- భారత ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ రమణ విడుదల
- జస్టిస్ గుప్తా, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఖన్వల్కర్ ప్రశంస
దిల్లీ: మీడియాకు సుప్రీంకోర్టు వాదనలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించే యాప్ ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వెంకటరామణ గురువారంనాడు ప్రారంభించారు. మీడియా మిత్రులు ప్రతిసారీ కోర్టుకు రానక్కరలేదనీ, ఇంట్లో ఉంటూనే అత్యున్నత న్యాయస్థానంలో జరిగే కార్యక్రమాలను వీక్షించవచ్చుననీ చెప్పారు. ప్రతిరోజూ న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల సంగ్రహాన్ని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పెట్టడానికి ఏర్పాటు చేశామని కూడా జస్టిస్ రమణ తెలియజేశారు. సుప్రీంకోర్టులో జరిగే వాద, ప్రతివాదాలను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయం కూడా ఆలోచిస్తున్నామని జస్టిస్ రమణ వెల్లడించారు. ఈ విషయంలో సహచరులతో సమాలోచన జరిపి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మీడియా మిత్రులతో సమాచారం పంచుకునేందుకు సుప్రీంకోర్టు తరఫున ఒక అదికారిని నియమించబోతున్నట్టు కూడా చెప్పారు.
Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు
ఈ సందర్భంగా జస్టిస్ గుప్తా మాట్లాడుతూ మీడియా మిత్రులు తమకు వచ్చిన వీడియోలను ఇతరులతో పంచుకోకుండా ఉంటే మంచిదని సూచించారు. తాను మాటవరుసకు చీఫ్ జస్టిస్ తో మీడియా విషయం ప్రస్తావించాచననీ, మూడు రోజులలో ఈ ఏర్పాటు చేశారనీ, ఆయనకి అన్నీ తెలుసునని, ప్రచారం గిట్టని వ్యక్తి కనుక ఈ విషయం తానే చెబుతున్నాననీ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. మీడియా సమాచార వితరణలో చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ సదుపాయం కల్పించడం బాగున్నదని జస్టిస్ ఖన్విల్కర్ అన్నారు.
Also read: ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే
‘‘సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు దేశ ప్రజల జీవితాలపైన విశేషమైన ప్రభావం వేస్తాయనీ, ఆ తీర్పులను సవ్యంగా ప్రజలకు చేరవేయడం చాలా అవసరమనీ జస్టిస్ రమణ అన్నారు. ‘‘పారదర్శకత అన్నది ఎంతో కాలంగా పాటిస్తున్న సదాచారం. మన న్యాయవ్యవస్థ ముఖ్యంగా పారదర్శకంగా వ్యవహరించాలి. కేసుల విచారణ బహిరంగంగానే జరుగుతోంది. కేసు వేసినవారూ, న్యాయవాదులు మాత్రమే కాకుండా కోర్టు వ్యవహారాలలో ఆసక్తి కలిగిన సాధారణ ప్రజలు కూడా కోర్టుకు వచ్చి వాదనలు వినే అవకాశం ఉంది. సరిపోను జాగా లేకపోవడం, భద్రతా సమస్యల కారణంగా కొన్ని పరిమితులు విధించవలసి వచ్చింది.
Also read: ఒపీనియన్ పోల్స్ బ్యాన్ చేయాలా?
‘‘ప్రజలకు కోర్టు వ్యవహారాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కోర్టు తీర్పుల ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలపైన ఉంటుంది కనుక న్యాయవ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలి. కోర్టు సమాచారాన్ని ప్రజలకు అందించడంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది,’’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.
జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత పౌరహక్కులకు ప్రాధాన్యం ఇస్తున్నారనీ, ప్రభుత్వంపైన కూడా సద్విమర్శలు చేయడానికి జంకడం లేదనే మంచి పేరు వచ్చింది. మీడియా పట్ల ఆయన ప్రదర్శించిన వైఖరి కూడా స్వాగతింవలసిందే.
Also read: హైదరాబాద్ సంస్కృతికి సముజ్జ్వల ప్రతీక నరేంద్ర లూథర్
తెలుగు జర్నలిస్టుల పరిస్థితి అధోగతి
తెలుగువారైన జస్టిస్ రమణ మీడియా విషయంలో ఇంత ఉదారంగా ఉంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం మీడియాను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి కనీసం అరవై మంది మీడియా ప్రతినిధులు కోవిద్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మీడియా ప్రతినిధికి రూ. 2 లక్షలు ఇస్తామని ప్రకటించడం దారుణం. డాక్టర్లు, పేరామెడికల్ సిబ్బంది. పోలీసులు, పారిశద్ధ్యపనివారితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. వారి గురించి ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవ్వరూ కూడా ఒక మంచి మాట మాట్లాడలేదు. వారి కుటుంబాలకు సహాయం చేస్తామని కానీ, వారిని ఆదుకుంటామని కానీ హామీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మాటలకే పరిమితం అవుతున్నారు. తెలంగాణలో సమాచారశాఖ చాలా శాఖలతో పాటు ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. జర్నలిస్టుల సంఘాలు బలంగా లేవు. నాయకులందరూ ఎవరి బాధలలో వారు ఉన్నారు. గట్టిగా నిలదీసి అడిగే ఆస్కారం లేదు. ప్రాధేయపడితే పట్టించుకునే నాధుడు లేడు. ఎవరైనా జర్నలిస్టుల తరఫున న్యాయస్థానంలో పిల్ వేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో, కోర్టులు చెబితే ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారేమోనని ఆశించాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల పని దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇచ్చే విషయంలో కూడా కోర్టు పరిశీలనలో ఉండటం అన్యాయం.
Also read: నెహ్రూ భారత్ ను కనుగొంటే పీవీ పునరావిష్కరించారు : శశిథరూర్