేహం లేదు. మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్ఠానం సమగ్రం, సమయోచితంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే కేరళలో, అస్సాంలో ఓడిపోవలసింది కాదు. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం శాశ్వత నాయకులు లేదా నాయకురాలు లేకుండా తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియాగాంధీ కొనసాగుతూ పార్టీకి దిశానిర్దేశం చేసే పరిస్థితి లేదు. అది కొండమీదినుంచి రాయి దొర్లుకుంటూ కిందికి వస్తున్నట్టు దొర్లుతూనే ఉంది. అయితే, ఒక విషయాన్ని గమనించాలి. పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీకి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతున్న నాయకుడు దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ ఒక్కరే. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా బీజేపీ తర్వాత మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. తృణమూల్ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలలో శాఖలు పెట్టినా ఒరిగేది ఏమీ ఉండదు. ఇతర రాష్ట్రాలలో మమతా బెనర్జిని చూసి ఓటు వేసేవారు ఎవ్వరూ ఉండరు. అటువంటి ప్రయోగం మాయావతి చేసి, బీఎస్ పీ శాఖలను ఆంద్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో నెలకొల్పి విఫలమైనారు. అంకితభావంతో ఓటు వేసే దళితుల మద్దతు కలిగిన మాయావతే ఆ ఆలోచనను ఉపసంహరించుకొని యూపీకి పరిమితం అయినప్పుడు మమతా బెనర్జీ అటువంటి ఆలోచన చేయడం అనవసరం. ప్రస్తుతానికి మోదీకి సవాళ్ళు విసురుతున్న ముఖ్యమంత్రి దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే, ఇందిరాగాంధీని ది ఓన్లీ మాన్ ఇన్ ఇండియన్న పొలిటిక్స్ అంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకుడు ఫ్రాంక్ మోరే అభివర్ణించన విధంగానే ఈ రోజు మమతా బెనర్జీ ఒక్కరే ఈ దేశపు ప్రతిపక్షంలో ఒకే ‘మగాడు’ అని అభివర్ణించేవారు ఉన్నారు. ఇటువంటి అభివర్ణనలో లింగపరమైన వివక్ష ఉన్నది కనుక దాన్ని వదిలేద్దాం. కానీ రేపు మోదీపైన ప్రజలకు మొహం మొత్తితే, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-3కి ఉంటుంది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఒక వేళ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రధాని పదవి ముళ్లకరీటం అని భావించి అది తమకు అక్కర లేదని అనుకుంటే అప్పుడు మమతా బెనర్జీ వంటి నాయకురాలికి అవకాశం ఇవ్వవచ్చు. అది వేరే విషయం.

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు

ఇప్పటికీ కాంగ్రెస్ కు రాహుల్ దే నాయకత్వం

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రయోజనాలను రాహుల్ గాంధీ వదిలిపెట్టలేదు. కేరళలో కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో, విధాన సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుండాలో తల్లీకొడుకులే నిర్ణయిస్తున్నారు. కనుక రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ పార్టీ నడవడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తన చుట్టూ తనలాగే నాగరికులనూ, దిల్లీ వాతావరణానికి తగినవారినీ (లూట్యేన్ దిల్లీ), విదేశాలలో చదువుకున్నవారినీ,ముఖ్యంగా రాజకీయ కుటుంబాలకి చెందిన యువకులనూ చేర్చకున్నారు. లోక్ సభలో మోదీని ఆలింగనం చేసి వచ్చిన తర్వాత పక్కనే  కూర్చున్న జ్యోతిరాదిత్య సింధియాకు కన్నుకొట్టడం వారి మధ్య అత్మీయ అనుబందానికి నిదర్శనం, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలెట్ రాజకీయ కుటుంబాలకు చెందినవారు. వారి తండ్రులు ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో కలసి పని చేసినవారు. వారి ప్రత్యేకత ఏమిటో వారికి తెలుసు. అందుకని వారు ప్రత్యేకహోదా కోరుకుంటారు. పార్టీ అదికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమకు ప్రత్యేకమైన గౌరవప్రపత్తులు ఉండాలని కోరుకుంటారు. అది తమ హక్కుగా భావిస్తారు. తాము ఆశించిన ప్రతిపత్తి లభించకపోతే వైరిపక్షంతో మాట్లాడుకుంటారు. వీరు స్వార్థ చింతన కలిగినవారనీ, పార్టీ కంటే తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తారనీ, తనకు గుదిబండగా తయారైనారని రాహుల్ గాంధీ గ్రహించారు. వీరు చుట్టూ ఉండడం వల్లనే తనను డైనాస్ట్ (రాజకీయ వంశజుడు) అంటూ ఆరోపించి ఆటపట్టించడానికి బీజేపీకి అవకాశం దొరికిందని తీర్మానించుకున్నారు. వారిని దువ్వడం, మంచిచేసుకోవడం, వారి కోర్కెలు తీర్చడం వంటివి పెట్టుకోకూడదని తీర్మానించుకున్నారు. సచిన్ పైలెట్ పది మాసాల కిందట బీజేపీలో ఒక అడుగు పెట్టి రాహుల్, ప్రియాంకలు పలిపించుకొని మాట్లాడిన తర్వాతనే కాలు వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో తనకు ఇచ్చిన వాగ్దానలు పది మాసాలైనా అమలు జరగలేదనీ, కాంగ్రెస్ పదవీ కాలంలో సగం పూర్తియిపోతున్నది సచిన్ ఫిర్యాదు చేస్తున్నారు. అతను సైతం బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

Also read: ఏమున్నది గర్వకారణం?

ముఖ్యమంత్రి ముఖ్యుడా, తిరుగుబాటు నాయకుడా?

ఒక ముఖ్యమంత్రికీ, ఒక తిరుగుబాటు నాయకుడికీ మధ్య పేచీ వచ్చినప్పుడు, వివాదం ముదిరి పాకాన పడినప్పుడు, ఎవరికో ఒకరికి మాత్రమే మద్దతు ఇవ్వవలసిన పరిస్థితి వస్తే ఏ పార్టీ నాయకత్వం అయినా ముఖ్యమంత్రినే సమర్థిస్తుంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాలంలో ముఖ్యమంత్రులపైన చాడీలు చెప్పే నాయకులకు చెవులు ఒగ్గేవారు. ముఖ్యమంత్రులను మార్చేసేవారు. ముఖ్యమంత్రులు స్థానికంగా బలపడితే తలకు పొగరెక్కి తమను ధిక్కరిస్తారని వారి భయం. ఇప్పుడు సోనియాకూ, రాహుల్ కూ అటువంటి భయాలు ఉన్నప్పటికీ వారికున్న బలం లేదు. కనుక తగ్గే ఉండాలి. గెల్హోట్ కానీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కానీ ఎదురు తిరిగితే ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు దెబ్బతగలడం ఖాయం. అందుకని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాగా పొగరుగా వ్యవహరిస్తే నష్టపోయేది సోనియా కుటుంబమే. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెల్హాట్ సమర్థుడనీ, రాజకీయ చతురుడనీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని, సచిన్ పైలట్ ప్రయత్నాన్ని, మోదీ-అమిత్ షా పన్నాగాన్నీ వమ్ము చేయడం ద్వారా నిరూపించుకున్నాడు. అదే విధంగా పంజాబ్ లో బీజేపీ బలం లేదు. అకాలీ దళ్ కూడా అస్తవ్యస్తంగానే ఉంది. అక్కడ కాంగ్రెస్ గెలిచిందంటే రాహుల్ జనాకర్షకశక్తికానీ, ప్రశాంత్ కిశోర్ వ్యూహరచనాకౌశలం కానీ కారణం కాదు. కేవలం కెప్టెన్ అమరేంద్రసింద్ కి ఉన్న ప్రాబల్యం. అటువంటి ముఖ్యమంత్రిని మాజీ క్రికెటర్, మాజీ మంత్రి నవజోత్ సిద్ధూ సవాలు చేస్తున్నారు. ముగ్గురు సభ్యుల కమిటీని సోనియా నియమించారు. ముఖ్యమంత్రిని సంజాయిషీ కోరారు. ఇటువంటి పనులు చేస్తే తిక్కరేగి కెప్టెన్ అమరేంద్రసింగ్ పార్టీకి గుడైబై చెప్పి ప్రాంతీయపార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు. రానున్న కొద్ది మాసాలలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రంలో నిలకడగా ఉన్న ముఖ్యమంత్రిని దూరం చేసుకోవడం కంటే అవివేకం మరొకటి ఉంటుందా?

Also read: ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?

రెండు సూత్రాలకు తిలోదకాలు

బీజేపీ రెండు విషయాలను మాటమాటకీ నొక్కి చెబుతూ వచ్చింది. పార్టీ విత్ ప్రిన్సిపిల్స్ అని చెప్పుకునేది.  తమది కార్యకర్తలతో నడిచే పార్టీ అనీ, రాజకీయ కుటుంబాలకు తాము వ్యతిరేకమనీ చెబుతూ వచ్చింది. అదే విధంగా లూట్యెన్ దిల్లీకి అలవాటైన నాయకులు తమపార్టీకి అక్కర లేదని కూడా చెబుతూ వచ్చింది. కాంగ్రెస్ పైన ధ్వజం ఎత్తడానికి ఈ రెండు అంశాలనూ బాణాలుగా వినియోగిస్తూ వచ్చింది. దేశంలో సోనియాగాంధీ నాయకత్వంలోని నెహ్రూ-గాంధీ రాజకీయ కుటుంబం తర్వాత సింధియాల కుటుంబం కంటే బలమైన రాజకీయ కుటుంబం మరొకటి లేదు. అటువంటి కుటంబానికి అసలుసిసలు వారసుడైన జ్యోతిరాదిత్య సింధిగా ఎందుకు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి యోగ్యుడైనాడు. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే సింధియా అవసరమైనాడు. అతణ్ణి ఉపయోగించుకున్నారు. ప్రతిఫలం కింద తన వర్గానికి చెందిన కొందరు ఎంఎల్ ఏలకి మంత్రిపదవులు ఇచ్చారు. తనకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చారు. మొత్రిమండలి విస్తరణ జరిగితే అవకాశం ఇస్తామంటున్నారు. అది కూడా ప్రాధాన్యం కలిగిన శాఖను బయటినుంచి వచ్చిన సింధియావంటి నాయకులకు ఇవ్వరు. అదే తరహాలో రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సచిన్ పైలట్ ను వినియోగించుకునే ప్రయత్నం చేశారు. అందుకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుధర రాజేసింధియా సహకరించలేదు. బీజేపీ వెనకడుగు వేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెల్హాట్ పావులు చక్కగా కదిపారు. అధికారం దక్కించుకున్నాడు. తిరుగుబాటుదారుడైన సచిన్ పైలట్ కు చెక్ పెట్టారు. సచిన్ తండ్రి రాజేశ్ పైలట్ రాజకీయవంశానికి ఆద్యుడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే దమ్ములు బీజేపీ అధిష్ఠానవర్గానికి లేవు. కనుక బ్రాహ్మణవర్గాన్ని సంతృప్తి పరచడానికి జితిన్ ప్రసాదను తెచ్చుకున్నారు. జితిన్ ప్రసాద తండ్రి జీతేంద్ర ప్రసాద రాజీవ్ గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియాగాంధీపైన పోటీకి నిలబడ్డారు. అటువంటి రాజకీయవంశానికి చెందిన జితిన్ బీజేపీలో చేరడంలో వింత లేదు. ఆయనతో పాటు యూపీ లో బ్రాహ్మణులందరూ పొలోమంటూ బీజేపీకి ఓటు వేస్తారని అనుకోనక్కరలేదు. 2014 నుంచి నరేంద్రమోదీ, అమిత్ షాలు చేస్తున్నది అవకాశవాద రాజకీయం తప్పిదే సూత్రబద్ధత ఇసుమంతైనా లేదు. ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలను పడగొట్టినా, ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా, ఏ నాయకులకు పార్టీ కండువా కప్పినా అంతా స్వార్థ, అవకాశవాద రాజకీయమే.

Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

ప్రియాంక నిర్ణయం

గోడదూకుదామని రెండేళ్ళ నుంచి ఆలోచిస్తున్న జితిన్ కు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం కూడా ఇచ్చింది. బెంగాల్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించమని పురమాయించింది. కాంగ్రెస్ కు అక్కడ ఒక్క సీటు కూడా రాకపోవడంతో జితిన్ కు మొహం చెల్లడంలేదు. పైగా అన్ని రకాలుగా, సంస్థాగతంగా ఈ దేశంలో జాతీయ పార్టీ అని పిలవదగిన పార్టీ బీజేపీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు బీజేపీలో చేరిన తర్వాత. అవకాశవాద రాజకీయాలను వంటబట్టించుకున్నారు కనుకనే జితిన్ ను ఆపే ప్రయత్నం ప్రియాంక కూడా చేయలేదు. నిజానికి యూపీ వ్యవహారాలు ప్రియాంక చూస్తున్నారు. ఆరేడు మాసాలలో అక్కడ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ కొంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నది. మొన్నటి పంచాయితీ ఎన్నికలలో అధికారపార్టీ దెబ్బదిన్నది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. చివరికి సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోక తప్పకపోవచ్చు. అటువంటి సందర్భంలో జితిన్ వంటి పలుకుబడి కలిగిన నాయకుడు కాంగ్రెస్ లో ఉంటే ప్రియాంకకు తోడుగా ఉన్నట్టు అయ్యేది. ఆమె కూడా రాజకీయవంశాలకు చెందినవారిని బతిమిలాడి, బామిలాడి తన పార్టీలో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించారు. అందుకే జితిన్ ను ఆపడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. ఇక సచినపైనే అందరి దృష్టీ ఉంది. రాహుల్, ప్రియాంకలు అతని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles