ఎనభై దాటినా అతను ఇంకా కూలియే…
వరి నాట్లు, కాల్వల పూడికలు, కుప్ప నూర్పులు,
వీపు పై మోయలేనంత బరువు తప్పని జీవితం.
మెత్తపడి, వాలిపోయి, బిగుతు తగ్గిన అతని కండలు
ఇంకా లయ తప్ప కుండా, అలుపు లేకుండా,
పైకి క్రిందకు కదులుతూ బస్తాలు మోస్తూనే ఉన్నాయి.
నిజానికి అలిసింది, అలిసేది,
బాధతో నిశ్శబ్దం గా అరిచేది అతని మనసే!
తాగి తాగి చచ్చిన ఒక్కగానొక్క కొడుకు,
ఇరవై నిండకముందే ముండమోసి పుట్టింటికి చేరిన కూతురు,
వేన్నీళ్లకు చన్నీళ్లన్నట్లు ఇంకో చెలలో కలుపు తీస్తున్న భార్య…
అతనికి ఈ యాతన తప్పదు…బహుశా
ఆఖరి శ్వాశ వరకు…
అతని అవస్థ చూస్తే నాలో ఎదో వికృత, వికార హాస్య డోలిక…
అవును మరి…నేనెంత గొప్పవాణ్ణి…
నా లాంటి వాళ్ళందరూ…కాస్త జీతం, బోల్డంత గీతం
ఇదే ప్రభుత్వోజ్యోగుల సుఖ జీవిత సారస్యం
బహిరంగ ఉద్యోగ రహస్యం…హహహ!
మెత్తటి కుర్చీ, విశాలమైన బల్ల,
పని చేసిన, చేయక పోయిన జీతం,
సంవత్సరానికి ఒక ఇంక్రెమెంటు…
సరే, అరవై దాటాక బోలెడన్ని డబ్బులు,
జీపీఎఫ్ లు, గ్రాటుఇటీ లు, ఇంకా ఎన్నో లక్షల్లో,
నెలనెలా పెన్షను…
ఇవన్నీ కాక కావలసినంత తీరిక, ఓ మెత్తటి పడక కుర్చీ,
ఎదురుగా అరవై అంగుళాల పెద్ద T. V…
ఇంత సుఖం, ఈ సౌకర్య సాకల్యం
గుడ్డి ప్రభుత్వం కృతజ్ఞతతో మాకు చెల్లించిన మూల్యం.
ఎందుకూ…
…ముఫై ఏళ్ళు ఆఫీసులో హాయిగా నిద్రపోయినందుకు.
Also read: నిశ్శబ్ద గీతిక
Also read: కర్మ ఫలం
Also read: జ్ఞాపకాలు
Also read: నీకు దగ్గరగా
Also read: ప్రళయం