భారతీయ ఆంగ్ల కవులు-2
నిస్సిం ఎజేకియల్ “నైట్ అఫ్ ది స్కార్పియన్” అనే కవితలో భారతీయ జీవితాన్ని ప్రతిబింబించే దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. ఒక వర్షం రాత్రి తేలు ఓ ఇంట్లోదూరి, తల్లిని కుట్టి భయంతో బయటకు పారిపోతుంది. పొరుగు వారందరూ వచ్చేస్తారు. ఆ తేలు కదిలితే తల్లి శరీరంలో విషం ఎక్కుతుందని వారి భావన. ఈ జన్మలో ఆవిడ బాధ పూర్వ జన్మల పాప ఫలితo అనుకుంటారు. కాకపోతే భవిష్యత్తులో ఆవిడ చెయ్య బోయే పాపాలకు ఇప్పుడే పరిహారం చెల్లిస్తుందనుకుంటున్నారు. పునర్జన్మ మీద నమ్మకం కలిగిన వారి దృష్టిలో పుట్టుక ముందు, చావు తర్వాత కూడా జీవితం ఉంది. కాబట్టి వారు ప్రశాoతంగా అక్కడ కుర్చుంటారు. కాని హేతువాదిగా భావించబడే అమె భర్త మంత్ర తంత్రాలన్నీవాడి అవి పనిచేయక చివరకు ఆవిడ కాలిమీద మైనం పోసి అగ్గిపుల్లతొ వెలిగిస్తాడు. సగటు భారతీయుడిలా అతనికి నిజంగా హేతువాదం కాని మరొకటిగాని పూర్తిగా నమ్మకం లేదన్న విషయం నిరూపిత మవుతుంది. చాలా గంటల తర్వాత తల్లి నొప్పితగ్గినపుడు ఆమె అంటుంది, ‘దేవుడి దయవల్ల ఆ తేలు నా బిడ్డలను కుట్ట లేదు’ అని. ఈ కొస మెరుపుతో ఈ కవిత భారతీయుల నమ్మకాల గురించా లేక తల్లి ప్రేమ గురించా అనే ఆలోచనలో పడేస్తాడు కవి మనల్ని.
Also read: https://www.sakalam.in/indian-english-poet-ramanjuan/