Thursday, November 21, 2024

భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

భారత, రష్యా అధినేతలు నరేంద్రమోదీ, పుతిన్ తాజాగా ఫోన్ లో సంభాషించుకున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునే దిశగా మరింత తరచుగా సమాగమం అవ్వాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. 2+2 మంత్రుల స్థాయిలో సంభాషణలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు తరచూ మాట్లాడుకోవడమే ఈ ప్రత్యేక ఏర్పాటు లక్ష్యం. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన సందర్భంగా రష్యా అధినేతకు నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి కాళ్ళకూరి

స్వాగతించవలసిన పరిణామమే

అదే సమయంలో, రెండు దేశాల బంధాల పటిష్ఠతకు పధక రచన చేయాలని సంకల్పించుకున్నారు. ఇది మంచి పరిణామమే. గత కొంతకాలం నుంచి భారత్ – రష్యా మధ్య సంబంధాలు సజావుగా లేవు. పెద్ద శతృత్వం లేకపోయినా, మునుపటి వలె స్నేహబంధం లేదు. బంధాలు దెబ్బతినే వాతావరణం మెల్లగా అలుముకుంటోంది. ఈ దశలో, తాజా సంభాషణలో తీసుకున్న నిర్ణయం వివేకభరితం. ప్రస్తుతం, కరోనా ప్రభావంతో భారతదేశం గడగడ వణికిపోతోంది. ఎన్నో దేశాల నుంచి మద్దతును కూడగట్టుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. అదృష్టవశాత్తు అమెరికా మొదలు అన్ని దేశాలూ భారత్ కు అండగా నిలవడానికి సిద్ధమయ్యాయి.

స్పుత్నిక్ టీకా వస్తోంది

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్- వి వ్యాక్సిన్ ఇప్పుడు మనకు ఎంతో అవసరం. 139కోట్ల జనాభాకు సరిపడా వ్యాక్సిన్లు అందజేయడం మన ముందున్న పెద్ద సవాల్. ఫైజర్ వంటి విదేశీ వ్యాక్సిన్లు కూడా త్వరలో మన దగ్గరకు రానున్నాయి. దేశ ఆరోగ్యాన్ని, ఉనికిని, ప్రగతిని, రక్షణను మరింతగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన గడ్డు పరిస్థితిలో భారత్ ఉంది. మొదటి నుంచీ రక్షణ రంగంలో రష్యాపై మనం ఎక్కువగా ఆధారపడ్డాం. ఇప్పటికే కొనుగోళ్లు సాగుతూనే ఉన్నాయి. ఒప్పందాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ధికపరంగా రష్యా కంటే భారత్ మెరుగ్గా ఉంది. కానీ, కొన్ని రంగాల్లో మనం ఆ దేశం కంటే వెనుకబడే ఉన్నాం. రోదసి, పునరుత్పాదన ఇంధనం, హైడ్రోజన్ రంగాల్లో రష్యా సహకారం మనకు అవసరం.

Also read: సకల సద్గుణ సంపన్నుడు హనుమ

పరస్పర సహకారం

ఈ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని తాజాగా రెండు దేశాలు నిర్ణయానికి రావడం మంచి పరిణామామే.గగన్ యాన్ లో పాల్గొనే భారత వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇస్తోంది.ఇవన్నీ మంచి విషయాలే ఐనప్పటికీ, భారత్ స్వయంసమృద్ధి సాధించడం అత్యంత అవసరం. మనం మనంగా ఎదగడం పైనే మన విదేశీ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే అనేక రంగాలకు సంబంధించి అమెరికా, చైనా, రష్యా మొదలైన దేశాలపై మనం ఆధారపడాల్సి వస్తోంది. దాని వల్ల ఆ దేశాల ముందు మనం చులకనై పోతున్నాం. ఇవన్నీ అవసరంతో కూడిన,అవకాశవాద, ఆర్ధిక సంబంధాలే తప్ప, పారదర్శకత, ప్రేమతత్త్వం, ఉదార స్వభావం లేవు. అందుకే, ఏ రెండు దేశాల మధ్యా శాశ్వతమైన బంధాలు ఏర్పడడం లేదు.

మానవ సంబంధాలు

 రాజనీతి ఎలా ఉన్నా, దానికి అతీతమైన మానవ సంబంధాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ సమయం వరకూ, ముఖ్యంగా సోవియట్ యూనియన్ ఉన్నంత వరకూ రెండు దేశాల మధ్య బంధాలు దృఢంగా ఉన్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నమైంది. రష్యా ప్రత్యేక రాజ్యంగా ఏర్పడింది. అప్పటి నుంచి బంధాల్లో మార్పులు వచ్చాయి.1991లో పీవీ నరసింహారావు అధికారంలోకి వచ్చారు. చైనా ఎదుగుదల కూడా పెరుగుతోంది. చైనా -భారత్ బంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రష్యాతో బంధాలను కాపాడుకుంటూనే, అమెరికాతో బంధాలను పెంచుకోవాల్సిన వ్యూహాత్మక పరిస్థితి మనకు వచ్చింది.

Also read: సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం

అమెరికాతో బలోపేతమైన బాంధవ్యం

ఆ దశలో, పీవీ నరసింహారావు తన చాణక్యంతో అమెరికాతో బంధాలను బలోపేతం చేశారు. తాజాగా,  నరేంద్రమోదీ సమయంలోనూ ఆ బంధాలు మరింత పెరిగాయి. అమెరికాకు మనం దగ్గరయ్యే కొద్దీ – చైనాకు దూరమవుతూ వచ్చాం. అదే సమయంలో, చైనా – రష్యా మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. ఈ పరిణామంతో చైనా ప్రభావంతో భారత్ – రష్యా మధ్య స్నేహ సంబంధాలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఉన్న కాలంలో అటు చైనాతో – ఇటు రష్యాతో అమెరికాకు తగాదాలు పెరిగాయి. అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న మనపై కూడా ఇవి ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలో రష్యా – భారత్ బంధాలు సంకటంలో పడ్డాయి. ముందు ముందు ఎటువైపు సాగుతాయో? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

అమెరికా, చైనా ఆధిపత్య పోరు

అమెరికా – చైనా దేశాల ఆధిపత్య పోరు మనకు నష్టం తెస్తోంది. చైనా వలె, రష్యాకు కూడా సామ్రాజ్య విస్తరణ కాంక్ష బాగా పెరుగుతోంది. ఈ ధోరణి ప్రపంచ దేశాల మధ్య అనారోగ్య వాతావరణాన్ని సృష్టిస్తోంది. దానికి తోడు  చైనా అధిపతి జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ ఇద్దరూ దూకుడు స్వభావం కలిగినవారు కావడం దురదృష్టకరం. ఈ తరుణంలో  విదేశీ సంబంధాలను కాపాడుకోవడం, మెరుగు పరచుకోవడం భారత్ కు కత్తి మీద సాము వంటిది. కత్తికి ఎంత పదును పెట్టినా సరిపోదు. మనకంటూ శక్తివంతమైన సొంత ఆయుధాలు ఉండాలి. అవి సమృద్ధిగా లేకపోవడమే మన వైఫల్యం, మన వెనుకుబాటుతనం. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతోంది. “స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి” అని శ్రీశ్రీ అన్నట్లు, ఆచరణలో అనంతమైన అభివృద్ధి సాధించడం ఎంతో ముఖ్యం. మనకంటే, చైనా దాదాపు పదేళ్లు ముందు ప్రగతి ప్రయాణం ప్రారంభించింది. అంతటితో ఆగక, మనకంటే ఎన్నో రెట్లు అభివృద్ధిని గడించింది. ఈ రేసులో మనం వెనుకబడిపోయాం.  అగ్రరాజ్యంగా తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి అమెరికా తనవంతు కృషి చేస్తూనే వుంది. చైనా అండతో మరింతగా ఎదగాలని రష్యా చూస్తోంది. వీటన్నిటిని చూస్తూ, భారతదేశం ప్రేక్షక పాత్ర పోషించకుండా, తన అడుగులను మరింత బలంగా వేయాల్సి వుంది.

రష్యా మధ్యవర్తిత్వం

మొత్తం ఈ వ్యవహారంలో రష్యా స్థానం కీలకమైంది. అటు పాకిస్తాన్ – ఇటు భారత్ – అటు చైనా మూడు దేశాలతో బంధాలు కలిగిన దేశం రష్యా. ఈ మూడు దేశాల మధ్య నెలకొనివున్న విభేదాలను, వివాదాలను ఎంతో కొంత మేరకు తగ్గించగల వెసులుబాటు రష్యాకు ఉంది. రష్యా మధ్యవర్తిత్వం వహిస్తే కొన్ని సమస్యలు సమసిపోతాయి. ఈ దిశగా భారత్ కదలాల్సి వుంది. అమెరికాతో బంధాలను మెరుగుపరచుకుంటూనే, రష్యాతో సంబంధాలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్ కు ఉంది. అన్నింటి కంటే ముఖ్యం స్వయం సమృద్ధిని సాధించడం. దీనిపై మన ఏలికలు దృష్టి సారించాలి. అదే సమయంలో సమాంతరంగా,ఇరుగుపొరుగు దేశాలతో ద్వైపాక్షిక బంధాలను పటిష్ఠం చేసుకోవాలి.2+2 మంత్రుల స్థాయిలో త్వరలో ప్రారంభం కానున్న సమావేశాలు భారత్ – రష్యాల మధ్య గొప్ప వారధులను నిర్మించాలని కోరుకుందాం.

Also read: భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles