Sunday, November 24, 2024

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

ఇరవై శతాబ్దం ప్రథమార్థంలో హైదరాబాద్ సంస్థానంలోని పరిస్థితులను అర్థం చేసుకున్నవారికి సురవరం ప్రతాపరెడ్డిగారి బహుముఖీనమైన ప్రతిభావిశేషాలు తేలికగా బోధపడతాయి. అప్పటి వరకూ అధికార భాషగా ఉన్న ఫార్శీ స్థానంలో ఉర్దూ రావడం, తెలుగు కంటే మరాఠీకి ప్రాధాన్యం ఉండటం, క్రమంగా నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా అంతర్జాతీయప పరిగణను పొందాలని భావించడం, ఖాసీ రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు విశేషాధికారలు మంజూరు చేయడం, తదితర కారణాల వల్ల స్వేచ్ఛలేని వాతావరణంలో బతుకులు వెళ్ళదీస్తున్నారు.

సీమాంధ్రప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉన్న కారణంగా చదువులూ, అభివృద్ధీ బాగున్నాయి. స్వాతంత్ర్య ఉద్యమం కూడా బ్రిటిష్ ఇండియాలో ఉధృతంగా సాగింది. ఇందుకు భిన్నంగా హైదరాబాద్ సంస్థానంలో నాలుగు శాతం అక్షరాస్యత ఉండేది. కళాశాలలు లేవు. పాఠశాలలు అతి తక్కువ. బోధనాభాషగా అధికార భాష అయిన ఉర్దూనే ఉండేది. వాక్సభాస్వాతంత్ర్యాలు లేవు. నిజాం ప్రభుత్వం నిఘా సమాజంపైన ఉండేది. కాస్త చదువుకున్నవారూ, స్వేచ్ఛాస్వాంతంత్ర్యాలను ఆకాంక్షిస్తున్నవారూ, బయటి ప్రపంచంలో సంబంధం ఉన్నవారూ బహుతక్కువ మంది. వారిలో ప్రతాపరెడ్డిగారు అగ్రగణ్యులు.

ప్రధానంగా సాహిత్యకారుడు

విభిన్న రంగాలలో అగ్రగామిగా ఉంటూ విశేష కృషి చేసిన ప్రతాపరెడ్డిగారు ప్రధానంగా సాహిత్యకారుడు. అందులోనూ సంపాదకుడు. మచిలీపట్టణం నుంచి వెలువడే కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు ఎంత గొప్ప సంపాదకులో అంతే గొప్పసంపాదకులు సురవరం ప్రతాపరెడ్డిగారు. కృష్ణారావుగారికి లేని పరిమితులూ, ఇబ్బందులూ ప్రతాపరెడ్డిగారికి ఉండేవి. ఆంధ్ర ప్రాంతంలో, హైదరాబాద్ సంస్థానంలోని కాలమాన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే కృష్ణారావుగారి కంటే ప్రతాపరెడ్డిగారి సంపాదకీయ ప్రాభవం గొప్పది. కానీ కృష్ణరావుగారికి వచ్చినంత పేరుప్రఖ్యాతులు ప్రతాపరెడ్డిగారికి రాకపోవడానికి తెలంగాణవారిలో ప్రచారకాంక్ష లేకపోవడం, అక్షరాస్యత అంతమాత్రం కావడం, తెలుగు పత్రిక చేతిలో పట్టుకోవడం కంటే ఉర్దూ పత్రిక పట్టుకొని తిరగడం గౌరవప్రదంగా భావించేరోజులు కావడం కారణం కావచ్చు.

తెలంగాణలో భూస్వాములకూ, జాగీర్ దార్లకూ మాత్రమే ఉండిన సౌలభ్యం ప్రతాపరెడ్డిగారికి అందుబాటులో ఉండటం మూలంగా ఆయన మద్రాసులో లా డిగ్రీ వరకూ చదువుకోగలిగారు. చదువుపై కంటే సాహిత్యం పైన మక్కువ ఎక్కువ. చిన్నతనంలో ఎక్కాలు వచ్చేవి కావు. ఎఫ్ ఏలో లాజిక్కు అంతుబట్టలేదు. మొత్తంమీద చదువులో అంత ప్రతిభ కనబరచకపోయినప్పటికీ చిన్నాన్న రామకృష్ణారెడ్డిగారి పట్టుదల వల్ల లా డిగ్రీ సంపాదించారు. కానీ ప్రాక్టీసు చేసి డబ్బు సంపాదించాలన్న తాపత్రయం బొత్తిగా లేదు. సాహిత్యం, సమాజసేవకే జీవితం అంకితం చేశారు. తన వంటి వారు ఎక్కువ మంది తెలంగాణలో లేనికారణంగా ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాలలో అనేక బాహువులతో బహూముఖీనమైన కృషి చేశారు. ఏ రంగంలోనూ తాను సైతం పాల్గొన్నట్టు కాకుండా, ‘ఆల్ సో రాన్’ లాగా కాకుండా, అన్ని  రంగంలలోనూ ముందుండి ఉద్యమాలు నడిపించడం ప్రతాపరెడ్డిగారి విశిష్టత. కొమర్రాజు లక్ష్మణరావుగారూ, మాడపాటి హనుమంతరావుగారూ, బూర్గుల రామకిషన్ రావుగారూ, సురవరం ప్రతాపరెడ్డిగారు భావసామ్యం కలిగిన మేధావులుగా, నాయకులుగా, వైతాళికులుగా తెలంగాణను జాగృతం చేసినవారిలో ముఖ్యులు. వీరికి మునగాల రాజాగారూ, కోత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డిగారు మద్దతు పూర్తిగా ఉన్నది. రాజ్యం నుంచి పరిమితులనూ, ప్రతిబంధకాలనూ ఎదుర్కొంటూనే దేశభక్తినీ, ఆంధ్రభాషాభిమానాన్నీ, స్వతంత్ర కాంక్షనూ నూరిపోస్తూ వీరు ప్రమాదపుటంచుల్లో నడుస్తూ ఉద్యమాలు నడిపించారు. ప్రతాపరెడ్డిగారు సాహిత్యకృషీవలుడూ, వక్త, దేశభక్తుడు, విజ్ఞాని, పరిశోధకుడు, పాత్రికేయుడూ, పరిపాలనా దక్షుడు, ఉద్యమశీలి, సంస్కరణవాది, ప్రయోక్త.

బాల్యంలోనే సంస్కృతం

సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, బాల్యంలోనే సంస్కృతం అభ్యసించి, రఘువంశము, కుమార సంభవము, భారత చంపు, కిరాతార్జునీయం మొదలైన గ్రంథాలను వల్లెవేశారు. చిన్నతనం నుంచి కసరత్తుపైన ధ్యాసపెట్టినారు. పినతండ్రి రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో ఎఫ్ఏ, బీఎ, బీఎల్ చదివారు. బీఏలో గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారూ, పివి రాజమన్నార్ ప్రతాపరెడ్డిగారి సహాధ్యాయులే. వేదం వెంకటశాస్త్రిగారి దగ్గర సంస్కృతాంధ్రములు అభ్యసించాలంటే వారు ఒక షరతు విధించారు. మాంసాహారము త్యజించమని చెప్పారు. అప్పుడు విడిచిపెట్టిన మాంసాహారం జీవితాంతం ముట్టలేదు. మద్యం, ధూమపానం వంటి దురలవాట్లు లేనేలేవు. మానవల్లి రామకృష్ణ కవి సూచన మేరకు ఉత్తరహరివంశం, దశకుమార చరిత్ర, కేయూర బాహు చరిత్ర వంటి గ్రంథాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. బిపిన్ చంద్రపాల్, రవీంద్రనాథ్ టాగూర్, ఆండ్రూస్, సరోజినీదేవి, మహాత్మాగాంధీ వంటి నేత ఉపన్యాసాలు విని ప్రతాపరెడ్డిగారు ఉత్తేజితులైనారు. మద్రాసులో చదువుకుంటున్న రోజులలోనే సాహితీప్రముఖులతో సాంగత్యం ఏర్పడింది. కొత్తగా వెలువడిన గ్రంథాలను చదివి, వాటిపైన చర్చించడం ఒక అలవాటుగా మారింది.  సత్యాగ్రహ ఉద్యమం, అహింసా సిద్ధాంతం, ఖద్దరు వస్త్రధారణం, మద్యపాన నిషేధం వంటి సిద్ధాంతాలు వారిని విశేషంగా ఆకర్షించాయి. స్వతంత్ర్యేచ్ఛ, సత్యనిష్ఠ, నిరాడంబరత ఆయన జీవన సూత్రాలై చివరి వరకూ పాటించారు. నిర్మలమైన మనసు. ముక్కుకు సూటిగా వెళ్లే మనస్తత్వం. ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడటం, రాయడం అలవాటయింది. ఏ పని ప్రారంభించినా సమర్థంగా నిర్వహించాలనే పట్టుదల ఉండేవి. క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.

బోరవెల్లిలో జననం

పాత్రికేయుడుగా, ఉద్యమకారుడిగా, సంస్థల వ్యవస్థాపకుడుగా, నిర్వాహకుడిగా, పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా, కథా రచయితగా, నాటిక, నాటక, నవలా రచయితగా, కవిగా, చరిత్ర పరిశోధకుడుగా,  జీవితచిరిత్ర రచయితగా, మరెన్నో విధాలుగా ప్రతాపరెడ్డిగారి జీవన ప్రస్థానం బహుముఖంగా సాగింది. 28 మే 1896 నాడు గద్వాల సంస్థానానికి రాజధాని బోరవెల్లి గ్రామంలో మాతామహుల ఇంట నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించిన తర్వాత తాతపేరు పాపిరెడ్డిగా నామకరణం జరిగింది. ఆ తర్వాత ప్రతాపరెడ్డిగా పేరు మారింది. ఆయనకు తండ్రే ప్రథమ గురువు. తండ్రి గొప్ప క్రమశిక్షణతో చదువు చెప్పారు. అక్షరాలు గుండ్రంగా రాయాలని పట్టుబట్టేవారు. లేకపోతే వీపు విమానం మోత మోగించేవారు. ప్రతాపరెడ్డిగారికి 16 ఏళ్ళు ఉన్నప్పుడే తండ్రి నారాయణరెడ్డి దివంగతులైనారు.  పినతండ్రి రామకృష్ణారెడ్డిగారు ప్రతాపరెడ్డిగారిని కర్నూలు తీసుకొని వెళ్ళి ఎబిఎం మిషనరీ పాఠశాలలో నాలుగో తరగతిలో చేర్పించారు. తర్వాత హైదరాబాద్ లో ఎఫ్ ఏ చదివారు. బీఏ చదువకు మద్రాసు వెళ్ళారు. అక్కడే బీఎల్ కూడా పూర్తి చేశారు. 1917లో గౌని రెడ్డెన్నగారి కుమార్తె పద్మనాభమ్మ (పద్మావతి)తో ప్రతాపరెడ్డి వివాహం జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 20.

విద్యార్థిగానే రచనావ్యాసంగానికి శ్రీకారం

మద్రాసులో చదువుకునే రోజులలోనే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. ‘‘పినాకిని’, ‘‘కళ,’’ ‘‘రెడ్డిరాణి’’ వగైరా మాసపత్రికలలో వైవిధ్యభరితమైన వివిధ చారిత్రాత్మక, విమర్శక, సంస్కరణవాద వ్యాసాలు  ప్రకటించారు. ఆ రోజుల్లో రాసిన హరిజనోద్ధరణ, మద్యపాన నిషేధం వంటి కొన్ని వ్యాసాల సంకలనమే ‘‘సంఘోద్ధరణము.’’ 57 వత్సరాల జీవితంలో మూడు దశాబ్దాలపాటు ఉపన్యాసకుడుగా హైదరాబాద్ సంస్థానం అంతటా పర్యటించారు.

ప్రతాపరెడ్డిగారి రచనలలో హిందువుల పండుగలు, రామాయణ విశేషములు, సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి కథలు, సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు రెండు భాగాలు, గోల్కొండ పత్రిక సంపాదకీయాలు రెండు భాగాలు, ప్రజాధికారములు (పూర్వం పౌరస్వత్వములు అనే పేరుతో ప్రచురితం) ప్రముఖమైనవి. శుద్ధాంతకాంత అనే నవలకు మంచి పేరు వచ్చింది. 1942లో వచ్చిన బెంగాలీ కరువుపైన బిబౌనీ భట్టాచార్య బెంగాలీలో రాసిన నవలకు తాతాచార్యులు తెలుగులోకి అనువదిస్తే దానిని ‘ఆకలి’ పేరుతో సురవరంవారు ప్రచురించారు. దేశవ్యాప్తంగా 15 మంది వీరుల వృత్తాంతాలను రచించి హైదవధర్మవీరులు అనే గ్రంథం ప్రచురించారు. సురవరంగారు రచించిన ‘నిరీక్షణ’ అనే కథ చాలా భాషలలోకి అనువదించారు. మొగలాయి కథలు రాశారు. పరుసవేది, మిత్రుడా, తెలుగువాడు, ధర్మశాల అనే గ్రంథాలు రాశారు. సోమనాథ దేవాలయాన్ని నేలమట్టం చేసిన మహమ్మద్ ఘజనీపైన ‘హంవీర సంభవం’ పేరుతో 135 పంక్తుల గీతమాలిక రాశారు. నిజాంకాలేజిలో ఎఫ్ఏ చదువుతున్న రోజుల్లోనే గై బూత్బీ రచించిన ఆంగ్ల ‘ఎ బిడ్ ఫర్ ఫ్రీడమ్’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. భావకవి రామమూర్తి, గద్వాల సిద్దాంతి, వెర్రివెంగళప్ప, యుగపతి, చిత్రగుప్త, సంగ్రామసింహ అనే గుప్తనామాలతో (కలంపేర్లు) అనేక కథలూ, వ్యాసాలు పత్రికలలో ప్రచురించారు.

మద్రాసులో చదువుకునే రోజులలో జాతీయోద్యమంలో పాల్గొన్న కాలం నుంచి లెక్కవేస్తే 1920ల నాటి నుంచి 1953లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడిగా మరణించేవరకూ సుమారు 35 సంవత్సరాల పాటు ప్రజాజీవితంలో నిరంతరాయంగా ఉండటం విశేషం. జాతీయోద్యమం, ఆంధ్రజనసంఘం, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ, రెడ్డిజనసంఘ్, రెడ్డి బాలుర వసతి గృహం. యాదవసంఘం, ముదిరాజ్ సంఘం, గౌడసంఘం, వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, గ్రంథాలయాల స్థాపన, గ్రంథాలయ మహాసభలు, గ్రంథాలయోద్యమసంఘంలో నాయకత్వం, గోలకొండ పత్రియ, ప్రజావాణి, విజ్ఞానవర్థినీ పరిషత్తు, ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్ర విద్యాలయం, హైదరాబాద్ ఆయుర్వేదసంఘం, కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, లక్షణరాయ పరిశోధక మండలి, హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ వంటి అనేక సంస్థలలో నాయకత్వ స్థాయిలో పని చేశారు ప్రతాపరెడ్డిగారు.

సామాన్య ప్రజల జీవితాంశాలే సాంఘిక చరిత్ర

ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సామాన్య ప్రజల చరిత్ర రాశారు. రాజులూ, రాణులూ, కోటలూ, మహాపురుషుల చరిత్ర కాకుండా సామాన్య మానవుల జీవితాల గురించి రాశారు. ‘‘రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన  అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలకంరణములతో నుండిరో , మన  పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగి యుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు, దోపిడీ చేసినప్పుడు, క్షామాదీతిబాధలు కలిగినప్పుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాలకే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతికలవారై యుండిరో…’’ తెలుసుకోవాలని మనకు కుతూహలం ఉంటుందని అన్నారు. ‘మనమందరమూ చరిత్రకెక్కదగినవారమే’ అని ఆయన ప్రకటించారు. తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసానికి ప్రతాపరెడ్డిగారు గణనీయమైన కృషి చేశారు. బ్రిటీషాంధ్రలో బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంలో భాగంగా ఇతిహాసాలను పరిశీలించే ధోరణి కనిపించింది. వాల్మీకి రామాయణమే కాకుండా జైన, బౌద్ధ రామాయణాలను పరిశీలించి ప్రతాపరెడ్డిగారు రామాయణ విశేషాలు అనే గ్రంథం రాశారు. రాముడికి సీత ఏమౌంతుంది?’ అని ఆరుద్ర రాసిన గ్రంథంలో ప్రశ్నించడానికి ముందే ప్రతాపరెడ్డి ఆ పని చేశారు. కానీ దానికి తగిన ప్రచారం రాలేదు. ముందుగా వ్యాసాలు చిదిరె మఠం వీరభద్రశర్మగారి ‘విభూతి’ పత్రికలో ప్రచురించారు. త్రిపురనేని రామస్వామిలాగా కరాఖండిగా మాట్లాడం, రాయడం ప్రతాపరెడ్డిగారు చేయలేదు.  రామాయణాన్ని తెగనాడటం, విమర్శించడం కాదు కానీ విమర్శనాత్మక దృష్టితో, హేతువాద కోణంలో ఆ ఇతిహాసాన్ని పరిశీలించారు. ‘‘విమానములు రథభేదములు. దక్షిణ దేశములో వాస్తుశాస్త్ర పరిభాషలో దేవాలయములపై నిర్మింపబడు గోపురములను విమానములందురు. యానములపై అట్టి గోపురములగు కప్పులుండినట్టివి విమానములై యుండెను. అంతేకాని ఆ కాలములో ఆకాశయానములుండెనని తలచుటకు వీలులేదు. ఆకాశములో విమానములో పోయినవాడు రావణుడొక్కడే. రావణునికి పది తలలు, లోకాతీతశక్తి మున్నగు విషయాలెన్నో వర్ణించినప్పుడు అతనికి ఆకాశయానము కూడా కల్పించులో కవి సృష్టి సామర్థ్యము కానవచ్చుచున్నది,’’అంటూ హైందవధర్మవీరులు అనే గ్రంథంలో అంటారు. 21వ శతాబ్దంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పూర్వకాలంలో భారతవర్షంలో ప్లాస్టిక్ సర్జరీలు జరిగేవని అంటున్నారు. అటువంటి భ్రమలు పెట్టుకోవద్దని ప్రతాపరెడ్డిగారు ఎనభై సంవత్సరాల కిందటే స్పష్టంగా చెప్పినారు.

కోత్వాల్ వెంకట్రామరెడ్డితో సాన్నిహిత్యం

తమ బంధువుపై మహబూబ్ నగర్ పోలీసు స్టేషన్ లో పెట్టిన కేసును కొట్టేయించాలని తన చిన్నాన్న ఆదేశించిన కారణంగా ప్రతాపరెడ్డి హైదరాబాద్ వెళ్ళారు. కోత్వాల్ వెంకట్రామరెడ్డిగారిని కలుసుకున్నారు. రెడ్డి జనసంఘ్ అనే సంస్థను నెలకొల్పి దాని తరఫున రెడ్డి హాస్టల్ ను ప్రారంభించాలని తలపోస్తున్న కోత్వాల్ గారికి ప్రతాపరెడ్డి సేవలను వినియోగించుకోవాలని అనిపించింది.  ప్రతాపరెడ్డి కోరిన సాయం చేయాలంటే తాను చెప్పినట్టు రెడ్డిహాస్టల్ బాధ్యత స్వీకరించాలని వెకట్రామరెడ్డిగారు షరతు విధించారు. ప్రతాపరెడ్డి అందుకు అంగీకరించి, తాను జీతం లేకుండా పని చేస్తాననీ, వసతి గృహ నిర్వహణకు నియమావళి రూపొందిస్తాననీ, దాని అమలులో పూర్తి స్వేచ్ఛ తనకు కావాలనీ కోరారు. అందుకు కోత్వాల్ గారు అంగీకరించారు. తొలుత వెయ్యి పుస్తకాలు మాత్రమే ఉన్న రెడ్డిహాస్టల్ గ్రంథాలయంలో పుస్తకాల సంఖ్యను 11వేలకు పెంచారు. విద్యార్థుల వేషభాషలలో చక్కని మార్పు వచ్చింది. తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు, సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినవారు చాలామంది ఈ హాస్టల్ లో ఉండి చదువుకున్నవారే. 1924లో రెడ్డిజనసంఘ్ బాధ్యతలు చేపట్టి పదేళ్ళపాటు నిరాఘాటంగా కొనసాగించారు. కానీ ప్రభుత్వం నిషేధించిన, వీరసావర్కర్ రచించిన వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’ గ్రంథం వందలకాపీలు హాస్టల్ ఉండటం గమనించి ప్రతాపరెడ్డిగారు కోత్వాల్ వెంకట్రామరెడ్డిగారి దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఆయన దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ పుస్తకం విషయం రెసిడెన్సీ పోలీసులకు తెలియడం, వసతి గృహ నిర్వాహకులలో కొందరు అసూయాపరులు ప్రతాపరెడ్డిగారిపైన చాడీలు చెప్పడంతో విసుగుపుట్టి రెడ్డిహాస్టల్ వార్డెన్ పదవి నుంచి తప్పుకున్నారు.

ప్రథమాంధ్ర మహాసభలు

ప్రథమాంద్ర మహాసభలు 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డిగారి అధ్యక్షతన జరిగాయి. హైదరాబాద్ సంస్థానం నలుమూలల నుంచి అనేకమంది ఉద్యమకారులు ఆ సభలలో పాల్గొన్నారు. అంబేడ్కర్ కంటే ముందుగానే దళితోద్యమ స్ఫూర్తిని పెంపొందించిన భాగ్యరెడ్డి వర్మను మాడపాటి హనుమంతరావు తీసుకొని వచ్చారు. భాగ్యరెడ్డి వర్మ సారథ్యంలో బాల్య వివాహాలకూ,అంటరానితనానికీ, మద్యపాన సేవనానికీ వ్యతిరేకంగా వివిధ బృందాలు బుర్రకథలు, పాటల ద్వారా ప్రచార కార్యక్రమాలు జరిగాయి. సభకు భాగ్యరెడ్డి వర్మ హాజరు కావడంపైన సనాతనవాదులు కొందరు అభ్యంతరం తెలిపారు. ప్రతాపరెడ్డి, మరో సంఘ సంస్కర్త వామననాయక్ సభికులను శాంతబరిచి సభ మధ్య నుంచి భాగ్యరెడ్డివర్మ వచ్చేందుకు వీలుకల్పించారు. సనాతనవాదుల ధోరణిని సురవరం పూర్తిగా వ్యతిరేకించి దళితుల పక్షం వహించారు. భాగ్యరెడ్డివర్మ రాసిన వ్యాసాలకు గోలకొండ పత్రికలో ప్రచురించేవారు. ఆయన సభలకు ప్రతాపరెడ్డిగారు అధ్యక్షత వహించేవారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తూనే ఇతర కులాలవారినీ ప్రోత్సహించేవారు. రెడ్డి విద్యార్థుల వసతి గృహాన్ని నిర్వహిస్తూనే గౌడ, ముదిరాజు, వైశ్య, పద్మశాలి, మున్నూరుకాపు హాస్టళ్ల ఏర్పాటును ప్రోత్సహించారు.

ఆంధ్రమహాసభలలో తెలుగు భాషకు ప్రాధాన్యం లేకపోవడం పట్ల ప్రతాపరెడ్డిగారు నిరసన ప్రకటించారు. విబి రాజుతోనూ, మరికొందరితోనూ కలిసి వేరు కుంపటి పెట్టారు. కానీ అది ఎక్కువ కాలం నిలువలేదు. తెలుగులోనే మాట్లాడాలని ప్రతాపరెడ్డి, ఇతర యువకులూ పట్టుపడుతూ ఉంటే కొండా వెంకటరంగారెడ్డి వంటి వారు ఉర్దూలో, కన్నడలో మాట్లాడటాన్ని అనుమతించేవారు. ఆంధ్రమహాసభలకు ప్రతాపరెడ్డిగారు క్రమంగా దూరమైనారు.

గోలకొండ పత్రిక సంపాదకత్వం

రెడ్డిహాస్టల్ నిర్వహణ ప్రతాపరెడ్డిగారు చూస్తున్న కాలంలోనే కోత్వాల్ వెంకట్రామరెడ్డిగారూ, మాడపాటి హనుమంతరావుగారూ ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక తెలుగు పత్రికను నెలకొల్పాలని సంకల్పించి దానికి సంపాదకుడిగా ప్రతాపరెడ్డిగారు బాధ్యతలు స్వీకరించారని కోరారు. సారస్వతానురక్తి మొదటినుంచీ కలిగిన రెడ్డిగారు నాటి స్వేచ్ఛారహిత, బానిస వాతావరణంలో జనాన్ని జాగృతం చేయాలనే సంకల్పంతో గోలకొండ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. వెంకట్రామరెడ్డిగారు ఏడుగురు పరిచయిస్తుల నుంచి ఏడు వేల రూపాయలు విరాళంగా సేకరించి పత్రిక నిర్వహణకు ఇచ్చారు. ప్రతాపరెడ్డిగారే మద్రాసు వెళ్ళి అచ్చుయంత్రాన్ని కొనుగోలు చేసుకొని తెచ్చారు.  నిధుల అంతగా లేవు. హంగూఆర్భాటం లేదు. ఉద్యోగులు పెద్దగా లేరు. సంపాదకుడూ, రచయితా, కంపోజర్,  ప్రూఫ్ రీడర్, ప్రింటర్, గుమాస్తా, అటెండర్ పనులన్నీ ఆయనే చేసుకునేవారు. మొదట వారానికి రెండు సంచికలు తెచ్చేవారు.

సీతారామచంద్రరావు, రాఘవరంగారావు అనే ఒద్ధిరాజు సోదరులు ఇనుగుర్తిలో గ్రంథమాలను నెలకొల్పారు. బొంబాయిలో ప్రచురించిన ఆంధ్రపత్రిక సంచికలు తెప్పించుకునేవారు. వాటిని మునగాల సంస్థానాధీశుడు రాజా నాయని వెంకట రంగారావుకి 1911లోనే తమ ఇంటిని సందర్శించినప్పుడు చూపించారు. తెలంగాణలో గోలకొండ పత్రిక రాకముందు హితబోధిని (1913), ఆంధ్రమాత (1917) అనే మాస పత్రికలు ఉండేవి.  నీలగిరి 1922లో ప్రారంభమైంది. అది వారపత్రిక. రెండో వారపత్రిక తెనుగుపత్రిక. గోలకొండ పత్రిక ద్వైవారపత్రిక. ప్రతి సోమవారం, బుధవారం వెలువడేది. అప్పటికే తెలంగాణ ప్రజల అవగాహన పెంచేందుకు మరొక పత్రిక అవసరమనే అభిప్రాయం చాలామందిలో ఉన్నది. 10 మే 1926న ఈ పత్రిక ప్రారంభమైంది. పత్రికకి ‘దేశబంధు’ అని పేరు పెట్టాలనుకున్నారు దేశబంధు చిత్తరంజన్ దాస్ పట్ల గౌవరంగా. కానీ నిజాం ప్రభుత్వం ఆ పేరును ఆమోదించదనే ఉద్దేశంతో గోలకొండ పత్రికగా నామకరణం చేశారు. ప్రభుత్వం అనేక షరతులు విధించింది. ప్రభుత్వాన్ని ధిక్కరించి పత్రిక మనుగడ సాగించే అవకాశం లేదని ప్రతాపరెడ్డిగారికి తెలుసు. ఉన్న పరిమితులకు లోబడి తెలుగు భాషాభిమానాన్నీ, దేశాభిమానాన్నీ ప్రోది చేయాలని సంకల్పించారు. అవసరం అనుకున్నప్పుడు నిజాం ప్రభుత్వాన్ని పరుషంగానే విమర్శించారు. పట్టువిడుపులు ప్రదర్శించేవారు. చెట్టు ఎక్కి మొదలు నరుక్కోవడం అవివేకమని ఆయనకు తెలుసు.

పత్రిక పెట్టి ప్రజలను మేలుకొల్పాలనే సంకల్పం ఉన్నది కానీ పత్రికలో పని చేసిన అనుభవం కానీ, పత్రికను నడిపిన అనుభవంకానీ ప్రతాపరెడ్డిగారికి లేదు. అందుకని చాలాకాలంగా ఉన్న స్థానిక ఉర్దూ దినపత్రిక ‘‘ముషాయిరే దక్కన్’’కు సంపాదకుడిగా పని చేస్తున్న కిషన్ రావుగారితో పత్రికానిర్వహణపై మాట్లాడారు. సకలవార్తల సమాహారమే వార్తాపత్రిక అని కిషన్ రావుగారు ముక్తసరిగా చెప్పారు. నిజాం రాజ్యంలో పరిమితులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సలహా చెప్పారు. ఆ తర్వాత చాదర్ ఘాట్ హైస్కూలుకు వెళ్ళి కొత్తగా బొంబాయి నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ఎక్బాల్ గారిని కలుసుకున్నారు. ఆయన హైదరాబాద్ రాకముందు బొంబాయిలో కొంతకాలం ఒక పత్రికను నిర్వహించారు. కోర్టులో కేసులు ఎదుర్కొన్నారు. నాటి అనుభవాలు పంచుకున్నారు. పత్రికా సంపాదకుడంటే ఒక న్యాయమూర్తిలాంటి వాడని ఆయన చెప్పారు. నిస్పక్షపాతంగా ఉండాలనీ, ఉదారంగా వ్యవహరించాలనీ చెప్పారు.

ఆంధ్రభాషాసేవ

‘‘మేము మా పత్రికాస్థాపన కాలము నుండియు రెండంశములు దృష్టిపథమునందుంచుకొని దేశీయుల సేవ చేయుచున్నాము. మొదటిది ఆంధ్రభాషాసేవ, రెండవది జాతి, కుల వివక్షత లేక నస్పక్షపాతముగా ఆంధ్రులలో సర్వశాఖలవారి యొక్క సత్వరాభివృద్దికూ పాటుపడుట’’ అని 9 మే 1931నాటి సంపాకీయంలో స్పష్టం చేశారు.

‘‘మన ఆంధ్రపత్రికలు ఇచ్చటి ఉర్దూ పత్రికల కన్న తక్కవయైనవి కావని ఘంటాపథముగా చెప్పగలము. కాని అదేమి వ్యామోహమో అనేకాంధ్రులు చదువలేకున్ననూ ఉర్దూ పత్రికను చేబట్టిన, అది కేవలము హస్తభూషణకు కాక గౌరవప్రదమని కూడా తలంతురు. మేనత్తకు మీసములతికించినంత మాత్రమున పిన్నబ్బ కానేరదు.’’ (సంపాదకీయము 9 మే 1931).  కోదాటి నారాయణరావుగారు ఈ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా పనిచేశారు. ప్రతాపరెడ్డిగారు యువరచయితలను ప్రోత్సహించేవారు. వారి రచనలను దిద్దేవారు. చదివేవారు. చదివించేవారు. కొత్తపుస్తకం వచ్చిందంటే అది చదివేవరకూ నిద్రపోయేవారు కాదు.  తిరుమల రామచంద్ర, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు, దేవులపల్లి  రామానుజరావు, దాశరథి వంటి వారు ప్రతాపరెడ్డిగారి నవలలనూ, కవితలనూ, వ్యంగ్యాస్త్రాలనూ, నాటకాలనూ చదివి ప్రశంసించేవారు.

సంపాదకుడుగా పని చేస్తున్నప్పటికీ చదువుకున్న బీఎల్ ని సార్థకం చేయాలంటూ చిన్నాన్న రామకృష్ణారెడ్డి పోరు పెట్టడంతో ప్రతాపరెడ్డిగారు మళ్ళీ ప్రాక్టీసు పెడతానంటూ స్వగ్రామం వెళ్ళారు. ప్రాక్టీసు చేయడం ఇష్టం లేక ఇటికాలపాడులోనే కూర్చొని సంస్కృత రామాయణాలన్నిటినీ పరిశీలించి విమర్శనాత్మక దృష్టితో ‘‘రామాయణ విశేషాలు’’ అనే గ్రంథం రాశారు. ప్రతాపరెడ్డికి వకీలుగా ప్రాక్టీసు చేయడం ఇష్టం లేదనీ, ఆయన మనసంతా చదువుమీదా, సాహిత్యమీదనే ఉన్నదని గ్రహించిన చిన్నాన్న తిరిగి హైదరాబాద్ వెళ్ళి గోలకొండ పత్రికలో పని చేయడానికి అంగీకరించారు. అయితే, కొంత కాలం కోర్టులో ప్రాక్టీసు చేయాలని చెప్పారు. ఆ మేరకు ప్రతాపరెడ్డిగారు కోర్టు వారి ‘సనదు’ సంపాదించారు.  కోర్టులో ప్రాక్టీసు చేయడం వల్ల సంపాదకుడుగా ప్రతాపరెడ్డి పేరు వేసుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు. కోత్వాల్ వెంకట్రామరెడ్డి గారి అనుమతితో ప్రింటర్ గా గడ్డంపల్లి రామకృష్ణారెడ్డినీ, ఎడిటర్ కొండా బాలకృష్ణారెడ్డినీ పెట్టి పని మొత్తం ప్రతాపరెడ్డిగారే చేసేవారు.

చేతికందిన ఇద్దరు కుమారులూ 1939లో చనిపోవడంతో ప్రతాపరెడ్డిగారు హతాశుడైనారు. భార్య పద్మావతి మంచంపట్టారు. ఉద్యోగానికి సెలవు పెట్టి ఇటికాలపాడు వెళ్ళారు. అదే అదను అనుకొని కొండా బాలకృష్ణారెడ్డి గోలకొండ పత్రికను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. తాను నామమాత్రపు సంపాదకుడుగా ఉండబోననీ, తనకు నెలకు ఇంత అని జీతం చెల్లించాలనీ,పత్రిక వ్యవహారాలన్ని ఇకపైన తానే చూసుకుంటాననీ పత్రిక నిర్వాహక మండలి సమావేశంలో చెప్పడంతో మండలి సభ్యులు ప్రతాపరెడ్డిగారిని హైదరాబాద్ రావలసిందిగా అత్యవసరంగా పిలిపించారు. 3 ఆగస్టు 1939 నుంచి సురవరం ప్రతాపరెడ్డిగారు తన పేరును గోలకొండ పత్రిక సంపాదకుడిగా మళ్లీ వేసుకున్నారు.

గోలకొండ పత్రికను దినపత్రికగా 1947లో మార్చారు. అంతకు మందు పత్రిక వాటా ధనం పెంచారు. వాటాదార్లను పెంచారు. ఎక్కువ వాటాలు వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వరరావు తీసుకున్నారు. పత్రికలో ఆయన మాట విలువ పెరిగింది. ఏడాది కాకుండానే సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డిని తొలగించి నూకల నరోత్తమరెడ్డిని నియమించారు. ప్రతాపరెడ్డిగారు 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించారు. కొన్ని సంచికలు వచ్చి ఆ పత్రిక ఆగిపోయింది.

సంపాదకీయాల ప్రాసంగికత

సురవరం ప్రతాపరెడ్డిగారు తప్పుకున్నాక ఇరవై సంవత్సరాలపాటు గోలకొండ పత్రిక నడిచినప్పటికీ అది ఆయన పెట్టిన వరవడిలోనే సాగింది. ఆయన పత్రికగానే పాఠకులు భావించేవారు. సంపాదకుడుగా ఉన్నంత కాలం స్వేచ్ఛగా, ధైర్యంగా సంపాదకీయాలూ, వ్యాసాలూ రాసేవారు. ‘‘గులాం సంస్కృతిపై…,’’ ‘‘వందేమాతరం,’’  ‘‘బాల్యవివాహ నిషేధం,’’ ‘‘ముల్కీభాష పోషణ,’’ ‘‘కమ్యూనిస్టుల దృక్పథం,’’ ‘‘విద్యావిధానం,’’ ‘‘మనస్థితిగతులు,’’ ‘‘ఆంధ్రభాషాపోషణము,’’ ‘‘ఆధునికాంధ్ర రచయితలకు హెచ్చరిక,’’ ‘‘ఆంధ్రమహాసభలు,’’ ‘‘నిరుద్యోగ సమస్య’’  ‘‘మన పల్లెల గతి ఏమిటి?’’ ‘‘ఇంగ్లాండునకు పోవు విద్యార్థులు’’ వంటి పదునైన, అర్థవంతమైన, ప్రాసంగికమైన శీర్షికలతో సంపాదకీయాలు రచించేవారు. గిడుగు రామమూర్తి, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు నిర్యాణం సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ సంపాదకీయాలు రాశారు. సంపాదకీయాలలో ఒదగని విస్తృతాంశాలపైన  వ్యాసాలు రచించారు.

‘‘గోలకొండ సంపాదకీయాలు అద్భుతం. నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహాసంస్థ. గాఢాంధకారంలో కాంతిరేఖ గోలకొండ పత్రిక’’ అని దాశరథి తన యాత్రాస్మృతిలో రాశారు. ప్రత్యేక సంచికలు తెచ్చే సంప్రదాయాన్ని ప్రతాపరెడ్డిగారు ఆ రోజుల్లోనే మొదలు పెట్టారు. సాహిత్య, సాంస్కృతిక అంశాలపైన ప్రత్యేక సంచికలు తెచ్చేవారు. సంపాదకుడుగా ప్రతాపరెడ్డి ప్రశంసలను అందుకున్నారు. విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఆ నాడు కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రతాపరెడ్డిగారు సమర్థించలేదు. తరచుగా కమ్యూనిస్టులను విమర్శిస్తూ వ్యాసాలు ప్రచురించేవారు. ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు మాటల్లో చెప్పాలంటే, ‘‘సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వంలో నడిచే గోలకొండ నూటికి నూరుపాళ్ళు కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక. మితవాదులను, జాతీయపక్షంవారిని అదేపనిగా సమర్థించేది.’’ ముఖ్యంగా 1955లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆంధ్రప్రభ సంపాదకుడిగా నార్ల వెంకటేశ్వరరావు, ఆంధ్రపత్రిక సంపాదకుడిగా పండితారాధ్యుల నాగేశ్వరరావు కమ్యూనిస్టులను అడ్డగోలుగా విమర్శించేవారు. ఉద్యమ సదృశంగా వారి పాత్రికేయం నడిచింది. కమ్యూనిస్టు పార్టీ పరాజయంలో వారి పాత్ర ఎంతో కొంత ఉంది. ప్రతాపరెడ్డిగారు సంపాదకుడిగా ఉన్న కాలంలో అటువంటి ఎన్నికలు జరగలేదు. జరిగినా ఆయన ఒక పార్టీకి అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో ఉద్యమసృశంగా పత్రికను నడిపే మనస్తత్వం ఉన్నవారు కాదు.  

హైదరాబాద్ లోబ్రిటిష్ రెసిడెన్సీ సమీపంలో ట్రూప్ బజారులోని ఒక చిన్న పెంకుటింట్లో, చిన్నగదిలో మేజాబల్ల దగ్గర కూర్చొని సంపాదకీయం రాస్తూనో, ప్రూఫ్ లు దిద్దుకుంటూనో, కొత్త పుస్తకం చదువుతూనే, ఎవరైనా వస్తే వారితో మాట్లాడుతూనో సాదాసీదాగా, మామూలు వస్త్రధారణలో కనిపించేవారు ప్రతాపరెడ్డిగారు. ఆయనకు రెండు పక్కల రెండు బీరువాలలో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడం, ఉర్దూ, ఫారసీ గ్రంధాలు దొంతరలుగా ఉండేవి. ఈ భాషలన్నీ ఆయనకు వచ్చు. ఎదురుగా గోడపైన గురుతుల్యుడు వేదం వెంకటరాయశాస్త్రి, అళియ రామరాజు ఫోటోలు. వాటికి తోడు మీసాల కృష్ణుడి పోటో. కృష్ణుడికి మీసాలు ఉండేవనే సిద్దాంతం ప్రతాపరెడ్డిగారి  పరిశోధన ఫలితం.  మాడపాటి హనుమంతరావు, బూరగుల రామకృష్ణారావు, రావాడ సత్యనారాయణ, చెలమచర్ల రంగాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావు, చిదిరెమఠం వీరభద్రశర్మ, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, కేశవపంతుల నరసింహశాస్త్రి, బిరుదురాజు రామరాజు, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి, బి.వి. రమణారావు, దేవులపల్లి రామానుజరావు వంటి సాహిత్య, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల ప్రముఖులతో సమాలోచనలు జరుపుతూ ఉండేవారు. తనకూ, గోలకొండ పత్రికకూ అభేదం పాటించి రేయింబవళ్ళూ దాని నిర్వహణలో నిమగ్నమై ఉండేవారు. సుజాత మాసపత్రికకు ప్రతాపరెడ్డిగారి పరోక్ష సహకారం ఉండేది.

సురవరం ప్రతాపరెడ్డిగారు ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావులకు దీటైన సంపాదకుడే కాదు కొమర్రాజు లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి ప్రసిద్ధ చరిత్రకారులు చేయని ‘‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’’పైన ఫలప్రదమేన పరిశోధన చేశారు. అంతే కాదు, నాటి తెలంగాణలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ప్రతాపరెడ్డిగారు ఆంధ్రప్రాంతంలో గురజాడ అప్పారావుగారి పనినీ, ఒక మల్లంపల్లి సోమశేఖరశర్మ పనినీ, ముట్నూరి కృష్ణారావుగారి పనినీ, ఒక త్రిపురనేని రామస్వామి పనినీ నిర్వహించారు. ఇందరు మహానుభావులు ఒక్కొక్క రంగంలో చేసిన  కృషిని ప్రతాపరెడ్డిగారు ఒక్కరే చేయవలసి వచ్చింది. ప్రతాపరెడ్డిగారు మాత్రమే కాకుండా శేషాద్రిరమణ కవులూ, వట్టికోట అళ్వారుస్వామి, ఆదిరాజు వీరభద్రరావు వంటివారు ప్రధానంగా సాహిత్యకారులైనప్పటికీ రాజకీయ, సామాజిక రంగాలలో కూడా పని చేశారు.

ఆంధ్రుల సాంఘిక చరిత్రకు నార్ల ప్రశంస  

నార్ల వెంకటేశ్వరరావుగారు ‘‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’’ను సమీక్షిస్తూ, ‘‘ఈ చరిత్ర దాదాపు ఒక జీవితకాలపు పరిశోధనా ముక్తఫలం. సాంఘిక చరిత్రకు పనికి వచ్చే గ్రంథాల సంఖ్య పరిమితమైనా, ఇందుకు శాసనాల ఉపయోగం నామమాత్రమైనా, ఆచారవ్యవహారాలకు, క్రీడా వినోదాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ పదాల విషయంలోనూ, పారిభాషిక పదాల విషయంలోనూ నిఘంటుకారులు ‘‘ఒక భక్ష్య విశేషం’’, ‘‘ఒక క్రీడా విశేషం’’ అని అర్థం చెప్పి, నిరర్థకుల వలె వ్యవహరించినా, ఇట్టి ప్రతిబంధకాలన్నింటిని అధిగమించి, ఆంధ్రజాతి చరిత్రను ప్రతిభాపూర్వకంగా చిత్రించిన శ్రీరెడ్డిగారు సంస్తవనీయులు’’ అని ప్రశంసించారు.

ప్రతాపరెడ్డిగారు రాసిన ఈ పుస్తకానికి దేశ స్వాతంత్ర్యానంతరం భారతీయ భాషల్లో రచించిన అత్యుత్తమ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు గ్రంథం ఇది. క్రీస్తు శకం 1050 నుంచి 1907 వరకూ 900 ఏళ్ళ చరిత్రను ఎనిమిది ప్రకరణాలలో నిక్షేపించారు. సారస్వతం, శాసనాలు, స్థానిక చరిత్రలు, విదేశీయుల రచనలు, కళా రూపాలు, నాణేలు, జనవ్యవహారంలోని కథలు, పాటలు పరిశీలించిన మీదగ ఈ గ్రంథం రాశారు. అదే విధంగా ఆయన రాసిన ‘‘రామాయణ విశేషములు,’’ ‘‘హిందువుల పండుగలు,’’ ‘‘ఆంధ్రలిపి సంస్కరణము’’ మొదలైన గ్రంథాలు ఆయన పరిశోధనా సామర్థ్యానికి గీటురాళ్ళు.  

కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణారావుగారికీ, గోలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డిగారికీ పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఉద్దండులే. ‘‘కృష్ణాపత్రిక దర్బారు’’ చాలామందికి తెలుసు. దానికి మించింది ‘‘గోలకొండ పత్రిక దర్బారు.’’ గోలకొండ పత్రికకు సాహిత్యలోకంలో రావలసినంత పేరు రాలేదు.

‘ఓయి నిజాము పిశాచమా’ అనీ, ‘మా నిజాము రాజు జన్మజన్మాల బూజు’ అనీ ఎలుగెత్తి కవితలు చెప్పిన దాశరథిని, ‘అన్యభాషలు నేర్చి, ఆంధ్రంబు రాదంచు , సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అని గొడవపడిన కాళోజీ వంటి కవులను ప్రతాపరెడ్డిగారు ఎంతగానో ప్రోత్సహించారు.  తణికెళ్ళ వీరభద్రుడు అద్భుతమైన మేధావిగా గుర్తింపు పొందారు. నందగిరి వెంకటరావు, భాస్కరభట్ల కృష్ణారావు వంటి యువకవులకు ప్రతాపరెడ్డి ప్రోత్సాహం ఉండేది. వెల్దుర్తి మాణిక్యరావు కూడా వీరితో సన్నిహితంగా  ఉండేవారు. ‘విభూతి’ పత్రిక సంపాదకుడు చిదిరెమఠం వీరభద్రశర్మ మరో ప్రతిభావంతుడైన సాహితీవేత్త. దాశరథి తన మహాంధ్రోదయం’ కావ్యాన్ని ప్రతాపరెడ్డిగారికి అంకితం ఇచ్చారు. ‘మూగబోయిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని’ అని ప్రతాపరెడ్డి రచనలను దాశరథి అభివర్ణించారు. ‘మూర్ఛబోయిన తెలుగు జాతి సంస్కృతికకి టీకాలు వేసిన మల్లినాధుడు (సంస్కృత మహాకావ్యాలకు భాష్యాలు రాసిన విమర్శకుడు, కవి)గా సి. నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

అడవి బాపిరాజు 1940 దశకంలో హైదరాబాద్ వచ్చారు. మూడు భాషలలో వచ్చే మీజాన్ లో తెలుగు మీజాన్ కు బాపిరాజు సంపాదకుడు. ఇతర రెండు భాషల మీజాన్ కంటే తెలుగు మీజాన్ కే స్వేచ్ఛ ఎక్కువ ఉండేది. బాపిరాజుకు తెలంగాణ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల అభిమానం ఉండేది. ఆంధ్రసారస్వత పరిషత్తు నిర్వహించిన అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. అణాగ్రంథమాల కోసం ‘అజంతా’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని బాపిరాజు రాసి పెట్టారు.

‘ఆంధ్ర బిల్హణ’ బిరుదాంకితుడు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి తెలుగు, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. చక్కని వక్త. ప్రతాపరెడ్డిగారు రాసిన ‘భక్తతుకారాం’ అనే నాటకాన్ని లక్ష్మణశాస్త్రి పరిష్కరించారు. వానమామలై వరదాచార్యులు, హిరాలాల్ మొరియా, వేమూరి ఆంజనేయశర్మ, వి.పి. రాఘవాచారి ప్రభృతులు తెలంగాణ రచయితల సంఘంలో ప్రముఖులు. ఉర్దూ ముషాయిరీలతో పోటీపడి తెలుగులో కవిసమ్మేళనాలు జరిగేవి.

గోలకొండ కవుల సంచిక

స్వస్థానంలో ఉన్న పరభాషీయులచేత, పరస్థానంలో ఉన్న స్వభాషీయులచేత తృణీకరించబడిన చరిత్ర తెలంగాణ కవులది. 1932 లో గోలకొండ పత్రిక తొమ్మిదో  సంవత్సరాది సంచికలో ముడుంబ వేంకటరాఘవాచార్యులు అనే ఆంధ్ర పండితుడు ‘ఆధునిక భావకవిత్వతత్వము’ అనే శీర్షికతో వ్యాసం రాశారు. అందులో ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్రకవులు పూజ్యము’ అని వ్యాఖ్యానించారు. ఇది ప్రతాపరెడ్డిగారిని నిద్రకు దూరం చేసింది. ఆయనలోని తెలంగాణ పౌరుషం మేల్కొన్నది. ఫలితమే ‘గోల్కొండ కవుల సంచిక.’ 1934లొ దీన్ని ప్రచురించారు. ఈ సంచికను ‘అసమగ్రమయ్యూ ప్రతి ప్రసవము సుగంధభరితము, మకరంద బంధురము’ అని శేషాద్రి రమణ కవులు కొనియాడారు. ‘కవులే లేని అనాగరికపు నేల’ అనే మచ్చను తొలగించేందుకు చేసిన మహాప్రయత్నం’గా తెలుగు సాహిత్యానికంతటికీ ఎత్తిన ‘నీరాజనం’గా ఆచార్య పి. యశోదారెడ్డి ప్రశంసించారు. ‘వెక్కిరించినవారికి విద్యుదాఘాత సదృశ సమాధానం’ అంటూ ఆచార్య బిరుదురాజు రామరాజు వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రుల అవహేళనను అరికట్టి వారికి బుద్ధి చెప్పడానికి సంబంధించిందే ఈ సంచిక’ అని గడియారం రామకృష్ణ శర్మ ప్రస్తుతించారు. ‘తెలుగు సాహిత్యంలో ఇంతటి విశేషమైన సంచిక కనిపించదు’ అంటూ ఆచార్య అనుమాండ్ల భూమయ్య ప్రశంసించారు.

గోలకొండ కవుల సంచిక రూపకల్పన ఒక వ్యక్తి చేయగల  కార్యక్రమం కాదు. ఒక పెద్ద సంస్థ చేయవలసింది. కమ్యూనికేషన్ సదుపాయాలు బొత్తిగా లేని రోజులలో వందలమంది కవులను గుర్తించి, వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని, ఫోటోలు సంపాదించి వాటిని గ్రంథస్తం చేయడం బృహత్కార్యం. ఈ పనిలో సైతం ప్రతాపరెడ్డి అత్యంత ప్రజాస్వామ్యంగా వ్యవహరించారు. పది తెలుగు జిల్లాలలకు, 16 కులాలకు, నాలుగు మతాలకు, 12 మంది స్త్రీలకు, రెండు భాషలకు స్థానం కల్పించారు. వివరాలు పంపిన కవులందరినీ సంచికలో చేర్చారు. కవితావస్తువుల ఎంపికలో కవుల అభీష్టాన్ని గౌరవించారు. కవి పరిచయం ఫోటోలతో సహా ప్రచురించారు. 354 మంది సమకాలికుల రచనలను సంకలనం చేయడంతో పాటు 183 మంది ప్రాచీన కవుల జాబితా కూర్చడం ద్వారా తెలంగాణ సాహిత్య చరిత్ర రచనకు నాంది పలికారు. ముడుంబ రాఘవాచార్యుల వ్యాసాన్ని అక్షరం మార్చకుండా ఉన్నదున్నట్టు అచ్చువేయడం ప్రతాపరెడ్డిగారి ప్రజాస్వామ్య స్వభావానికి అద్దం పడుతుంది. సంపాదకీయంలో ‘స్వకీయాభిమానము పరకీయ ద్వేషముగా నిర్ణయించుట అన్యాయము. బ్రిటీషాంధ్రుల పట్ల ద్వేషముగాని, దురభిప్రాయముగాని లేదని తెలుసుకొందురుగాక,’ అని ప్రకటించారు. ఈ పుస్తకం శాశ్వత చారిత్రక కవిలె కావాలని ప్రతాపరెడ్డిగారి సంకల్పం. ఆయన దీని ద్వారా ఆశించిన మొదటి ప్రయోజనం ‘నిజామురాష్ట్రాంధ్రుల వాడిపోవుచున్న ప్రతిభాలతకు నూతన జీవకళ నాపాదించుటం.’ ‘నివురుగప్పిన నిప్పువలెనున్న ఇచ్చటి కవుల ప్రజ్ఞాపాండితీ విభవములను ప్రచారము చేయుట రెండో ప్రయోజనం. ‘బయటివారికి ఈ విషయములో గల భ్రమలను తొలగించుట’ మూడో ప్రయోజనం. కవితలలో భావనాశక్తి, సృజనాత్మకత, భాషాపాటవం పుష్కలంగా ఉన్నాయి. గోలకొండ కవుల సంచిక తెలంగాణలో అప్పటి సాంఘిక పరిస్థితులను విశ్లేషించడానికీ, తెలంగాణలో ఆనాటి (1890-1934) నలభయ్యేళ్ళ కవత్వ స్వరూపాన్ని అంచనా వేయడానికీ ఉద్దేశించినది. శిల్పంపరంగా ఇతర ప్రాంతాల, ఇతర కాలాల కవులకు తీసిపోని విధంగా ఉన్నది.

‘బాంచన్ దొర’ నుంచి బందూకు దాకా

బ్రిటీషాంధ్రలో జరిగిన ఆధునిక వికాసం నిజామాంధ్రలో లేదా హైదరాబాద్ సంస్థానంలో లేదు. ప్రధమ స్థానం ఉర్దూ భాషకు ఇస్తే, ద్వితీయ స్థానం మరాఠీకి ఉండేది. తెలుగు మూడో స్థానంలో ఉండేది. తెలుగు మాట్లాడేవారు ప్రజలలో 90 శాతంమంది ఉండేవారు. భూమిపైన అధికారమంతా రాజుదీ, జమీందార్లదీ, జాగీర్దార్లదీ. వెట్టిచాకిరీ, పన్నుల విధానం గ్రామీణ రెతుల్ని కూలీల్ని హింసపెట్టింది. బానిస  జీవితంలోని వ్యధను కవితలలో పలికిస్తూ బంధాలు తెంచుకోవడానికి పోరాడమనీ ఉద్బోధిస్తూ కవితలు రాశారు తెలంగాణ కవులు. రెండు, మూడు దశాబ్దాలలోనే తెలంగాణ ప్రజలు ‘బాన్చెన్ దొరా’ అనడం మానేసి దొరలపైన పోరాటానికి  బందూకు పట్టడం వరకూ ఎదిగారు. అది చాలా తక్కువ కాలంలో సంభవించిన పరిణామం. కమ్యూనిస్టులను వ్యతిరేకించిన ప్రతాపరెడ్డి తెలియకుండానే అటువంటి పరిణామానికి ఎంతోకొంత దోహదం చేశారు.

‘‘స్త్రీలకూ, శూద్రులకూ మనమతమందు హక్కులేనాడు తగ్గెనో నాటి నుండియు మతము క్షీణించెననుటలో సందేహము లేదు’’ అని రాశారు సురవరం ప్రతాపరెడ్డి. స్త్రీచరిత్రనే సామాజిక చరిత్ర అని చెప్పినవారిలో ప్రథములు ఆయన. బాల్య వివాహం గురించీ, బాలిక దుర్భర వైధవ్యం గురించీ సామాజిక సంస్థలు పట్టించుకోవాలని ఉద్బోధించారు.

 ‘‘పూర్వాచార పరాయణులు చీమలకు నూకలు చల్లుదురు. పాములకు పాలు  పోయుదురు. పిట్టలకు ధాన్యం చల్లుదురు. గోరక్షణ కొరకు ప్రాణములర్పింతురు. కాని తమ కూరిమి బిడ్డలు కలకాలము దు:ఖమున గడుపుచుండ ఇంచుకేనియు చలింపరు. వీరు బాల్య వివాహములను నీతితో ముడివేతురు. ఈ నీతిని మతముతో పెనవేతురు. ఈ మతమను కొరడా పుచ్చుకొని స్త్రీ జాతినంతటిని చావగొడుతున్నారు. వారి శరీర పాటవమును అణచివేయుచున్నారు. స్వాభిమానమును చంపివేయుచున్నారు. మనోవికాసమును అణగద్రొక్కుచున్నారు,’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు.

రాజబహుద్దూర్  వెంకట్రామారెడ్డి జీవిత చరిత్ర

రాజబహద్దూర్ వెంకట రామారెడ్డి, ఓబీఇ పేరుతో వెలువడిన జీవిత చరిత్ర ప్రశస్తమైనది. 1939లో మొదటిసారిగా ప్రచురించారు. ప్రకాశకుల నివేదనలో మాడపాటి హనుమంతరావుగారు ఈ విధంగా రాశారు: ‘‘నిజాం రాష్ట్రంలోని మహాశయులలో ప్రభుసేవయందును, దేశ సేవయందును, విద్యాపోషణయందును, పరోపకార పారీణత యందును నిరుపమాన ఖ్యాతి గడించినవారును, బాలికల పాఠశాలకు ముఖ్యులగు పోషకులను పాలక కమిటీ అధ్యక్షులును అయిన శ్రీ రాజబహద్దూరు వేంకటరామారెడ్డి ఓ.బి.ఇ. స్పెషలు ఆఫీసరు సర్ఫెఖాసు ముబారకు గారి బోధ ప్రబోధమగు జీవిత చరిత్రమును శ్రీవారి డెబ్బదియవ వత్సరారంభమున ప్రకటించు భాగ్యము లభించినందుకు గర్వపడుచున్నాము.’’

ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతి, బహుభాషావేత్త, సుప్రసిద్ధ రచయిత, ఆధునికాంధ్ర సాహిత్య విమర్శక సూత్రధారి అయిన సర్ కట్టమంచి రామలింగారెడ్డిగారు ఈ జీవిత చరిత్ర గ్రంథానికి ‘ప్రస్తావనము’ రచించారు.

అమెరికా అధ్యక్షులుగా పని చేసిన అబ్రహాం లింకన్, జనరల్ గార్ ఫీల్డ్ కట్టెగుడిసెలలో పుట్టి, బాల్యదశలో విద్యాసౌకర్యము లేక కష్టపడినప్పటికీ శ్రమించు నైజము, నిజాయితీ, సాహసం, ఇతరులతో వాదించి ఒప్పించే మెలకువల వల్ల వారిద్దరూ శ్వేతసౌధమున అడుగుపెట్టారు. అదే విధంగా వెంకటరామారెడ్డి తల్లిదండ్రులు చిన్నతనంలోనే గతించారు. తనను సాకుతున్న మేనమామ కూడా మరణించారు. చివరికి తనకు తోడూనీడా ఎవ్వరూ లేక అమీనా ఉద్యోగంలో చేరి స్వయంకృషి, నీతీ, నిజాయితీ కారణంగా హైదరాబాద్ నగర కోత్వాల్ పదవికి ఎదిగారని ప్రతాపరెడ్డిగారు వివరించారు.

ప్రతాపరెడ్డిగారు ఏడువందల వ్యాసాలు రాశారని ఒక అంచనా. గోల్కొండ పత్రిక, పినాకిని, కళ, రెడ్డిరాణి, విభూతి మొదలైన పత్రికలలో ఆయన రాసిన వ్యాసాలను ఒక చోట చేర్చవలసిన అవసరం ఉంది.

ప్రతాపరెడ్డిగారు అధ్యక్షత వహించిన తొలి నిజామాంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది. ప్రపథమంగా తన గురువు వేదం వేంకటరాయశాస్త్రి మృతిపట్ల సంతాపతీర్మానం ప్రవేశపెట్టారు. నిజామాంధ్ర మహాసభలలో క్రమంగా తెలుగు సాహిత్యానికి ప్రాధాన్యం తగ్గడం గమనించి ప్రతాపరెడ్డిగారు మనస్తాపం చెందారు. నిజామాంధ్ర మహాసభల వేదికపైన తెలుగులోనే మాట్లాడాలని పట్టుబట్టారు. కానీ నిర్వాహకులు ఆయన ప్రతిపాదనను పెడచెవిన పెట్టారు. నందగిరి  వెంకటరావు, వల్లూరి బసవరాజు తో కలిసి అభివృద్ధి పక్షము అని ఒక కొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ అది ఎక్కువకాలం మనలేదు. అందుకే ఆంధ్రసారస్వత పరిషత్తు ఆవిర్భావానికి ప్రతాపరెడ్డి విశేషంగా కృషి చేశారు. ప్రతాపరెడ్డిగారికి విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు వంటి బ్రిటీషాంధ్ర కవులు ఎందరో తెలుసు. విశ్వనాథ వారి ఉపన్యాససభలకు ప్రతాపరెడ్డిగారు అధ్యక్షత వహించారు.

తెలుగులిపి సంస్కరణ

1941లోనే ‘తెలుగుతల్లి’ పత్రికలో లిపి సంస్కరణకు సంబంధించి ఒక వ్యాసం రాశారు ప్రతాపరెడ్డిగారు. 56 అక్షరాలకు బదులు 28 అక్షరాలతోనే తెలుగు భాషకు లిపి సాధించవచ్చునని ఆయన తన పుస్తకంలో ప్రతిపాదించారు. అంతర్జాతీయంగా ఒకే లిపి ఉంటే బాగుంటుందని ప్రతిపాదిస్తూ ప్రతాపరెడ్డిగారు జార్జి బెర్నాడ్ షాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినట్టు ఎస్ ఎన్ రెడ్డిగారు వెల్లడించారని కె.  శ్రీనివాస్ తన పీహెచ్ డీ సైద్దాంతిక గ్రంథంలో రాశారు.

తొలి ఎన్నికలలో వనపర్తి నుంచి శాసన సభకు ఎన్నికైన ప్రతాపరెడ్డిగారు విద్యామంత్రి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ మంత్రి పదవి రాలేదు. అందుకు ఆయన బాధపడింది కూడా లేదు. ఎన్నికలలో గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కూడా గడవక మునుపే 25 ఆగస్టు 1953 ఉదయం గుండెపోటు వచ్చి దివంగతులైనారు.  

తెలుగు సాహిత్యంలో ప్రతాపరెడ్డిగారికి మించిన రచయిత, కవి, విమర్శకుడు, నాటక రచయిత, వ్యాసరచయిత, సంపాదకులు ఉండవచ్చు. ఆయనలాగా సమాజానికి సేవ చేసినవారూ, విద్యార్థి వసతి గృహాలు నిర్వహించినవారూ, ఆంధ్రసారస్వత పరిషత్తు వంటి సంస్థలను స్థాపించి, నడిపించినవారూ ఉన్నారు. కానీ ఈ పనులన్నింటినీ ఒక్కచేత్తో ప్రతిభావంతంగా చేసిన వ్యక్తి చరిత్రలో ప్రతాపరెడ్డి ఒక్కరే. అదే ఆయన ప్రత్యేకత.

(మే 28 సురవరం ప్రతాపరెడ్డిగారి 125వ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles