ఎం. నాంచారయ్య
సీనియర్ జర్నలిస్ట్
గురువారం ఉదయం 9 గంటలకు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన ఎంకే స్టాలిన్ తో పాటు మంత్రిగా ప్రమాణం చేసిన డీఎంకే సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ 1989 మార్చి25న తమిళనాడు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు జయలలిత తలపై కొట్టి, ఆమె చీరను ఉద్దేశపూర్వకంగా లాగాడనే ఆరోపణ ఎదుర్కొన్నాడు. అప్పుడు జయ వయసు 40 ఏళ్లు, దురైమురుగన్ వయస్సు 51. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దురైమురుగన్ ఆయన కాబినెట్లో సభ్యుడు. మళ్లీ ఇప్పుడు 68 ఏళ్ల స్టాలిన్ కేబినెట్లో 82 ఏళ్ల మురుగన్ చేరుతున్నారు. ఆయన మొదటిసారి 1971లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కాట్ పాడి (చిత్తూరు జిల్లా సరిహద్దులోని ఊరు) ఎమ్మెల్యే. ఇప్పటికి కాట్ పాడి, రాణీపేట్ సీట్ల నుంచి 12 సార్లు పోటీచేసి పది సార్లు గెలిచారు. కరుణ మరణించాక ప్రధాన కార్యదర్శి అయ్యారు.
జయ ముఖ్యమంత్రిగా ఉండగా దురైమురుగన్ కు కష్టాలు తప్పలేదు. 01 జులై 1938న పుట్టిన ఆయన ఇప్పుడు మరోసారి మంత్రి అవుతున్నారు. ఆయన 1971లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 1978లో గెలిచిన ఎంఎల్ఏలలో నారా చంద్రబాబు నాయుడూ, కరణం బలరామమూర్తి ఇద్దరే ఇప్పటికీ శాసనసభలో ఉన్నారు. 1971లో గెలిచోనోళ్ళు ఒక్కరూ లేరు. తెలంగాణలో 1978లో ఎంఎల్ఏ అయినోళ్లే ఒక్కరూ లేరు. అలాగే కెకెఎస్ఎస్ ఆర్ రామచంద్రన్ (రెడ్డియార్) అనే సీనియర్ కూడా మంత్రుల లిస్టులో ఉన్నారు. దురై మురుగున్ కుమారుడు కతీర్ ఆనంద్ 2019లో వెల్లూరు నుంచి లోక్ సభకు ఎన్నికైనారు.