Sunday, November 24, 2024

వన్ సైడెడ్ లవ్!

ఈ ఏడాది మహానాడు ఘనంగానే జరిపించేశామని తెలుగుదేశం పార్టీ అధినాయకులు గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకుంటున్నారు. కార్యకర్తల వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి గురించి సవాలక్ష సందేహాలు నైరుతి రుతుపవనాల మబ్బుల్లా ముసురుకుంటున్నాయి. నాయకులు మాత్రం జూమ్ మీటింగుల పరవళ్లతో జామ్మని ఊదేస్తూ ఆ సందేహాల మబ్బులను తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోందా? కేంద్ర రాష్ట్రాల పరిపాలన విధానాలపై, ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాట పంథా చేపట్టనుంది? ఇంకా ఎన్నికలకు మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అవలంబించే వైఖరి గురించి ఆ పార్టీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also read: అతనికెందుకు పగ!

రొటీన్ కంటే రిలీఫ్

కరోనా దయవల్ల మహానాడును నిరుడు మాదిరిగానే ఈ ఏడాది కూడా పార్టీ కార్యకర్తల నడుమ జరిపించ లేకపోవడంతో చాలామంది టిడిపి కార్యకర్తలు బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నట్టు తెలుస్తోంది. లేకపోతే మూడు రోజులపాటు పార్టీ అధినాయకుడితో సహా అతిరథ మహారధులందరూ చెప్పిన విషయాలే చెప్తూ మన తెలుగు టీవీ సీరియళ్లకు పోటీగా సాగదీత ఉపన్యాసాలు సభాస్థలిలో వినవలసిన పరిస్థితి తప్పిందని వారి నిట్టూర్పు. ఆన్లైన్ సమావేశాలకు మొక్కుబడిగా హాజరుకావడం, మధ్యలో మిస్సింగులకు నెట్వర్క్ పై నెపం మోపడానికి లాక్ డౌన్ వీలు కలిగించింది. అయితే సమయం తగ్గింది గాని, సమావేశాలలో అధినేత ఉపన్యాస శైలి మారలేదు. ఆత్మస్తుతి, పరనింద రెండూ మెండుగా కనిపించాయని కార్యకర్తలు సంబరపడ్డారు. యధావిధిగా ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వవలసిందేనంటూ అరిగిపోయిన రికార్డు డిమాండ్ మరోసారి చేశారు. ఆయనను మించిన ఆయన వందిమాగధులు అంతటితో ఊరుకోకుండా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుని ఈ సమయంలో వారం రోజుల పాటు చంద్రబాబుకు అధికారం ఇస్తే కరోనాను దేశం అవతలికి తరిమి పారేస్తారని కూడా శెలవిచ్చారు.

రెండు రోజుల మహానాడులో ప్రజాకంటకమైన వైకాపా పాలన దానికదే అంతమైపోతుందని ఎవరికి వారే నాయకులంతా తమ అధినాయకుడికి భరోసానిచ్చారు. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, ప్రజలకు మరో ఆప్షన్ లేకపోవడం వల్ల తామే అధికారంలోకి వస్తామని నచ్చచెప్పారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలోనే ఉంటే బాగుంటుందని గాని, ప్రజా సమస్యలపై పోరాటం చేపట్టాలని గాని వారెవరూ సూచించలేకపోయారు. చంద్రబాబు మాత్రం తన ప్రసంగాలలో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టే మాట్లాడారు. పార్టీకి యువరక్తాన్ని ఎక్కించాలనీ, పార్టీ నేతలు తమలో తాము తగాదాలు పడకూడదనీ హితబోధ చేశారు. పాతిక శాతమైనా పార్టీకి అవకాశమిచ్చివుంటే బాగుండునని పశ్చాత్తాపపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతోందని సీరియస్ విమర్శ చేశారు.

Also read: హ్యాష్ టాగ్ మోదీ

అప్పుల కుప్పల తిప్పలు

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల గురించి తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడే యనమల రామకృష్ణుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి చాలా ఆందోళన చెందారు. అప్పుచేసి తీసుకొస్తున్న డబ్బును అభివృద్ధికి వినియోగించడం లేదంటూ తీవ్రమైన అభియోగం మోపారు. వాస్తవాలు చెప్పడంలో ఎప్పుడూ వెనుకాడే మన తెలుగు పత్రికలు దీనిగురించి పట్టించుకున్నట్లు లేదు. తెలంగాణ ఏర్పాటులో అవశిష్ట ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన అప్పుల వాటా 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పాలనపగ్గాలు వైఎస్ జగన్ కు అప్పజెప్పేసరికి అంటే ఐదేళ్లలో 2.50 లక్షల కోట్ల రూపాయల అదనపు అప్పును రాష్ట్ర ఖజానాకు జమ చేశారు. ఆ సొమ్మును ఏయే అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించారో తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. అక్కడక్కడా ఇచ్చిన లెక్కల బట్టి చూస్తే అయిదేళ్లలో ఆయన విమాన ప్రయాణాలకు వంద కోట్లు, రాజధాని శంకుస్థాపన కోసం ప్రధాని వచ్చినపుడు 250 కోట్లు, రాజధాని నిర్మాణ కన్సల్టెంట్లకు 300 కోట్లు, తాత్కాలిక సచివాలయానికి వెయ్యి కోట్లు, రాజధాని మాస్టర్‌ప్లాన్ కోసం వంద కోట్లు, రెండు పుష్కరాలకు 160 కోట్లు, పోలవరం ప్రజలకు చూపించడానికి వేసిన బస్సు యాత్రల కోసం 400 కోట్లు, ఎన్నికల ముందు ప్రచారానికి 600 కోట్లు… ఇలా దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవ్వరికీ లెక్క చెప్పకుండా ఖర్చు పెట్టిన మారాజులను దుబారా బాబులనే అనాలి.

Also read: మేలుకో జగన్‌!

ఈ బాధ్యతా రాహిత్యాన్ని గుర్తించిన ప్రస్తుత పాలకులు దానిని సరిచేసేలా ప్రయత్నించడం హర్షణీయం. వివిధ పథకాల రూపంలో నేరుగా లబ్దిదారుల జేబుల్లోకి వేస్తున్న ఆర్థిక సాయం గత రెండేళ్లుగా ఏడాదికి సగటున 60 వేల కోట్ల రూపాయలను ఎలా పంపిణీ చేస్తున్నదీ కొన్ని దినపత్రికలలో ప్రకటనల రూపంలో ప్రజలకు తెలియజెప్పడం విశేషమే అయినా, ఫుల్ పేజీ ప్రకటనలకు బదులు సగం పేజీ ప్రకటనలు ఇవ్వడం ద్వారా కొంత సొమ్మును ఆదా చేయవచ్చు. ప్రజాధనం పట్ల పాలకులు ఎంతో బాధ్యతగా వ్యవహరించ గలగాలి. వివిధ పథకాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున నగదు అందుకుంటూనే, ముఖ్యమంత్రి అందరికీ డబ్బులు పంచేస్తున్నారని సణుక్కుంటున్నారు. ఎవరూ తమకు అందుతున్న నిధులను వెనక్కి ఇవ్వడం లేదుగాని ఇతరులకు అనవసరంగా అందుతున్నాయని విచారపడుతున్నారు. మరికొందరు ప్రభుత్వం పప్పుబెల్లాల మాదిరిగా ధనాన్ని పంచిపెడుతోందని కూడా విమర్శిస్తున్నారు. మధ్య దళారీల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు ధనాన్ని అందించడం వల్ల ఆర్థికవ్యవస్థలో జోష్ వచ్చే అవకాశముంది. అదే రెండో ఏడాదికి నీతి ఆయోగ్ ర్యాంకింగును ప్రభావితం చేసిందని చెప్పాలి. దేశంలోనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో కేరళ 75 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంటే, 73 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకుంది.

కాని, ప్రతిపక్షనేత ఇవేవీ పట్టించుకోకుండా, ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి దిగకుండా విచిత్ర విన్యాసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో మళ్లీ సయోధ్యకోసం పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మహానాడు ముగింపు సమావేశంలో చంద్రబాబు కేంద్రంతో విభేదాలు పెట్టుకోకూడదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మాత్రమే పోరాడాలని చేసిన విస్పష్ట ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక రాజకీయ పార్టీకి నిరంతరం ప్రజలలో ఉండి ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే ఊపిరిని అందిస్తుందన్న సత్యాన్ని ప్రయత్నపూర్వకంగా ఆయన విస్మరించారు. కేంద్రం తీసుకునే విధాన నిర్ణయాలపై పోరు సలపకపోవడమే కాదు, సంపూర్ణ మద్దతు తెలపాలని ప్రకటించడం బహుశా పార్టీలో కొందరు నాయకులకు రక్షణ ఇస్తుందేమో కాని, రాజకీయ పార్టీకి ఆత్మహత్యా సదృశమే. భాజపా పట్ల తన ప్రేమను చంద్రబాబు ఎన్ని రకాలుగా వగలుపోయి వ్యక్తం చేస్తున్నా అటునుంచి ప్రతిస్పందన కనిపించకపోవడంతో ఇదంతా విఫల ఏకపక్ష వగలంటూ రాజకీయ పరిశీలకులు బుగ్గలు నొక్కుకుంటున్నారు.

Also read: తెలుగు కథా దీపధారి అస్తమయం


(రచయిత మొబైల్:  9989265444)

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles