Sunday, December 22, 2024

ఆనందయ్య మందుకు ఆమోదముద్ర

“ఆనందయ్య మందు” ఈ మధ్యకాలంలో చర్చోపచర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ చర్చల పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. వాటిని  అట్లుంచుదాం. ఎట్టకేలకు అనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యుడికి ఇది ఊరటను ఇచ్చింది. వైరస్ పూర్తిగా కట్టడి లోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రభుత్వాలు ఆ దిశగా పని చేస్తున్నాయి. ఈ లోపు కరోనా ప్రమాదాల నుంచి బయటపడటానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు విభిన్న వైద్య మార్గాలను ఎంచుకుంటున్నారు. సరే.. వ్యాక్సిన్లు, రెమిడెసివర్,డిఆర్ డిఓ వారి ‘2-డిజి’ మొదలైనవి ఎలాగూ ఉన్నాయి.

Also read: కరోనా చైనా చేతబడేనా?

సమాంతర వైద్యం

వీటన్నింటికి సమాంతరంగా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య అనే ఒక సామాన్యుడు మందుతో ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి తన ప్రయత్నం తాను చేస్తానంటున్నాడు. ఇతనేమీ వైద్యశాస్త్ర పట్టభద్రుడు కాడు, కాసులున్న బడాబాబు కాదు. మామూలు పల్లెటూరి వ్యక్తి. వెంకయ్యస్వామి అనే ఒకప్పటి అవధూతలాంటి వ్యక్తికి భక్తుడు. 30 ఏళ్ళ నుంచి ఆ ప్రాంతవాసులకు వివిధ రకాల రోగాలకు మందులు ఇస్తున్నాడు. కామెర్లు, టైఫాయిడ్, గ్యాస్ ట్రబుల్ సహా అనేక రోగాలు అనందయ్య ఇచ్చే మందుల వల్ల సులభంగా నయమయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన మందులు వాడిన వారెవరూ నష్టపోలేదని, అనందయ్య మా పాలిట దేవుడని వారందరూ కొనియాడుతున్నారు. ఇప్పుడు కరోనాకు ఇచ్చే మందు విషయంలోనూ అదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య ఏ మందు తయారుచేసినా, అవన్నీ వంటింట్లో వాడే వస్తువులతో తయారుచేసేవేనని అంటున్నారు.

Also read: కరోనా కష్టాల మధ్య కర్ణపేయమైన వార్తలు

పెరటి చెట్టు చందం ఆనందయ్య వైద్యం

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్న చందంగా  అనందయ్య కరోనా మందు పలు పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మెడికల్ మాఫియా మాటలను పక్కన పెడదాం. మామూలు మనిషి నుంచి విద్యావేత్తల వరకూ ఎందుకో ఆనందయ్య పట్ల ఒక విశ్వాసాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం  చాలామంది మూలాలు పల్లెటూర్లే. మొన్న మొన్నటి వరకూ ఇటువంటి చికిత్సలు, మందుల ద్వారానే చాలా రోగాలను ఎదుర్కొనేవారు. ఇంకొక పక్క భారతీయమైన ప్రాచీన ఆయుర్వేదంపై గౌరవం ఉంది. డబ్బులు గుంజకపోవడం, నా వైద్యమే అద్భుతమని చెప్పక పోవడం, నమ్మకం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అని కచ్చితంగా చెప్పడం, కరోనా కోసం తయారు చేస్తున్న మందులో వాడే పదార్ధాలన్నీ హానికరం కాకపోవడం, ఇప్పటికే ఈ మందు తీసుకున్నవారు కొందరు వైరస్ నుంచి కోలుకోవడం,30 ఏళ్ళ నుంచి కృష్ణపట్నం ప్రాంతంలో అతనికి మంచిపేరుండడం, ప్రత్యామ్నాయ మందులు, (ఇంగ్లీషు) వైద్యం అత్యంత ఖరీదైనదిగా ఉండడం మొదలైన కారణాలతో అనందయ్య మందుకు వేలాదిమంది ఎగబడుతున్నారని చెప్పాలి.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

నిజంగానే మంచి ఫలితాలు ఇస్తే…

నిజంగా, మందు తీసుకున్నవారికి మంచి ఫలితాలను ఇస్తే లక్షలమంది ఆనందయ్య మందు కోసం బారులు తీరుతారు. ప్రపంచ దేశాలన్నీ కృష్ణపట్నం వైపు చూస్తాయి. మంచి ఫలితాలను ఇస్తే  ఆనందయ్యను ప్రజలు దైవంగా/దైవదూతగా భావించి గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం లక్షల రూపాయలు దాటిపోవడం, ఒకవేళ ఆ వైద్యాన్ని పొందినా, నయమై బయటకు వస్తారనే విశ్వాసం తగ్గడం, ఎటువంటి దుష్ప్రభావాలు లేని, ఖరీదు కాని మందుగా ఆనందయ్య మందుకు ఆకర్షణ పెరుగుతోంది. వనమూలికలతో చేసే ఈ మందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం మంచి పరిణామం. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీ సీ ఆర్ ఏ ఎస్ ) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందదాయకం. కంట్లో వేస్తున్న మందుకు తప్ప   ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిపై కూడా మరో రెండు మూడు వారాల్లో నివేదిక రావచ్చునని తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత దాని వాడకం గురించి స్పష్టత వస్తుంది. ఆనందయ్య మందుతో ఎక్కువమందికి లబ్ధి చేకూరుతుందనే విశ్వాసాన్ని ఆయుష్ కమీషనర్ రాములు కూడా వ్యక్తం చెయ్యడం హర్షదాయకం. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంలో ఉందని ఆయన ప్రకటించారు. ఇది కూడా మంచి సందేశమే. అయితే, ఆనందయ్య మందు వల్ల కోవిడ్ తగ్గిందనేందుకు ఆధారం లేదని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్  అంటున్నారు. కానీ, ఎక్కువమంది ప్రజలు ఆ మందుపై విశ్వాసం పెట్టుకున్నారు.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

దుష్ప్రభావాలు  లేకపోవడమే సుగుణం

ప్రాథమికంగా, దీని వల్ల దుష్ప్రభావాలు లేకపోవడం, ఎంతోకొంత ఉపయోగపడుతుందనే విశ్వాసంతోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని భావించాలి. చాలా ఔషధాలు వనమూలికలతో తయారవుతున్నాయి. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన అనేక రకాల వైద్య విధానాలు ఉన్నాయి. డిగ్రీలు, కోర్సులు, అధికారికమైన అనుమతులు లేని ఇటువంటి వాటిని ‘నాటు మందులు’, నాటు వైద్యం అంటున్నారు. పేరు ఏదైతేనేమి? రోగాలు తగ్గి, దుష్ప్రభావాలు లేకపోతే చాలు. మొత్తం మీద, ఈ అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక యుగంలో “ఆనందయ్య మందు” పేరుతో వనమూలికలు, వంటింటి సరుకులు, పల్లెటూరి, నాటువైద్యానికి పెద్ద ప్రచారం వచ్చింది. ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో, వేటి మిశ్రమంతో దివ్య ఔషధం తయారవుతుందో, శోధించి, పరిశోధించి, పరీక్షించి, ఫలితాలను గమనిస్తే కానీ అర్ధమవ్వదు. ఆనందయ్య మందుల వల్ల కరోనా రోగుల కష్టాలు తీరి, ప్రాణాలు నిలబడితే అంతకంటే ఆనందమయమైన విషయం ఇంకేముంటుంది? ఇవ్వన్నీ ఇలా ఉండగా ఆనందయ్య మందు పేరుతో  కొన్ని నకిలీ మందులు కూడా తయారవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. నకిలీలను ప్రభుత్వం అరికట్టాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా, సుప్రసిధ్ధ చారిత్రక పరిశోధకులు, ఆచార్యుడైన మల్లంపల్లి సోమశేఖరశర్మపై ‘కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ చెప్పిన  “డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు రాని, పాడు కాలాన పుట్టి”.. అనే పద్య పంక్తులు గుర్తుకు వస్తున్నాయి. ఆనందయ్య మందు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షిద్దాం.

Also read: తాత్పర్యం లేని టీకాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles