కొన్ని ముఖాలు మాయమయ్యాయి , కొన్ని నిర్జీవ నిశ్చలతతో బ్రతికే ఉన్నాయి.
కొన్ని రక్తారుణ దుఃఖాన్ని పులుముకున్నాయి.
కాలం చరిత్రకు కొన్ని కొత్త పుటలను కలుపుతూ
పాపప్రక్షాళనకు వాన రావాలని వేచివుంది.
విషం మింగిన నింగి నెలల తరబడి వమన ప్రయాసలో ఉండిపోయింది.
ఎక్కడికో ఎగిరి పోయిన పక్షులు తిరిగివచ్చి కాలి బూడిదైన గూడుల వద్ద
కూడబలుకు కున్నట్లు ఒక్కసారిగా రోదించాయి .
గాయపడ్డ గాలులు మొన్నటి మర తుపాకుల రణగొణ ధ్వనిని
కర్ణకఠోరంగా రోజు ప్రతిధ్వనిస్తూనే ఉన్నా యి.
ఒకప్పటి పచ్చటి పచ్చిక బయళ్లు యుద్ధయాగాగ్నిలో
సమిధలైనాయి.
భూమాత తన గుండెలపై చెల్లా చెదురుగా చిమ్మబడ్డ
తన బిడ్డల మాంసాన్ని తనలోకి ఇమిడ్చుకోలేక
వేదన అనుభవిస్తుంటే, అప్పుడే ముగిసిన యుద్ధపు
రక్త ఛిన్హాలు మోస్తున్న ప్రకృతి ఆమెపై వడలి, వాలి, మోడు వారింది.
వృద్ధ విరించి తను వ్రాయని విధి
పుడమి పై వక్ర వాక్యాలుగా విస్తరిస్తుంటే
తన వాడి పోతున్న కమల సింహాసనంపై
నిస్తేజుడై వాలిపోయాడు.
మధుతప్త గళాలతో మత్తుగా శాంతి స్థాపనకు ప్రతినలు చేస్తున్న ఉన్మత్త నాయకుల
ప్రల్లదనాల వికృత ధ్వనిలో మునిగి విగత జీవాత్మల ఘోష నిశ్శబ్ద గీతిక అయ్యింది.