Sunday, November 24, 2024

ఈ సారైనా వలస కార్మికుల గురించి ఆలోచించారా?

గత సంవత్సరం దాదాపు ఇదే సమయంలో వలస కార్మికులకు కష్టాలు ఆరంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో, కార్మికుల కష్టాలు అంతకు మించిన విషాదాన్ని సృష్టించాయి. అది వర్ణనాతీతం. వలస కార్మికులు ఎక్కువగా ఉండే మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులోకి వచ్చాయి. పెరుగుతున్న ఉధృతి, సదుపాయాల లేమి, వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో, కొన్ని రోజుల నుంచి కార్మికుల వలసలు మొదలయ్యాయి.

ఉన్నపళంగా లాక్ డౌన్

ఊపిరి పీల్చుకొనే వీలివ్వకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా, పోయిన సంవత్సరం ఉన్నపళంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. సర్వ రవాణా వ్యవస్థలు స్థంభించాయి.ఉపాధి దారులు మూసుకుపోయాయి. బతికుంటే బలుసాకైనా తినవచ్చని ఎల్ల వలస కార్మికలోకం ఇంటిదారి పట్టింది. వేలాదిమంది కార్మికులు పిల్లాజెల్లాతో, చేతిలో చిల్లిగవ్వ లేక, ఆకలి దప్పులతో, దారి మధ్యలో తలదాచుకోడానికి రవ్వంత చోటు దొరకక, వందల కిలోమీటర్లు నడిచి సొమ్మసిల్లి బతుకు జీవుడో అంటూ చివరకు ఎలాగో సొంతూర్లు చేరారు. దారిలో కొందరు మరణించారు కూడా. అంతటి విషాదాన్ని గత సంవత్సరం మిగిల్చింది.

మళ్ళీ వలసలు మొదలు

ఇప్పుడిప్పుడే వలసలు మొదలవుతున్నాయి, ఆంక్షలు ఆరంభమవుతున్నాయి. ఈ తరుణంలో, కార్మికుల వలసల అంశంలో, ప్రభుత్వాలు ముందస్తుగా ఎవైనా ప్రణాళికలను రూపొందించాయా, వ్యూహ రచన చేశాయా, అన్నది ఇంతవరకూ తెలియరాలేదు. కార్మికులకు రవాణా సదుపాయాలు, ఆహారం, విడిది సౌకర్యాలు, అందుబాటులో వైద్యం ఎంతో ముఖ్యం. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ కార్మికులకు ఉపాధి ఎలా సాగుతుంది? సొంత ఊర్లు చేరిన తర్వాత ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంలో స్పష్టమైన పధక రచన చేసిన జాడలు కనిపించడం లేదు. పోయిన సంవత్సరం సొంత ఊర్లకు వచ్చినవారిలో కనీసం సగంమంది తిరిగి తమ కార్యక్షేత్రాలకు చేరినట్లు సమాచారం. తిరిగి మళ్ళీ ఇప్పుడు వారు వలసబాట పడుతున్నారు.

ఒక్క ముంబయ్ లోనే లక్షలమంది

గత సంవత్సరం, ఒక ముంబయి నుంచే సుమారు 5 లక్షలకు పైగా కార్మికులు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కరోనా కష్టాలు తొలగిపోతున్నాయానే అశాభావంతో, వారిలో సగంమంది (సుమారు 2-3 లక్షలు) తిరిగి పనుల్లోకి చేరిపోయారు. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆ ఆలోచనలో ఉన్నాయి.రవాణా వ్యవస్థలు రద్దవుతాయని, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారని, ఉపాధి ప్రశ్నార్ధకమవుతుందనే భయాలు వలస కార్మికులలో మొదలయ్యాయి. ఏ రైలు కనిపిస్తే ఆ రైలెక్కి తిరుగు ప్రయాణం బాట పడుతున్నారు. వీరితో  రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సు స్టాండులు,బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.

నిబంధనలు గాలికి

సామాజిక దూరం మృగ్యమైపోతోంది. స్కానింగ్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం దాదాపు అసాధ్యంగా ఉంది. స్టేషన్ల దరిలో, తగినన్ని అంబులెన్సులు కూడా లేవు.కొత్త వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతున్న వేళ ప్రభుత్వాలు సరియైన చర్యలు తీసుకోకపోతే వీరిలో, వీరి వల్ల కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఇంత కష్టపడి ఊర్లు చేరినవారికి, పల్లెల్లో పనులు దొరికితే, వారికి కొంత ఊరట లభిస్తుంది.సొంతఊరు వదిలి వేరేచోట్ల బతుకుతున్నవారిలో పేద కార్మికులకు తోడు, రోజువారీ పనులు చేసుకొనే చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. వలస కార్మికుల్లో ఎక్కువ శాతంమంది ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారని సమాచారం. మిగిలిన రాష్ట్రాలవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ మహారాష్ట్ర, దిల్లీలో ఉంది. మెల్లగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటాయనే విషయాన్ని కొట్టిపారేయలేం.

ఎప్పుడేనిర్ణయం తీసుకుంటారో తెలియదు

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో, కేంద్రం ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, కఠిన నిబంధనలను అమలుచేయవచ్చు. ఈ సందర్భంగా, గత సంవత్సరం వలె కాక, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, ప్రత్యామ్నాయ మార్గాలను పకడ్బందీగా రూపాందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వలస కార్మికుల విషయంలో, పోయిన సంవత్సరం, ప్రభుత్వాల అలసత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహించింది.ఈసారి అటువంటి కష్టాలు ఎవ్వరికీ కలుగకుండా, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతాయాన్ని ఆశిద్దాం. సాగాలని బలంగా కోరుకుందాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles